రైతులకోసం డిజిటల్ గ్రీన్
సేంద్రీయ వ్యవసాయం, పంటమార్పిడి తదితర తాజా వ్యవసాయ పద్ధతుల పట్ల రైతాంగం ఎల్లప్పుడూ ఆసక్తిని కనబరుస్తుంది. అయితే, ఆధునిక వ్యవసాయ విధానాలను అనుసరించేలా రైతులను ఒప్పించాలంటే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వారికి అర్థమయ్యే భాష, మాధ్యమాల ద్వారా అందించాలి. ఈ లక్ష్యంతోనే "Digital Green" అనే సంస్థను ప్రారంభించారు అమెరికాలోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రానాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన భారతీయుడు రికిన్ బి గాంధీ.
నిర్దిష్ట వ్యవసాయ సమాచారాన్ని "Digital Green" సంస్థ వీడియోలు, ఇతర బోధనా పద్ధతుల ద్వారా రైతాంగానికి అందిస్తుంటుంది. "అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చాలామంది రైతులకు వారి జీవనోపాధులను వేగంగా మెరుగుపరుచుకునే పరిజ్ఞానం ఉండదు. వివిధ ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉండే ఇలాంటి వయోజనుల కోసం రెండు అంశాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అవేమంటే... స్థానిక పరిస్థితులకు సంబంధించిన సమాచార ఉత్పత్తి, పంపిణీ" అని 'Digital Green'ను నిర్వహిస్తున్న రికిన్ గాంధీ అన్నారు.
Microsoft Research India ద్వారా ప్రాణం పోసుకున్న 'Digital Green' ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది మరెన్నో ఇతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలు, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లోని పలు స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. రికిన్ గాంధీ వీడియోలు రైతుల దృష్టిని ఆకట్టుకున్నాయి. ఎందుకంటే రికిన్ ఎంతో శ్రమించి రైతులకు అర్థమయ్యే భాష, మాధ్యమాల్లో వాటిని రూపొందించారు.
వేష భాషల్లో వారినే పోలిన వ్యక్తులు (రైతులు) ఈ వీడియోల్లో ఉన్నందునే రైతులు బాగా అర్థం చేసుకోగలుగుతున్నారని రికిన్ పేర్కొన్నారు. రియాల్టీ టెలివిజన్ ప్రేక్షకుల తరహాలోనే ఒక వ్యక్తి భాష, రూపురేఖలు, వ్యవహారశైలిని బట్టి వారి వృత్తి, చదువు, నివాసం తదితర అంశాలపై రైతులు మాట్లాడారని ఆయన చెప్పారు. ముఖ్యంగా వీటిని ప్రదర్శిస్తున్నప్పుడు స్థానిక వ్యాఖ్యాత ప్రభావం కూడా ఎంతో ముఖ్యమైన అంశమని అన్నారు.
Gates Foundation సహాయ సహకారాలను అందుకుంటున్న ఈ Digital Green సంస్థ ఖర్చు చేసే ప్రతి డాలర్‌కు పలు రెట్లు అధికంగా మేలైన ఫలితాలను అందజేస్తున్నది.
స్థానికంగా నిర్మించిన వీడియోలను ఎంత అత్యుత్తమంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడానికి కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల్లో రికిన్ ఆరు నెలలపాటు గడిపారు. ఈ చిట్కా పనిచేస్తుందని తదుపరి రెండు సంవత్సరాల సమయంలోనే ఆయన శాస్త్రీయంగా రుజువుచేశారు. గ్రామాల్లోని రోడ్ల మధ్య ఆయన తాత్కాలికంగా ప్రదర్శనలు నిర్వహించేవారు. రైతులు, వ్యవసాయ నిపుణులతో తన వీడియో రికార్డింగ్ కార్యకలాపాలు కొనసాగించారు. రైతులకు నిజంగా దేనివల్ల మేలు జరుగుతుందనేది గ్రహించిన అనంతరం ఈ వ్యవస్థను అంచనా వేసేందుకుగాను సలహా నిమిత్తం తిరిగివచ్చారని Microsoft Research India మాజీ అసిస్టెంట్ డైరక్టర్ కెన్‌టారో టొయామా తెలిపారు.