ప్రాంతీయ భాషల్లో డొమైన్ నేమ్స్... ఇ-మెయిల్ ఐడీ: టాన్ టిన్ వీ

మీరు మీ భాషను ప్రేమించేవారయితే ప్రొఫెసర్ టాన్ టిన్ వీ గురించి కచ్చితంగా వినే ఉంటారు. National University of Singapore (Bioinformatics Centre, Department of Biochemistry, Yong Loo Lin School of Medicine)లో సేవలందిస్తున్న ఈ ప్రపంచ భాషా ప్రేమికుడు వివిధ భాషల్లో... మరీ ముఖ్యంగా ఇంటర్నెట్‌లో భారతీయ భాషలకు సంబంధించి ఎన్నో అద్భుతాలు చేశారు.
సింగపూర్ దేశంలో 1994లో ప్రారంభమైన తొలి చైనీస్ వెబ్‌సైట్, 1995లో తమిళ అక్షరాలను ఉపయోగించి ఆరంభించిన మరో తమిళ వెబ్‌సైట్, 1996లో ఏర్పాటు చేసిన ఇంకొక బహుభాషా వెబ్‌సైట్... ఇవన్నీ ప్రొఫెసర్ టాన్ టిన్ వీ నాయకత్వంలో రూపుదాల్చినవే. అనేక భాషలకు ఈయన అందించిన సేవల్లో ప్రధానమైనది ఏమిటని అడిగితే... 'internationalized domain name' (IDN) అనే కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాలి. ఈ పద్ధతిని ఉపయోగించి ఆంగ్లేతర భాషల్లో డొమైన్ నేమ్స్ టైప్ చేసుకోవచ్చు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన 9వ తమిళ్ ఇంటర్నెట్ సదస్సులో ఈ ప్రొఫెసర్ ప్రతిభను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 'Tamil Internet Frontier Award' అవార్డునిచ్చి గౌరవించింది.
ఈ నేపథ్యంలో ఈ విశిష్ఠ వ్యక్తితో ముచ్చటించే అవకాశం భాషాఇండియాకు లభించింది. లాంగ్వేజి కంప్యూటింగ్, ప్రత్యేకించి IDN చరిత్ర, అభివృద్ధి, విస్తృతిపై టాన్ టిన్ వీ ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలియజేశారు. ఈ ముఖాముఖి ముఖ్యాంశాలు మీ కోసం....
ప్రశ్న: మీతో ముచ్చటించే అవకాశం భాషా ఇండియాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. మీరు రూపొందించిన IDN గురించి కాస్త వివరంగా చెబుతారా ?
జవాబు: ఇంగ్లీష్ కాకుండా (హిందీ, తెలుగు లేదా మరే భాష అయినా...) మీరు ఉపయోగించే వెబ్‌సైట్‌లోని భాషలాగే డొమైన్ నేమ్ కూడా అదే భాషలో ఏర్పాటు చేసుకోవడానికి Internationalized Domain Names (IDN) వీలు కల్పిస్తుంది. అంటే... ఇంగ్లీష్ (లాటిన్) డొమైన్ నేమ్స్ స్థానంలో ASCIIయేతర అక్షరాలని కూడా మీరు ఉపయోగించవచ్చు.
Internationalized Domain Names గురించి మరింతగా చెప్పుకోవడానికి ముందు డొమైన్ నేమ్స్ కాన్సెప్ట్‌తో మొదలుపెడదాం. ఇంటర్నెట్‌లో మీరు వీక్షించే ఒక వెబ్‌సైట్ వంటి ఒక Internet Protocol (IP) resourceను డొమైన్ నేమ్ ప్రత్యేకంగా గుర్తిస్తుంది. ఈ డొమైన్స్ అనేవి Domain Names System (DNS) పై ఆధారపడి ఉంటాయి. సంఖ్యాత్మకంగా ఉండే వెబ్‌సైట్లను సులభంగా గుర్తించి జ్ఞాపకముంచుకోగల్గిన పేర్లను ఇవ్వడం డొమైన్ నేమ్స్ యొక్క అతి ముఖ్యమైన పని. మార్చి 15, 2010 నాటికి 84 మిలియన్ డొమైన్ నేమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఈ వెబ్‌సైట్స్‌ను వీక్షించాలంటే లాటిన్ అక్షరమాలతో టైప్ చెయ్యాల్సిన పరిస్థితి ఉంది.
ప్రశ్న: డొమైన్ నేమ్స్ విషయంలో ప్రాంతీయ భాషల్ని పక్కనపెట్టడానికి కారణమేమిటి ?
జవాబు: చారిత్రకంగా USకు ఉన్న ప్రాబల్యం... ASCII character set కనీస ప్రమాణంగా ఉండాలని నిర్ణయించడం వల్ల ఇంగ్లీష్ తెలియని యూజర్లు ఇంటర్నెట్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే లాటిన్ భాషలు, అక్షరాల్ని ఉపయోగించనివారే ఇంటర్నెట్‌ను ఎక్కువగా వాడుకుంటున్నారు. వీరిని ఎవరూ పట్టించుకోలేదు.
ప్రశ్న: అయితే, ప్రాంతీయ భాషల్లో డొమైన్ నేమ్ గురించి ఆలోచనలు ఎలా మొదలయ్యాయి ?
జవాబు: 1990వ దశకంలో వెబ్ పేజీలన్నీ వివిధ భాషల సమాచారంతో కనిపించిన తరుణంలో ఇంగ్లీషేతర భాషల్లోనూ డొమైన్ నేమ్స్‌కు గిరాకీ ఏర్పడింది. దీంతో IDN కోసం భాషా ప్రేమికుల నుంచి ఒత్తిడి మొదలైంది.
ప్రపంచ జనాభాను పరిశీలిస్తే ఇంగ్లీష్ మాట్లాడనివారు 83 శాతం ఉంటారన్న అంచనాల నేపథ్యంలో వారి వారి భాషల్లో డొమైన్ నేమ్ ఉండాల్సిన అవసరముంది. అందువల్ల, ఇంగ్లీషేతర ప్రపంచ భాషల ఇంటర్నెట్ వాడకందార్లకు ఉపయోగపడేలా ఇంటర్నెట్‌ను తీర్చిదిద్దే క్రమంలో IDN అనేది ముఖ్యమైన తొలి దశగా చెప్పుకోవాలి.
IDNను డిసెంబర్ 1996లో Martin Durst ప్రతిపాదించారు. కాగా, ఈ ప్రయోగాల నిర్వహణ, చివరికి IDN అమలు కావడం నా నాయకత్వంలోనే జరగడం పట్ల గర్వంగా ఉంది. ఇదే Internationalizing Domain Names in Applications (IDNA). దీనిని టాప్-లెవెల్ డొమైన్స్‌లో ఉపయోగిస్తున్నారు.
ప్రశ్న: ప్రస్తుతం ఎవరైనా రిజిష్టర్ చేసుకుని Internationalized Domain Namesను ఉపయోగించుకోవచ్చా ?
జవాబు: నేను ఇంతకు ముందే చెప్పిన ప్రకారం, 1998 నుంచీ దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికల్ని చేపట్టడం, వీటిపై దృష్టి సారించడం మొదలైంది. IDNను ప్రమాణీకరించేందుకు "Internet Consortium for Assigned Names and Numbers" (ICANN) అనే సంస్థ ఏర్పాటయ్యింది.
ఈ లక్ష్యాల్ని చేరుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ప్రాంతీయ భాషల అక్షరాలకు IDNA ప్రమాణాన్ని ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో internationalized country code top-level domains ఏర్పాటుకు అక్టోబర్ 2009లో ICANN ఆమోదం తెలిపింది. మే 2010లో DNS root zoneలో మొట్టమొదటి country code top-level domains ఏర్పాటు జరిగింది.
ప్రస్తుతం, దాదాపు 60 భాషల్లో డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్‌కు i-DNS.net లాంటి కంపెనీలు మద్దతునిస్తున్నాయి. త్వరలో ఈ భాషల జాబితా ఇంకా పెరుగుతుంది.
ప్రశ్న: చాలా సంతోషం, ఇక ప్రజలు ఉపయోగించుకునేలా హిందీ, తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ డొమైన్ నేమ్స్‌ను ఆశించవచ్చా ? అయితే, వివిధ భాషల్లో ఇంటర్నెట్ డొమైన్ నేమ్స్ వల్ల లాంగ్వేజ్ కంప్యూటింగ్‌కు ఎలాంటి ప్రయోజనాలుంటాయి ?
జవాబు: జన బాహుళ్యానికి కంప్యూటర్లను చేరువ చెయ్యడమే లాంగ్వేజి కంప్యూటింగ్ తాలూకూ ప్రాథమిక భావన. ప్రతి మనిషికీ తన మాతృభాషలో ఇంటర్నెట్‌ను పొందే హక్కు ఉంది. భాషాపరమైన అవరోధాలు లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ విధమైన హక్కు లేదా అవకాశం ఇచ్చినప్పుడు వారంతా మరింత పరిజ్ఞానవంతులైన పౌరులవుతారు. మరీ ముఖ్యంగా అన్ని రకాల సమాచారం మరియు విజ్ఞానాన్ని ఉపయోగించుకునే వినియోగదారులవుతారు. IDN వల్ల కలిగే గొప్ప ప్రయోజనాల్లో ఇదొకటి.
ప్రపంచంలో అత్యధిక జనాభాకు ఇంగ్లీష్ భాషతో పరిచయం లేదు. ఇంగ్లీష్‌లో కనీస పరిజ్ఞానం లేనిదే ఇంటర్నెట్‌లోని వనరుల్ని ఉపయోగించుకోవడం చాలా కష్టం. ప్రాంతీయ భాషల్లోని సమాచారం ఇంటర్నెట్‌లో ఉందనేది నిజం. అయితే, ఎవరైనా దానిని ఎలా పొందాలి ? ఇంగ్లీష్ తెలియకుండా వారెవరూ డొమైన్ నేమ్స్ (వెబ్‌సైట్ అడ్రస్) టైప్ చెయ్యలేరు. ఈ అవరోధాన్ని అధిగమిస్తే, మొత్తం జనాభా ఇంటర్నెట్‌లోకి అడుగుపెట్టి దాని ప్రయోజనాల్ని అందుకుంటారు. ఇంటర్నెట్‌లో వారి భాషకు మరింత వైభవం చేకూరడానికి తోడ్పడతారు. ఈ విధంగా IDNలు లాంగ్వేజి కంప్యూటింగ్‌కు తోడ్పడతాయి.
ప్రశ్న: ASCII లేదా లాటిన్ ఆధారిత డొమైన్ నేమ్ లాగానే ఇంగ్లీషేతర భాషల ప్రజల ముందున్న మరో సమస్య ఇ-మెయిల్ ఐడీ. మున్ముందు వారి భాషల్లో ఇ-మెయిల్ ఐడీ లభించే అవకాశముందా ?
జవాబు: తాజా పరిణామాన్ని గమనిస్తే... టాప్ లెవెల్‌లో IDNలను ప్రవేశపెట్టేందుకు ICANN ఆమోదం తెలిపింది. ఇక ఇ-మెయిల్ అడ్రెస్‌లో కేవలం ఇంగ్లీష్ అక్షరమాలనే ఉపయోగించాల్సిన పరిస్థితిని ఇది తప్పిస్తుంది. కనుక, యూజర్లు వారి భాషల్లోనే ఇ-మెయిల్ ఐడీలు పొందవచ్చు.
ప్రశ్న: లాంగ్వేజి కంప్యూటింగ్‌కు సంబంధించి భారతీయ భాషలు, ఇంగ్లీష్‌లోనూ భాషాఇండియా పోర్టల్‌లో సవివరంగా సమాచారాన్ని అందిస్తున్నసంగతి మీకు తెలుసు. లాంగ్వేజి కంప్యూటింగ్ పట్ల ఆసక్తి గల వ్యక్తిగా, నిపుణుడిగా ఇండిక్ లాంగ్వేజి కంప్యూటింగ్ వ్యవహారాల్లో భాషాఇండియా ప్రయత్నాలపై మీ అభిప్రాయం ఏమిటి ? ఏవైనా సలహాలిస్తారా ?
జవాబు: భారతీయ భాషలకు సంబంధించిన సమాచారం కోసం నేను భాషాఇండియాను చూస్తుంటాను. ఇటీవల 'internationalized domain names' అనే అంశంపై భాషాఇండియాలో వచ్చిన మణియం (i-DNS.net International Inc) గారి ఇంటర్వ్యూ చదివాను. భాషాఇండియా కొనసాగిస్తున్న ప్రయత్నాల్ని నేను మనస్పూర్తిగా ప్రశంసిస్తున్నాను.
భాషాఇండియాను ఒక ఆకర్షణీయమైన రిసోర్స్ సెంటర్‌గా తీర్చిదిద్దాలన్నది నా సలహా. కంప్యూటర్ తమ కోసం ఉన్నదనే విషయాన్ని సాధారణ ప్రజలంతా వచ్చి తెలుసుకోవాలి. మీ సమాచారం సులభశైలిలో సాధారణ భాషలో ఉండేలా చూడండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని అనంతమైన వనరుల గురించి ప్రజలకు తెలిసేలా చెయ్యండి. ఇంటర్నెట్‌లో ప్రాంతీయ భాషలు ఉనికి చాటుకుంటున్న నేపథ్యంలో ఇంగ్లీష్‌ను చూచి భయవడవద్దని చెప్పండి.