భావ చైతన్యానికి అక్షర సౌందర్యం - మైక్రోసాఫ్ట్ వర్డ్
కథనాల్లోని భావ చైతన్యానికి అక్షర సౌందర్యం తోడైతేనే అది చేరవలసిన స్థాయికి చేరుకొని దాని అసలు లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతుంది. ఎంతో కష్టపడి చక్కని సాహిత్యాన్ని సిద్ధం చేసుకున్న తరువాత ముద్రణలో ముతకదనం కనిపిస్తే ఆ శ్రమ బూడిదలో పోసిన పన్నిరవుతుంది. ముద్రణకు ఉపయోగించే అక్షరాలు, వాటిని పొందుపరిచి ఉన్న పుటల రూపురేఖలు ఆకర్షణీయంగా ఉన్నప్పుడే శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆటు సాహిత్యం, ఇటు ముద్రణ వ్యవస్థలను అనుసంధానించి అక్షరలక్షలను అందిస్తున్న అసలైన సాఫ్ట్‌వేర్ ఏదని ఆలోచిస్తే వెంటనే స్ఫురించేది మైక్రోసాఫ్ట్ వర్డ్. సమకాలీన అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తున్న మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలాంటి సదుపాయాలను అందిస్తుందో మీకు తెలియజేయడమే ఈ కథనం ముఖ్యోద్దేశం.
ప్రభావవంతమైన పద సంపద మైక్రోసాఫ్ట్ వర్డ్ అందమైన అక్షరాకృతులకు మాత్రమే పరిమితం కాలేదు, ప్రభావవంతమైన పద సంపదను కూడా అందచేస్తోంది. వర్డ్‌లో అంతర్గతంగా పొందుపరచి ఉన్న సమీపార్థ పదకోశం, నిఘంటు వ్యవస్థలు ఇందుకు దోహదపడుతున్నాయి. పలు రంగాలకు సంబంధించిన విభిన్న అంశాలపై ఆయా రచయితలు, విశ్లేషకులు, పత్రికా విలేఖరులు, పరిశోధకులు రాసే కథనాలు, వ్యాసాల రూపకల్పనకు సందర్భోచితంగా ఉపయోగించాల్సిన పారిభాషిక పదజాల సహాయం ఈ వ్యవస్థల ద్వారా లభిస్తోంది. సరైన పదాల ఎంపిక విషయంలో అంతర్నిర్మిత పదకోశం మీకు సహకరించి పత్ర నిర్మాణంలో పూర్తి స్థాయి చేయూతనిస్తుంది.
ముద్రారాక్షసాలకు చోటులేదు పత్రాల రూపకల్పనలో సరైన పదాలను ఉపయోగించడం ఒక్కటే కాదు, అవి అక్షర దోషాలు లేకుండా ఉన్నప్పుడే సరైన పత్రాన్ని రూపొందించడంలో మీకున్న ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉపయోగించే పదాలు సరైనవై ఉండటమేగాక అవి సరైన స్థానాల్లోనూ ఉండాలి. మీ భాషకు సంబంధించిన ఇలాంటి సవాళ్లను అధిగమించేందుకు వర్డ్ మీకు సహకరిస్తుంది. ఇందుకోసం అక్షరక్రమ తనిఖీ, స్వీయ సవరణ (Auto Correct) మరియు స్వీయ పాఠం (Auto Text) వ్యవస్థలు అందుబాటులోకి ఉన్నాయి. అక్షరక్రమ తనిఖీ లేదా స్వీయ సవరణలను అమలు చేస్తే చాలు, మిగతా ప్రక్రియలు వాటంతట అవే జరుగుతాయి. అక్షర క్రమాన్ని పరిశీలించి, మొత్తం పాఠంలో అక్షర దోషాలు లేకుండా అక్షరక్రమ తనిఖీ వ్యవస్థ ఉపకరిస్తుంది. ఇలాంటి అందమైన, ప్రభావపూరితమైన పత్రాలను రూపొందించాలని అందరం ఆశపడతాం.
వర్ణపూరిత అక్షరశైలులు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో టైప్ చేయడానికి ఉపయోగించే అక్షర శైలులకు అంతులేదు. మీరు టైప్ చేసిన పాఠంలో కావలసిన భాగాన్ని ప్రత్యేకంగా చూపించుకోవడానికి ఆయా వరుసలను బోల్డ్ (లావు అక్షరాలు), ఇటాలిక్స్ (వాలు అక్షరాలు) మరియు అండర్‌లైన్ (అక్షరాలకు గీతలు) చేసుకోవడానికి సదుపాయాలు ఉన్నాయి. అంతేగాక ప్రాధాన్యత మేరకు కావలసిన రంగును ఇవ్వవచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏమంటే వర్డ్ ఆర్ట్ సదుపాయం ద్వారా కావలసిన పదాలను వివిధ పరిమాణాలు, ఆకృతులతో అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దవచ్చు.
చిత్రాలు, పట్టికల అమరిక వ్యాసాలు, కథనాలు, పరిశోధక పత్రాల రూపకల్పనలో చిత్రాలు, పట్టికలకు ఎంతో ముఖ్య స్థానం ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందుకే మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. పత్రాలకు అనుగుణంగా కావలసిన రీతుల్లో పట్టికలను రూపొందించుకోవచ్చు మరియు ఆయా స్థానాల్లో చిత్రాలనూ పొందుపరచుకోవచ్చు. గణాంకాలు మరియు గ్రాఫ్‌ల తయారీకి, చిత్రాల రూపకల్పనకు ఉపకరించే మైక్రోసాఫ్ట్ ఇతర ముఖ్యమైన ఉత్పత్తులు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పెయింట్ వంటి సాఫ్ట్‌వేర్ల నుంచి గణాంక పట్టికలు మరియు గ్రాఫ్‌లు, చిత్రాలను వర్డ్‌లోకి దిగుమతి చేసుకొని పొందుపరచుకోవచ్చు.
విభిన్న ఆకృతుల సమాహారం కొన్ని సందర్భాల్లో మనం రూపొందించే పత్రానికి తగిన రూపాన్ని ఇచ్చే విషయంలో ఒక అవగాహనకు రాలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ సమస్యను తీర్చడానికి వర్డ్‌లో మీకోసం టెంప్లేట్లు (నమూనా ఆకృతులు) ఉన్నాయి. వ్యక్తిగత వివరాల నవీకరణ, దరఖాస్తును నింపడం, అధికారిక లేదా వ్యక్తిగత ఉత్తరాలను రాయడానికి, వేడుకలకు సంబంధించిన ఆహ్వానాల రూపకల్పన నిమిత్తం మీరు ఎంచుకోవడానికి ఆకర్షణీయమైన టెంప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఈ టెంప్లేట్లను తగిన వివరాలు, సమాచారంతో నింపడమే. దీంతో తప్పులు లేని ఆకర్షణీయమైన పత్రాలు సిద్ధమైనట్లే. సహజత్వం కోసం మీ పత్రాల్లో మీ భాషల్లోనే వాటర్ మార్క్‌లు, శీర్షికలను పొందుపరచండి. క్లిప్ ఆర్ట్‌లు, బులెట్లు మరియు ఫార్మాటింగ్ ద్వారా మీ పత్రాలను మరింతగా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు.
భారతీయ భాషలకు మద్దతు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో పైన పేర్కొన్న సదుపాయాలతో మీ మాతృభాషల్లోనే వ్యాసాలు, కథనాలను తయారుచేసుకోవచ్చు. మిమ్మల్ని సమ్మోహితుల్ని చేసేలా ఇటువంటి పత్రాలను సిద్ధం చేసుకునే దిశగా మైక్రోసాఫ్ట్ సంస్థ వర్డ్‌ను తగిన సాధనాలతో మీకు అందిస్తోంది. సంబంధిత ఇండియన్ లాంగ్వేజ్ సూట్లను ఉపయోగించి ఈ సౌకర్యాలను మీరు మీ మాతృభాషల్లోనే పొందవచ్చు. మీ భాషలోనే లభించే ఇంటర్‌ఫేస్, సహాయం మరియు ఇతర అంశాలు స్వంత పరిసరాల్లో పని చేస్తున్న అనుభూతినిస్తాయి. టైపింగ్ విషయానికి వస్తే, మీకు అలవాటు ఉన్న కీబోర్డ్ లేఅవుట్‌ను ఎంచుకునే సౌకర్యం ఉండటంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా టైప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ప్రాంతీయ భాషల కోసం మైక్రోసాఫ్ట్ యునీకోడ్ ఫాంట్ల ఆవిర్భావం విప్లవాత్మక శుభపరిణామాలకు శ్రీకారం చుట్టింది. |