అత్యంత కీలకం - మొబైల్ సందేశం

 

 

ఎస్ఎంఎస్ అనగానే ముఖం చిట్లించుకునే వారు మనలో చాలామందే ఉంటారు. ఎందుకంటే, ఆ వచ్చే ఎస్ఎంఎస్‌లలో నిజంగా ముఖ్యమైనవి ఒకటి అరా ఉండవచ్చు లేదా ఏమీ ఉండకపోవచ్చు. వాటిలో చాలావరకూ వాణిజ్య ప్రకటనలు లేదా పుట్టినరోజు, పెళ్లిరోజు, పండుగలు,  న్యూ ఇయర్, వాలెంటైన్స్ డే, విమెన్స్ డే, మదర్స్ డే లాంటి వాటికి  సంబంధించిన అభినందన సందేశాలే. ఇక సెకెండ్‌కు పైసా పల్స్ రేట్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ల ద్వారా మనం అందుకునే ఎస్ఎంఎస్‌ల ప్రాధాన్యత ఇంకా తగ్గి వెలవెలబోతున్నాయి.

 

ఈ పరిస్థితుల్లో ఎస్ఎంఎస్‌ల ప్రాధాన్యతను పెంచే సరికొత్త ఆవిష్కరణలు మన సమాజంలోకి అడుగుపెట్టాయి. అవేమిటో ఇప్పుడు కాస్త పరిశీలిద్దాం...


టెక్‌మెట్ ఈ హెల్మెట్

ఆ మధ్య మొహిత్ మిట్టల్, రాజన్ గుప్తా అనే ఇద్దరు ఐఐటీ విద్యార్థులు 'టెక్‌మెట్' పేరుతో ఒక కొత్త హెల్మెట్ రూపొందించి ఐఐటీల వార్షిక టెక్ ఫెస్టివల్ అయిన 'శాస్త్ర - 2009'లో ప్రదర్శించారు. ఈ హెల్మెట్ ప్రత్యేకత ఏమిటంటే దానికి ఆల్కహాల్ సెన్సార్ అమర్చారు. ఫలితంగా, ఆల్కహాల్ సేవించి బైక్ నడిపే ప్రయత్నం చేస్తే ఈ హెల్మెట్ వార్నింగ్ ఇస్తుంది. బైక్ ఇంజన్ స్టార్ట్ కానివ్వదు.

 

ఒకవేళ అనుకోకుండా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం వివరాలతో ఈ హెల్మెట్ నుంచి అంబులెన్స్‌కు, పోలీస్ స్టేషన్‌కు, రైడర్ సంబంధీకులకు ఎస్ఎంఎస్ పంపుతుంది. వీటికి సంబంధించిన మొబైల్ నంబర్లను ముందుగానే ఫీడ్ చేసుకునే సదుపాయం ఆ హెల్మెట్‌లో ఉంది. ఇందుకోసం ఈ హెల్మెట్‌లో జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించారు. బ్లూటూత్ ద్వారా హెల్మెట్‌కు కనెక్ట్ అయి ఉన్న మొబైల్ ఫోన్ ద్వారా ఈ పనులన్నీ చకచకా జరిగిపోతాయి. రైడర్ నడిపే బైక్ దేనినైనా గుద్దుకున్నప్పుడు ఆ శబ్ద తీవ్రత పరిమితిని అంచనా వేసి సందేశాన్ని పంపుతుంది.


నాలుగు చక్రాలకు కూడా...

ఇంతేకాదు, ఇదే సదుపాయాన్ని నాలుగు చక్రాల వాహనాలకూ ఏర్పాటు చేసుకునే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కార్లు లేదా బస్సులను ఎక్కడైనా పార్క్ చేసి యజమానులు అలా పక్కకు వెళ్లినప్పుడు ఈ వాహనాలను ఎవరైనా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తే వారి భరతం పట్టే ఎస్ఎంఎస్ టెక్నాలజీ రంగప్రవేశం చేసింది. దొంగలు బలవంతంగా తలుపు తెరిచే ప్రయత్నం చేస్తుండగానే యజమానుల మొబైల్ ఫోన్లకు వార్నింగ్ మెసేజి వెళ్లిపోతుంది. మరికొన్ని రోజులాగితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దుకాణాలు, ఇళ్లలో జరిగే దొంగతనాలను నిరోధించేందుకు కూడా ఉపయోగించుకోవచ్చు.

 

పైన తెలిపిన సరికొత్త ఆవిష్కరణల నేపథ్యంలో సినిమా, రైలు, బస్సు టిక్కెట్లు, గ్యాస్ బుకింగ్, పోలీస్ స్టేషన్లకు ప్రమాదాలు, దొంగతనాల సమాచారం చేరవేత వంటి పలు రకాల సందర్భాల్లో ఎస్ఎంఎస్‌లకు మరింతగా ప్రాధాన్యత పెరిగే అవకాశముంది. 

 

ప్రాంతీయ భాషల్లోనూ...

మరో అడుగు ముందుకేస్తే ఈ ఎస్ఎంఎస్‌లను ప్రాంతీయ భాషల్లోనూ అందించవచ్చు. దీనికి సంబంధించిన ఫాంట్లు, అమలుకు సంబంధించిన వ్యవస్థలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.