స్థానికీకరణ ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉంది.... ‘వీవెన్’
తెలుగు బ్లాగర్లకు సుపరిచితమైన పేరు ‘వీవెన్’. ఆయన రూపొందించిన బ్లాగ్ ఏగ్రిగేటర్ ‘కూడలి’ ఎన్నో ఆసక్తిదాయకమైన తెలుగు బ్లాగుల్ని వెలుగులోకి తీసుకువచ్చిన సుప్రసిద్ధ పరిచయవేదిక. ఆయన తయారుచేసిన ‘లేఖిని’తో ఎందరో ‘బ్లాగ్ బోర్డు’పై తెలుగు అక్షరాలు నేర్చుకున్నారు. నిజామాబాద్ వాసి అయిన వీవెన్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రయివేటు సంస్థలో పనిచేస్తూ వెబ్‌సైట్లు, Open source project localization కార్యకలాపాల్లోనూ నిమగ్నమై ఉన్నారు. అంతర్జాలంలో తెలుగు వాడకం కోసం సేవలందించే ‘e-తెలుగు’ సంస్థ అధ్యక్షుడు కూడా అయిన ‘వీవెన్’తో భాషాఇండియా మాటామంతీ మీకోసం...

భాషాఇండియా: మీ ‘కూడలి ( koodali.org )’ ద్వారా ఎన్నో వందల బ్లాగ్‌లు వెలుగులోకి వచ్చాయి. ఇది ఎప్పుడు మొదలైంది? దీన్ని ప్రారంభించాలన్న ఆలోచన ఎలా కల్గింది?
వీవెన్: కూడలి 2006 జూన్ నెలలో మొదలైంది. మొజిల్లా ప్లానెట్, డెబియన్ ప్లానెట్ వంటి తరహాలో తెలుగు బ్లాగులకీ ఒక సైటు ఉంటే బాగుంటుందనిపించి ‘కూడలి’ని మొదలుపెట్టాను.
భాషాఇండియా: ఇప్పటివరకూ ఎన్ని బ్లాగ్‌లు 'కూడలి'లో చేరాయి ? ఇవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? తెలుగులో సరాసరి రోజుకు ఎన్ని కొత్త బ్లాగ్‌లు వస్తున్నాయి ?
వీవెన్: ప్రస్తుతం కూడలి 2,500 వరకూ బ్లాగులని సంకలనిస్తూంది. బ్లాగులని వర్గీకరించలేము గానీ బ్లాగుల్లో రాజకీయం, ఆధ్యాత్మికం, సాంకేతిక విషయాలు, హాస్యం... ఇలా అన్ని రకాల విషయాలూ రాస్తున్నారు. ఈ మధ్య రోజుకు సగటున 4 నుండి 5 కొత్త తెలుగు బ్లాగులు వస్తున్నాయి.
భాషాఇండియా: ఇక ఎందరో నెటిజన్లకు తెలుగు టైపింగ్ నేర్పిన మీ ‘లేఖిని ( lekhini.org )’ గురించి చెప్పండి? ఎప్పుడు దీనిని తయారు చేశారు? నెటిజన్ల స్పందన ఎలా ఉంది?
వీవెన్: లేఖినిని 2006 మార్చి నెలలో తయారుచేశాను. ఫైర్‌ఫాక్స్ పొడగింత పద్మ ఆధారంగా దీన్ని తయారుచేశాను. అప్పట్లో తెలుగు టైపు చెయ్యడానికి ఇప్పుడున్నన్ని పనిముట్లు లేవు కనుక లేఖిని చాలా విజయవంతమైంది.
భాషాఇండియా: Koodali.org, Lekhini.org లకు కొనసాగింపుగా ప్రస్తుతం ఏమైనా చేస్తున్నారా? మీ ఇతర ఆవిష్కరణల గురించి కూడా తెలియజేయండి.
వీవెన్: కూడలిని అభివృద్ధిపరిచే ఆలోచనలు ఉన్నాయి. తెలుగు మరియు ఇతర భారతీయ భాషల టైపింగుకి ఉద్దేశించిన భారత ప్రభుత్వం వారి ఇన్‌స్క్రిప్ట్ లేఅవుట్‌ని ప్రచారం చేయడానికి ఒక అనధికారిక సైటుని తయారుచేస్తున్నాను: inscriptlayout.org/telugu
అలానే కొత్త తెలుగు పదాలని ఒక చోట కూర్చే ప్రయత్నంగా ‘తెలుగుపదం (telugupadam.org)’ అన్న సైటుని కూడా నిర్వహిస్తున్నాను.
భాషాఇండియా: Local Language Computing (ప్రాంతీయ భాషల మాధ్యమంతో కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్ల వినియోగం) పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రక్రియను ఇంకా ఎలా ముందుకు తీసుకువెళ్లవచ్చు?
వీవెన్: ఆంగ్లం రాని వాళ్ళకి ప్రాంతీయ భాషల్లో ఉండే కంప్యూటర్ ఉపకరణాలు తప్పనిసరి. అయితే, స్థానికీకరణ ఇంకా ప్రారంభ స్థాయిలోనే ఉందని నా అభిప్రాయం. ఉపకరణాల స్థానికీకరణతో బాటు, పదాల ప్రామాణీకరణ, వివిధ ఉపకరణాలని ఎలా ఉపయోగించాలో తెలిపే పత్రావళి కూడా తెలుగులో అందుబాటులోకి రావాలి.
భాషాఇండియా: ఇంటర్నెట్‌లో తెలుగు వాడకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న e-తెలుగు సంస్థ అధ్యక్షునిగా కూడా మీరు ఉన్నారు. ఈ సంస్థ భవిష్య కార్యాచరణ గురించి కూడా కొన్ని వివరాలివ్వండి.
వీవెన్: ముందుగా, కంప్యూటర్లలలో తెలుగు చూడవచ్చూ, రాయవచ్చనీ మరియు జాలాన్ని తెలుగులోనూ వెతకవచ్చనీ తెలియజేస్తున్నాం. ఇందుకోసం, పుస్తక ప్రదర్శన వంటి ఉత్సవాలలో స్టాల్ ఏర్పాటు చేసి ఉచిత సేవలందిస్తున్నాం. కంప్యూటర్లో తెలుగు వాడకంపై వివిధ వర్గాల వారికి అవగాహనా సదస్సులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు కూడా చేస్తూన్నాం. వివిధ ఉపకరణాల తెలుగు స్థానికీకరణల్లో పాలుపంచుకుంటున్నాం. వికీపీడియాని ఎలా ఉపయోగించుకోవాలి ? ఇంకా ఎలా తోడ్పడాలనే విషయాలపైన, ప్రోగ్రామింగ్ విద్యార్థులకు యూనికోడ్ గురించి అవగాహనా సదస్సు నిర్వహించే యోచనలు ఉన్నాయి. యూనికోడ్ తెలుగు ఫాంట్లని తయారు చేయించడం, తెలుగు OCR మరియు స్పెల్ చెకింగ్ మొదలగు ప్రయత్నాలకి తోడ్పడటం వంటివి దీర్ఘకాలిక ప్రణాళికలో ఉన్నాయి.