వార్తలు

స్థానిక భాషల్లో కంప్యూటింగ్ : ఉత్తేజపరచిన మైక్రోసాఫ్ట్ భాషాఇండియ
కంప్యూటర్ అంటే ఆంగ్ల భాషకే పరిమితం కాదని, తెలుగు, తమిళం మరియు హిందీ సహా భారతీయ భాషలన్నిటికీ కంప్యూటింగ్‌లో స్థానముందని తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని వళ్లవర్ కొట్టంలో ఇటీవల జరిగిన తమిళ్-కంప్యూటర్-ముద్రణ ప్రదర్శన నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా స్థానిక భాషల్లో కంప్యూటింగ్‌కు జవసత్వాలను అందించిన అగ్రగామి సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ సహా కంప్యూటర్ ఆధారిత ముద్రణా రంగానికి చెందిన పలు సంస్థలు, కంప్యూటర్ ఫాంట్స్ మరియు కీబోర్డ్‌ల రూపకల్పనకు కృషి చేస్తున్న మరెన్నో సాఫ్ట్‌వేర్ సంస్థలు ఈ ప్రదర్శనలో తమ స్టాళ్లను నెలకొల్పి వివిధ సాంకేతిక అంశాలపై జనసామాన్యానికి అవగాహన కలిగించే ప్రయత్నం చేశాయి.

అలరించిన మైక్రోసాఫ్ట్ ప్రాంతీయ భాషల ఉత్పత్తులు
ముద్రణ రంగంలో చోటు చేసుకున్న ఆధునిక మార్పులు, ప్రాథమిక అంశాలపై సమావేశాల ద్వారా విస్తృతంగా చర్చించిన ఈ ప్రదర్శనలో స్థానిక భాషల కంప్యూటింగ్‌కు విశేష కృషి చేస్తున్న మైక్రోసాఫ్ట్ నేతృత్వంలోని భాషాఇండియా విభాగం ఏర్పాటు చేసిన స్టాల్ పలువురి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. స్థానిక భాషల కంప్యూటింగ్‌కు ఉపయోగపడేలా భారతీయ భాషల్లో రూపొందించిన వర్డ్, ఎక్సెల్ మరియు పవర్ పాయింట్ వంటి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2003 ఉత్పత్తులను ల్యాప్‌టాప్‌ల ద్వారా ప్రదర్శించి, వాటి పనితీరును వీక్షకులకు కరపత్రాల ద్వారా వివరించారు. అప్పటి వరకూ ఆంగ్ల భాషా మాధ్యమంలో మాత్రమే తాము ఉపయోగించుకుంటున్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉత్పత్తులను ఇకపై తమ స్వంత భాషల్లోనే ఉపయోగించుకునే వీలుందని ఈ సందర్భంగా తెలుసుకున్న పలువురు వీటి పట్ల మరింత ఆసక్తిని కనబరచి మరెన్నో వివరాలను తెలుసుకున్నారు. అంతేగాక స్టాల్‌కు వచ్చిన వినియోగదారులు స్వయంగా వాటిని ఉపయోగించి చూసి సంతృప్తి చెందారు.

కంప్యూటింగ్ సేవల భాషా ఇండియా
స్థానిక భాషల్లో కంప్యూటింగ్‌పై అవగాహన కల్పిస్తూ ఇదే స్టాల్ ద్వారా ప్రదర్శింపబడిన మైక్రోసాఫ్ట్ వారి భాషాఇండియా.కామ్ వెబ్‌సైట్ సైతం ఎందరినో ఆకర్షించింది. భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కంప్యూటింగ్ నిపుణులు పలు భారతీయ భాషల మాధ్యమంలో భాషాఇండియా.కామ్ ద్వారా సాగిస్తున్న సాంకేతిక చర్చలు, ఈ సైట్‌లోని సదుపాయాలు, సేవలు, డౌన్‌లోడ్‌ల గురించి ప్రదర్శనకు వచ్చిన వీక్షకులు శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. వీక్షకుల్లో అత్యధికులు విద్యార్థులు, యువతీ యువకులే కావడం స్థానిక భాషల పట్ల వారికున్న ఆసక్తికి అద్దం పట్టింది.

ఎన్నెన్నో ఆవిష్కరణలు
మద్రాస్ ప్రింటర్స్, లిథోగ్రాఫర్స్ అసోసియేషన్ మరియు కని తమిళ్ సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ ప్రదర్శనలో విశ్వక్, సాఫ్ట్‌వ్యూ వంటి మరికొన్ని ప్రముఖ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేసి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు తదితర ఆధునిక వ్యవస్థలతో ప్రభావితమవుతున్న ముద్రణ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్ల గురించి జనానికి అవగాహన కల్పించాయి. సీడీలపై ముద్రణ, కొత్తగా వచ్చిన ఆధునిక ముద్రణా యంత్రాలు, స్థానిక భాషల్లో టైపింగ్‌కు అనుగుణంగా తయారైన కంప్యూటర్ కీబోర్డ్‌లు ఇత్యాది ఎన్నో సరికొత్త వైజ్ఞానిక అంశాలను పునరావిష్కరించిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.