విండోస్ లైవ్... ఒక చిత్రలోకం
మైక్రోసాఫ్ట్ విండోస్ లైవ్‌ను ఒక చిత్రలోకంగా కూడా పేర్కొనవచ్చు. మైక్రోసాఫ్ట్ సేవల సమాహారమైన ఈ విండోస్ లైవ్‌లోని ఫోటో గ్యాలరీ, మూవీ మేకర్, టూల్‌బార్ తదితర సాఫ్ట్‌వేర్ సాధనాల ద్వారా ఈ చిత్రలోకంలో విహరించి వినోదాత్మకమైన ఎన్నో కార్యకలాపాల్ని సులభంగా నిర్వహించుకోవచ్చు.
ఫోటో గ్యాలరీ...
మీ కెమెరా నుంచి ఫోటోలు, వీడియోలను మీ పీసీలోకి మార్చుకోవడమే ఆలస్యం ఫోటో గ్యాలరీ ద్వారా మీరు మెచ్చిన ఫోటోలను మీ కుటుంబీకులతోను, మిత్రులతోను పంచుకోవచ్చు. మీ ఫోటోలు మరింత మెరుగుపరచుకోవచ్చు, ఆకట్టుకునే సమగ్రమైన చిత్రాలను తయారుచేసుకోవచ్చు. మీ ఫొటోలను ఆన్‌లైన్ ఆల్బంకు చేర్చవచ్చు లేదా ఇ-మెయిల్‌లో పంపుకొనవచ్చు లేదా ముద్రించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పొందుపరచిన మీ చిత్రాలను ఎవరెవరు చూడవచ్చనేది కూడా మీ నియంత్రణలో ఉంచుకోవచ్చు. మీ ఫొటోలలోని వ్యక్తులను ఫోటో గ్యాలరీ ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. కనుక ఆ వ్యక్తి ముఖాన్ని ప్రత్యేకంగా గుర్తించేలా మీరు ఒక పేరు ఇవ్వవచ్చు. తర్వాత ఎప్పుడైనా ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోల్ని మాత్రమే చూడాలనుకుంటే వ్యక్తికిచ్చిన పేరు మాత్రం టైప్ చేస్తే చాలు. ఇది నిజంగా ఒక విచిత్రమే కదూ... ఫోటో గ్యాలరీలో ఒకే క్లిక్‌తో పలు ఫోటోలను ఒకేచోట స్టిచ్ చేసుకోవచ్చు.
మూవీ మేకర్...
మీ ఫోటోలు, వీడియోలను ఉపయోగించి స్లయిడ్ షోలు, మూవీలను తయారు చేసుకోవడానికి అత్యంత ఉపయుక్తమైన సాఫ్ట్‌వేర్ ఈ మూవీ మేకర్. మీ వీడియోలు, ఫోటోలు, సంగీతాన్ని మేళవించి ఆటోమేటిక్‌గా ఒక గొప్ప మూవీని తయారుచేసుకోవచ్చు. ఇందులోని ఆటోమూవీ సదుపాయం వీడియోలకు టైటిల్, క్రెడిట్స్, ట్రాన్సిషన్స్, ఎఫెక్ట్‌లను చేర్చుతుంది. సులభంగా ఉపయోగించుకునే వీలుగల ఇందులోని ఎడిటింగ్ టూల్స్ సాయంతో మీ మూవీని మీకు కావలసిన రీతిలోకి మలుచుకోవడం చాలా తేలిక. మీరు చూపదలచిన భాగాల్ని మాత్రమే చూపించడానికి గాను వీడియో క్లిప్‌లను ట్రిమ్ చేసుకోవచ్చు. మీ వీడియోలకు సంగీతం, పేనింగ్, జూమింగ్ లాంటి ఎఫెక్ట్‌లను జోడించవచ్చు. మీ ఫొటోలు, సంగీతం, మూవీ మేకర్ ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించి అత్యద్భుతమైన స్లయిడ్ షోలను తయారు చేసుకోవచ్చు. మీ మూవీని నేరుగా మూవీ మేకర్ నుంచే యూట్యూబ్‌లో పబ్లిష్ చెయ్యవచ్చు లేదా డివిడి లాంటి పలు ఫార్మాట్లలోకి మార్చుకుని ఇచ్చుకోవచ్చు.
టూల్‌బార్
విండోస్ లైవ్ టూల్‌బార్‌ను ఉపయోగించి విండోస్ లైవ్‌ను త్వరితగతిన యాక్సెస్ చెయ్యవచ్చు. మీ విండోస్ లైవ్ నెట్‌వర్క్‌లోని వ్యక్తుల భావాలను, వారు ప్రచురిస్తున్న ఫోటోలను, వారు మీతో పంచుకుంటున్న లింక్‌లను మీరు గమనించవచ్చు. టూల్‌బార్‌లో మీ శోధనాంశాలను వేగంగా మార్చుకుని సంబంధిత అంశాలను అన్వేషించవచ్చు. కేవలం ఒక్క క్లిక్‌తో విండోస్ లైవ్‌లోని మీ నెట్‌వర్క్‌లోని వ్యక్తులతో మీరు మెచ్చిన వెబ్‌సైట్లగురించి తెలియజేయవచ్చు. మీ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లోని ఫేవరెట్స్‌ను ఒకటికంటే ఎక్కువ పీసీలతో సింక్రనైజ్ చెయ్యవచ్చు. మీరు విండోస్ లైవ్ టూల్‌బార్ ఇన్‌స్టాల్ చేసిన ఏ కంప్యూటర్ నుంచైనా వాటిని పొందవచ్చు. మీరు వీక్షిస్తున్న వెబ్ పేజీని వదలి వెళ్లాల్సిన అవసరం లేకుండానే టూల్‌బార్ నుంచే మీ విండోస్ లైవ్ హాట్‌మెయిల్ ఇన్‌బాక్స్‌ను చూడవచ్చు. ఇవి మాత్రమేగాక పలురకాల ఆప్షనల్ టూల్‌బార్ బటన్స్‌తో ఇంకెన్నో కార్యకలాపాలను నిర్వహించవచ్చు.