Go Search

పనితీరును ప్రభావితం చేసే విండోస్ అప్‌డేట్

నిరంతర అభివృద్ధి, కొత్తదనం మరియు పరిశోధనలకు మారుపేరు కంప్యూటర్ రంగం. వినియోగంలో ఉన్న సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ ఉత్పత్తులను పర్యవేక్షిస్తూ, వాటి పనితీరు మెరుగుదలకు తోడ్పాటునిస్తూ, యూజర్ల విశ్వసనీయతను నిలబెట్టుకొని పోటీలో నిలదొక్కుకునేందుకు ఐటీ ప్రపంచం ఎంతో కసరత్తు చేస్తోంది. వివిధ అవసరాల మేరకు అదనపు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లను ప్యాచ్‌లు మరియు అప్‌డేట్లుగా అందించడం ద్వారా కంప్యూటర్ వ్యవస్థలను ఎప్పటికప్పుడు పటిష్ఠం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు ఇలాంటి ఒక ముఖ్యమైన సేవకు శ్రీకారం చుట్టింది ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ అనడం అతిశయోక్తి కాదు. యూజర్ల అవసరాలు, వ్యవస్థలోని లోటుపాట్లను గమనిస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా సహకరించేందుకు విండోస్ అప్‌డేట్ సదుపాయాన్ని మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసింది. ఈ విండోస్ అప్‌డేట్ గురించి మరిన్ని ప్రాథమిక వివరాలు తెలుసుకుందాం...

ఏమిటి ఈ విండోస్ అప్‌డేట్?
మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ఈ విండోస్ అప్‌డేట్ వెబ్‌సైట్ ద్వారా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు విండోస్ ఆధారిత హార్డ్‌వేర్‌కు అప్‌డేట్లు లభిస్తాయి. భద్రత సహా వివిధ అంశాలకు సంబంధించిన సమస్యలను అప్‌డేట్లు పరిష్కరిస్తాయి. మీరు ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ను ప్రారంభించి ఉంచినట్లయితే, అతి ముఖ్యమైన అప్‌డేట్లు అందుబాటులోకి వచ్చినప్పుడల్లా విండోస్ వ్యవస్థ వాటిని మీకు పంపిణీ చేస్తుంది. వాటిని ఎప్పుడు, ఎలా ఇన్‌స్టాల్ చెయ్యాలో మీరే సెట్టింగ్‌లను నిర్ణయించవచ్చు.

విండోస్ అప్‌డేట్ ఎలా పని చేస్తుంది?
మీరు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు విండోస్ అప్‌డేట్ మీ కంప్యూటర్‌ను స్కాన్ చేసి, మీరు వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్‌కు వర్తించే అప్‌డేట్ల గురించి మీకు తెలియజేస్తుంది. మీకు కావలసిన వాటిని మీరు ఎంచుకోవచ్చు మరియు ఎలా ఇన్‌స్టాల్ చెయ్యాలో మీరే నిర్ణయించుకోవచ్చు.

ఎన్ని రకాల అప్‌డేట్లు...
విండోస్ అప్‌డేట్ అందించే అప్‌డేట్లలో కనెక్టర్, క్రిటికల్ అప్‌డేట్, డెవలప్‌మెంట్ కిట్, డ్రైవర్, ఫీచర్ ప్యాక్, హాట్ ఫిక్స్, సెక్యూరిటీ అప్‌డేట్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, గైడెన్స్, సర్వీస్ ప్యాక్, టూల్, అప్‌డేట్ (ఇదీ ఒక రకమే), అప్‌డేట్ రోల్ అప్, అప్‌గ్రేడ్ అని పలురకాల అప్‌డేట్లు ఉన్నాయి. వీటి మధ్య పనితీరుపరంగా సాంకేతికమైన వ్యత్యాసాలు ఉంటాయి. వ్యవస్థాపరంగా వీటిని మళ్లీ హై ప్రయారిటీ అప్‌డేట్లు, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, హార్డ్‌వేర్ అప్‌డేట్లు అని మూడు రకాలుగా విభజించారు. ఈ పేర్లను బట్టే వాటి ఆవశ్యకతను తేలికగా గుర్తించవచ్చు. వీటిని కొంచెం పరిశీలిద్దాం...

హై ప్రయారిటీ అంటే... క్రిటికల్ అప్‌డేట్లు, సెక్యూరిటీ అప్‌డేట్లు మరియు అప్‌డేట్ రోల్ అప్ వంటివి. ఇవి అందుబాటులోకి వచ్చినప్పుడల్లా, ఇతర అప్‌డేట్లను ఇన్‌స్టాల్ చేయడానికి ముందే వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు... ఇవి విండోస్ ప్రోగ్రామ్‌లకు వర్తించే నాన్-క్రిటికల్ రకానికి చెందినవి. అంటే, విండోస్ మీడియా ప్లేయర్, విండోస్ జర్నల్ వ్యూయర్ లాంటి విండోస్ ప్రోగ్రామ్‌లు.

హార్డ్‌వేర్ అప్‌డేట్లు... ఇవి డ్రైవర్లు మరియు ఇతర హార్డ్‌వేర్ పరికరాలకు వర్తించే నాన్-క్రిటికల్ రకానికి చెందినవి. అంటే, వీడియో కార్డ్‌లు, సౌండ్ కార్డ్‌లు, స్కానర్లు, ప్రింటర్లు మరియు కెమెరా వంటివి ఈ పరిధిలోకి వస్తాయి. అంటే ఈ పరికరాలను కంప్యూటర్లకు అనుసంధానించడం, డేటా మార్పిడి ఇత్యాది కార్యకలాపాలకు సంబంధించిన అప్‌డేట్లు అని చెప్పుకోవచ్చు.

ఇన్‌స్టాలేషన్ పద్ధతులు
అప్‌డేట్ల ఇన్‌స్టాలేషన్ రెండు రకాలు. ఒకటి ఎక్స్‌ప్రెస్, రెండు కస్టమ్. ఎక్స్‌ప్రెస్ పద్ధతిలో హై ప్రయారిటీ అప్‌డేట్లు ప్రదర్శింపబడతాయి. వాటిని ఒకసారి క్లిక్ చేయడం ద్వారా వేగంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కస్టమ్ పద్ధతిలో హై ప్రయారిటీ అప్‌డేట్లతో పాటుగా ఇతర (ఆప్షనల్) అప్‌డేట్లు కూడా ప్రదర్శింపబడతాయి. వీటిలో మీకు కావలసిన వాటిని ఎంచుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆప్షనల్ అప్‌డేట్లు అనేవి చిన్న చిన్న సమస్యలకు సంబంధించినవి.

ఆటోమేటిక్ అప్‌డేట్స్...
పైన తెలిపిన ప్రకారం ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ను ప్రారంభించి ఉంచినట్లయితే, అత్యంత ముఖ్యమైన హై ప్రయారిటీ మరియు సెక్యూరిటీ అప్‌డేట్లు అందుబాటులోకి వచ్చినప్పుడల్లా విండోస్ వ్యవస్థ వాటిని తనంతతానుగా మీ దృష్టికి తీసుకువస్తుంది. ఇతర (ఆప్షనల్) అప్‌డేట్లు కావాలనుకున్నప్పుడు మాత్రం మీరు విండోస్ అప్‌డేట్ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

అప్‌డేట్ల విడుదల...
భద్రతను ప్రభావితం చేసే సెక్యూరిటీ అప్‌డేట్లు నెలకొకసారి విడుదలవుతుంటాయి. ఎప్పుడైనా విండోస్ ఆధారిత వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే వైరస్ దాడులు జరిగినప్పుడు దానిని నివారించేందుకు వీలైనంత త్వరగా అప్‌డేట్ల విడుదల జరుగుతుంది.

అదనపు సమాచారం...
అప్‌డేట్లను ఇన్‌స్టాల్ చేసే ముందు వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. సంబంధిత అప్‌డేట్‌కు ఉండాల్సిన సిస్టమ్ కన్ఫిగరేషన్, వ్యవస్థ పనితీరును ఇదే ఏవిధంగా ప్రభావితం చేస్తుందనే వివరాల కోసం ఆ అప్‌డేట్ పేరు పైన క్లిక్ చేయండి. కొన్ని సందర్భాల్లో అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు ఎండ్ యూజర్ లైసెన్స్ అగ్రిమెంట్‌కు మీ అంగీకారాన్ని తెలియజేయాల్సి ఉంటుంది.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.