"మానవులు, యంత్రాల మధ్య పరస్పర సంప్రదింపులకు కావలసిన ప్రక్రియీకరణ సాధనాలు, వివిధ భాషల్లోని విజ్ఞాన వనరుల్ని పొందేందుకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకుగాను భారత ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం (DIT) చేపట్టిన కార్యక్రమం ఈ TDIL (టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్). ప్రాథమిక సమాచారానికి సంబంధించిన ప్రాసెసింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసి, వాటిని కలసికట్టుగా ఒకేచోట వాడుకదార్లకు అనుకూలంగా సిద్ధంచేసి, ఉచితంగా జనబాహుళ్యానికి అందజేయడం TDIL లక్ష్యం."
"భారతీయ భాషల్లో సాఫ్ట్‌వేర్ అభివృద్ధి విషయంలో ఎదురయ్యే ప్రధాన అవరోధం ఏమిటంటే భాషావేత్తలను, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను ఏకతాటిపైకి తీసుకురావడం. భారతదేశపు 22 అధికార భాషల్లో టెక్నాలజీ అభివృద్ధి కోసం తగినన్ని నిధుల్ని TDIL కేటాయించింది. భాషావేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల మధ్య TDIL ఒక వారధిలా పనిచేస్తుంది. కాగా, హిందీ, తమిళ భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. హిందీ విషయానికి వస్తే, ఎక్కువ ప్రాంతాల్లో ఈ భాష వాడుకలో ఉంది. తమిళం మాటకొస్తే... తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తమిళ ఎన్నారైలు ఈ విషయంలో పట్టుదలతో ఉన్నారు."
"TDIL కార్యక్రమానికి 1990-91లో రూపకల్పన జరిగింది. సమాచార ప్రక్రియీకరణకు సంబంధించి పద సంచయ నిర్మాణం, OCR (Optical character recognition) , Text-to-Speech, యంత్రానువాదం, సాధారణ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి తదితర ప్రాజెక్ట్‌లకు TDIL చేయూతనిస్తుంది. కీబోర్డ్ లేఅవుట్‌కు కావలసిన ప్రమాణాలు, సమాచార వినిమయం కోసం ఇంటర్నల్ కోడ్ సిద్ధమయ్యాయి. దీంతో భారతీయ భాషల్లో సమాచార ప్రక్రియీకరణకు పరిష్కారాల విషయంలో ఒక నమ్మకం ఏర్పడింది."
"అయితే, భారతీయ భాషలకు టెక్నాలజీపరమైన పరిష్కారాల దిశగా సాగేందుకు ప్రభుత్వం, ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఒక చోదకశక్తిలా పనిచేసింది. ఈ నేపథ్యంతో 2000-2001లో ఒక లక్ష్యం కోసం ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమమే ఈ TDIL. అప్పట్లో ఏడు ప్రధాన కార్యకలాపాలపై ఇది దృష్టి కేంద్రీకరించింది. అవి... పరిజ్ఞాన వనరులు, పరిజ్ఞాన సాధనాలు, అనువాదానికి మద్దతు వ్యవస్థలు, మానవ - యంత్ర సంప్రదింపు వ్యవస్థలు, స్థానీకరణ, ప్రమాణీకరణ, భాషా సాంకేతిక మానవ వనరుల అభివృద్ధి. మొత్తం 18 భారతీయ భాషల్నీ కలుపుకుని వెళ్ళేలా భారతీయ భాషల సాంకేతిక పరిష్కారాల కోసం 13 రిసోర్స్ సెంటర్ల (RC-ILTS) కు తోడ్పాటు ఉంది."
"అస్సామీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ, గుజరాతీ, సంస్కృతం, బోడో, డోగ్రీ, మైథిలీ, నేపాలీ, బెంగాలీ, కాశ్మీరీ, కొంకణి, మణిపురీ, సంతాలీ, సింధీ భాషలకు సంబంధించి TDIL డేటా సెంటర్ నుంచి ఉచితంగా ఫాంట్స్, సాఫ్ట్‌వేర్ సాధనాల్ని పొందవచ్చు."
"TDILకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13 రిసోర్స్ సెంటర్లున్నాయి. అవి.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్ (హిందీ, నేపాలీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై (మరాఠీ, కొంకణి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గువాహటి (అస్సామీ, మణిపురీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు (కన్నడ, సంస్కృతం), ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కోల్‌కత (బెంగాలీ), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ, విదేశీ భాషలు (జపనీస్, చైనీస్) మరియు సంస్కృతం (భాషా అధ్యయన వ్యవస్థలు), హైదరాబాద్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ (తెలుగు), అన్నా విశ్వవిద్యాలయం, చెన్నై (తమిళం), ఎంఎస్ విశ్వవిద్యాలయం, బరోడా (గుజరాతీ), ఉత్కళ విశ్వవిద్యాలయం, కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ విభాగం (ఒరియా), థాపర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పాటియాలా (థాపర్), ERDCI, తిరువనంతపురం (మలయాళం), మరియు CDAC, పూణే (ఉర్దూ, సింధీ, కాశ్మీరీ )."
"TDILలో మేమంతా ఇంగ్లీష్ అడ్డంకిని అధిగమించే ఒక అద్భుత ప్రపంచం దిశగా పనిచేస్తున్నాం. ఈ క్రమంలో వేసిన తొలి అడుగే National Roll Out పథకం. ఈ పథకంలో భాగంగా జనబాహుళ్యం కోసం 22 భారతీయ భాషల్లోనూ సాఫ్ట్‌వేర్ సామగ్రి, ఫాంట్స్ విడుదల చేశాం. National Roll Out పథకపు CD-ROMలో ఫాంట్లు, కీబోర్డ్ డ్రైవర్లు, కన్వర్టర్లు, ఎడిటర్లు, టైపింగ్ బోధినులు, సమగ్ర Word Processor, భారతీయ Open Office, ద్విభాషా నిఘంటువులు, Spell checker, ట్రాన్స్‌లిటరేషన్ సాధనం, బ్రౌజర్, ఇ-మెయిల్ క్లయింట్, మెసెంజర్, టెక్ట్స్ టు స్పీచ్ వ్యవస్థ మరియు OCRలు ఉన్నాయి. ఈ CD-ROMను ఎవరైనా www.ildc.gov.in మరియు www.ildc.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ఈ వెబ్‌సైట్లలో పేర్లు నమోదు చేసుకుంటే వారి చిరునామాకు ILDC ఈ CD-ROMను పంపిస్తుంది. ఇది పూర్తిగా ఉచితం."
"ప్రస్తుతం TDILలో నడుస్తున్న ప్రధాన ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే... ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషల్లోకి యంత్రానువాద (Machine Translation) వ్యవస్థ (CDAC, పూణే), ఆంగ్ల భారతి టెక్నాలజీ ద్వారా ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషల్లోకి యంత్రానువాద వ్యవస్థ (ఐఐటి, కాన్పూర్), భారతీయ భాష నుంచి భారతీయ భాషలోకి యంత్రానువాద వ్యవస్థ (ఐఐఐటి, హైదరాబాద్), సంస్కృతం - హిందీ యంత్రానువాదం (హైదరాబాద్ విశ్వవిద్యాలయం, జెఎన్‌యు), భారతీయ భాషల పత్ర విశ్లేషణ మరియు గుర్తింపు వ్యవస్థ (ఐఐటి ఢిల్లీ), ఆన్‌లైన్ ద్వారా చేతిరాత గుర్తింపు (ఐఐఎస్‌సి, బెంగళూరు), భాషావ్యాప్త సమాచార సేకరణ (ఐఐటి, బాంబే), Speech Corpora & Technologies (ఐఐటీ, చెన్నై), భారతీయ భాషల పదసంచయ కార్యకలాపాలు (జెఎన్‌యు, న్యూఢిల్లీ) వంటివి కొనసాగుతున్నాయి."
"భాషా సాంకేతిక వ్యవస్థ భారతీయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటిది. ఎగుమతులవైపు చూస్తున్న సాఫ్ట్‌వేర్ పరిశ్రమ స్థానిక అవసరాలమేరకు ఐటీ సొల్యూషన్లు అందిస్తూ దేశీయంగా ఐటీ అభివృద్ధికి దారితీసేలా స్థానిక మార్కెట్ల వైపు దృష్టిసారించేలా ఇది కచ్చితంగా చెయ్యగలదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ టెక్నాలజీ అభివృద్ధి అనే లక్ష్యాన్ని దాటి ముందుకెళ్ళాలి. విస్తృత సమాజంలో పై స్థాయి నుంచి కింది స్థాయి వరకూ ఈ సాధనాల్ని వినియోగించుకునేందుకు ఇతర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల కృషి కూడా తోడవ్వాలి."