ఆన్‌లైన్ శిక్షణతో అందరికీ మేలు
ఎంతసేపూ చదువు, చదువు అంటూ సతాయించే అమ్మానాన్నల కాలం మారింది. పిల్లల కళలు, ఆటలు ఆన్నింటా రాణించాలని కోరుకొనే తల్లిదండ్రుల కాలం ఇది. దీంతో బాలబాలికలు సంగీతం, నాట్యం, క్రీడలు, చిత్రలేఖనం ఇలా అన్నింటా ముందంజ వేస్తున్నారు. అయితే ఉద్యోగులైన తల్లిదండ్రులకు ఇతర ప్రాంతాలకు బదిలీ కావడం వంటి సమస్యలు ఉండటం వల్ల పలువురికి ఇదో సమస్యగా మారింది.
కళలపై ఎంతో ఆసక్తి ఉన్నా దూరంగా నివసించడం లేదా చదువులు, పరీక్షలు వంటి ఇతర కారణాలు సైతం అడ్డంకిగా నిలుస్తున్నాయి. మరోపక్క ఈ కళలను నేర్పుతూ డబ్బు సంపాదించుకొనే గురువులు కూడా పైన పేర్కొన్న కారణాల వల్ల విద్యార్థులు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి కంపూటర్ యుగం వీళ్లందరికీ మార్గాన్ని చూపించింది. నేడు ఐటి సామర్థ్యం వృద్ధి పొందడం, తక్కువ ధరలకే కంప్యూటర్లు మరియు ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం లభ్యం కావడంతో ఆన్‌లైన్ గురుశిష్య సంబంధానికి బీజం వేసింది. ఈ ప్రక్రియ ఎలా జరుగుతోందంటే...
దూరతీరాల్లో ఉన్నప్పటికీ తమ గురించి మిగతా ప్రపంచానికి తెలిపే దిశగా శిక్షకులు, గురువులు వెబ్‌సైట్‌లను ప్రారంభిస్తున్నారు. తద్వారా వీరి గురించి తెలుసుకున్న వారు స్వయంగా వచ్చి నేర్చుకుంటున్నారు. ఇక దూరంగా ఉన్నవారికి సాఫ్ట్‌వేర్ రంగం చేయూతనిస్తోంది. నేడు లభిస్తున్న ఆడియో, వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లను గురువులు, శిక్షకులు ఉపయోగించుకుంటూ ఇ-మెయిల్, చాటింగ్ వ్యవస్థలతో దృశ్య శ్రవణ (ఆడియో విజువల్) విధానంలో తమ విద్యార్థులకు ఆయా అంశాల్లో శిక్షణనిస్తున్నారు. దీంతో దూరతీరాల్లో... అంటే, విదేశాల్లో ఉన్న శిష్యులు సైతం తమ అభిరుచులను కొనసాగించగలుగు తున్నారు. గురువులు తమ శిష్యులకు ఆన్‌లైన్ పాఠాలను అందిస్తూ తమ ఉనికిని కాపాడుకుంటున్నారు.
శిష్యులకు పాఠాల్లో సందేహాలొస్తే పరిస్థితి ఏమిటన్న సందేహానికీ సమాధానం ఉంది. అందుకోసమే ఆన్‌లైన్ చాట్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటివి ఉన్నాయి. ఈ ఆన్‌లైన్ శిక్షణ ఎంత ఎదిగిపోయిందంటే... పలు విషయాలకు సంబంధించిన ఆన్‌లైన్ కోర్సులను అందించి, డిగ్రీలను ప్రదానం చేసే స్థాయిలో వర్చువల్ విశ్వవిద్యాలయాలు కూడా వెలిశాయి. ఇవే కాదు మన దేశంలో విఖ్యాతిగాంచిన సార్వత్రిక విశ్వవిద్యాలయాలు విదేశాల్లో దూరవిద్య ద్వారా పట్టభద్ర విద్యను అభ్యసించే తమ విద్యార్థులకు ఇంటర్నెట్ ద్వారా డిజిటల్ పాఠ్యాంశాలను అందిస్తున్నాయి.
అదే రీతిలో ఎందరో అధ్యాపకులు, విద్యా సంస్థలు దృశ్య, శ్రవణ, వచన రూపాల్లో శిక్షణను అందిస్తూ గురుశిష్య బంధాన్ని పటిష్టం చేస్తున్నాయి. ఇంకా శాస్త్ర, సాంకేతిక, పరిశోధనా రంగాల్లో సైతం ఆన్‌లైన్ బోధన ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా పరిస్థితిని గమనిస్తే, ఎందరో భారతీయ ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల అచార్యులు విదేశీ విద్యార్ధులకు గణితం, సైన్స్ పాఠాలను బోధిస్తూ వేల డాలర్లు ఆర్జిస్తున్నారు. పైగా ఈ విధమైన ఆన్‌లైన్ బోధనకు ఎంతో డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న సంగీతోత్సవంలో భాగంగా ఎందరో ఆన్‌లైన్ గురువులు వెలుగులోకి వచ్చి తమ ఆన్‌లైన్ శిక్షణ వెబ్‌సైట్లు, పాఠాల గురించి ప్రకటనలిస్తూ, ప్రచారం చేసుకుంటున్నారు. |