పరిమిత వ్యయంతో అపరిమిత పాఠక లోకానికి మీ రచనల్ని త్వరితగతిన చేరవేయడానికి సరైన మార్గం e-పుస్తకం అంటూ తెలుగు రచనా ప్రపంచానికి ఇంటర్నెట్‌లో చేయూతనిస్తున్న సంస్థ "వికాసధాత్రి". Onlineలో e-పుస్తకాలయంగా ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న "వికాసధాత్రి" నిర్వాహకులు గాలి ఉదయకుమార్, గాలి అరుణ దంపతులు తమ పాత్రను దీనికి మాత్రమే పరిమితం చేయలేదు. బాధ్యత గల పౌరులుగా సమాజంలో మార్పు కోసం వినియోగదారులు, పలు వర్గాలను లక్ష్యంగా చేసుకుని బ్లాగులు, ఇ-పత్రిక ద్వారా వారికి తోడ్పాటునిస్తున్నారు. ఈ దంపతులతో భాషాఇండియా ముఖాముఖి...

 


 
భాషా ఇండియా: ఇంటర్నెట్‌లో తెలుగు భాషలోనూ e-పుస్తకాలు విరివిగా అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని వికాసధాత్రి ఎప్పుడు గుర్తించింది ?

 

వికాసధాత్రి: మేము 2005లో తెలుగులో IEC (Information, Education and Communication) పుస్తకాల రూపకల్పన కోసం సమాచార సేకరణకు ఇంటర్నెట్ పైనే ఎక్కువగా ఆధారపడేవారం. అప్పట్లో మాకు ఆంగ్లభాషలో e-పుస్తకాలు, వ్యాసాలు, వీడియోల రూపంలో విస్తృతంగా సమాచారం లభించేది. ఆ నాటికే తెలుగు వెబ్‌సైట్లు, బ్లాగులు ఉన్నప్పటికీ  వివిధ అంశాలపై ఇంటర్నెట్‌లో తెలుగు సమాచారం చాలా పరిమితంగా ఉండేది. దీంతో తెలుగులో e-పుస్తకాల విరివిగా అందుబాటులోకి రావలసిన అవసరాన్ని మేం గుర్తించి ఈ దిశగా సంకల్పించాం.

 

*****

 

భాషా ఇండియా: ఇంటర్నెట్‌లో మీ తొలి e-పుస్తకాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన సందర్భం గురించి చెబుతారా ?

 

వికాసధాత్రి: మేం విశాఖపట్టణంలో ఉన్న రోజుల్లో "తూనికలు - కొలతలు" అంశంపై తొలి e-పుస్తకాన్ని రూపొందించి CDలు, ఇ-మెయిల్ ద్వారా ఉచితంగా పంపిణీ చేశాం. తర్వాత వెబ్‌సైట్ ద్వారా అందరికీ చేరువ చేశాం. అనంతరం మరో 10 పుస్తకాల్ని కూడా e-పుస్తకాలుగా తయారు చేసి నెట్‌లో ఉంచాం. తొలుత Exe ఫైల్స్‌గా.. తర్వాత PDF, Flash, PPTల రూపంలోనూ వివిధ అంశాలపై తెలుగుభాషలో e-పుస్తకాలను సిద్ధం చేసి మా http://vikasadhatri.org ద్వారా అందరికీ చేరవేస్తున్నాం.

 

*****

 

భాషా ఇండియా: వికాసధాత్రిలో ఏ ఏ అంశాలపై e-పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ?

 

వికాసధాత్రి: ఇది onlineలో తెలుగు పుస్తకాలయం. కనుక, అన్ని అంశాలపైనా.. అంటే, కథలు, కవితలు, బాల సాహిత్యం, దళిత సాహిత్యం, నాటికలు, నవలలు, ఆధ్యాత్మికం, చరిత్ర, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, సైకాలజీ ఇలా సమాజంలోని పలు కోణాల్ని ప్రతిబింబించే పాత, కొత్త పుస్తకాలు ఇక్కడ ఎలక్ట్రానిక్ పుస్తకాలుగా లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా వీటిని ఎక్కడి నుంచైనా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో ఉంచే ప్రతి పుస్తకానికీ సంబంధించి సదరు రచయితల నుంచి తప్పక అనుమతి తీసుకుంటున్నాం. కులం, మతం, జాతి, ప్రాంతీయ మనోభావాలను దెబ్బతీసేలా హింస, శృంగారం లాంటి పుస్తకాలకు ఇక్కడ చోటుండదు. మా పుస్తకాలయంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలుగు అనువాదం కూడా ఉంది.

 

*****

 

భాషా ఇండియా: e-పుస్తకాల ప్రచురణ క్రమంలో తెలుగు రచయితలతో వికాసధాత్రి సంబంధాలు, సంప్రదింపుల గురించి తెలియజేస్తారా ?

 

వికాసధాత్రి: మేము కొన్ని e-పుస్తకాలను సిద్ధం చేసి onlineలో అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత వాటిని చూచి పలువురు రచయితలు వారి పుస్తకాల్ని e-పుస్తకాలుగా రూపొందించేందుకు ముందుకు వచ్చారు. ఇక మావంతుగా మేం కూడా కొందరు రచయితలను గుర్తించి e-పుస్తకాల గురించి, వీటి రూపకల్పనలో ఉన్న సౌలభ్యం, online వేదికగా పాఠకుల్ని సులువుగా చేరడంలో గల సౌకర్యం గురించి లేఖల ద్వారా తెలియజేశాం. దాంతో తొలి రోజుల్లో కొందరు పంపిన పుస్తకాల్ని scan చేసి e-పుస్తకాలుగా మార్చాం. తర్వాత చాలామంది రచయితలు తెలుగు టైపింగ్ కూడా నేర్చుకుని వారే వారి రచనల్ని టైప్ చేసి పంపుతున్నారు. ఇక ఇటీవలి రచనలు మామూలు పుస్తకంగా కాకుండా ముందుగానే e-పుస్తకం రూపంలో వికాసధాత్రి ద్వారా పాఠకుల ముందుకు వచ్చే విధంగా పురోగతి కనిపిస్తున్నది. ఈ మధ్య కాలంలో చూస్తే e-పుస్తకాల అమ్మకం దిశగా కూడా రచయితల ఆలోచనలు సాగుతున్నాయి.

 

*****

 

భాషా ఇండియా: అసలు e-పుస్తకం ఎందుకు ? ఆటు రచయితలకు.. ఇటు పాఠకులకు కలిగే సౌలభ్యం గురించి మీ కోణంలో వివరించండి.

వికాసధాత్రి: నేటి సమాజంలో చూస్తే వ్యాపార విలువలతో ముడిపడిన (కమర్షియల్) రచనలు.. అంటే, అమ్మకాల ద్వారా ఆదాయం పొందడం లక్ష్యంగా మార్కెట్‌లోకి వచ్చే నవలలు, పాఠ్య పుస్తకాలు, పత్రికలు లాంటివి వాటికి ప్రచురణ సంస్థ, ప్రచారం, మార్కెటింగ్ వ్యవస్థల తోడ్పాటు ఉంటుంది. వీటి ప్రచురణ క్రమంలో చోటుచేసుకునే Design, Paper, పిన్నింగ్, బైండింగ్, పంపిణీ ఖర్చులు రాబట్టడమేగాక లాభాలార్జించేందుకు ఈ వ్యవస్థల సహాయం ఉంటుంది. ఇంత ఉన్నా నేడున్న పోటీలో ఖర్చులు రాబట్టుకోవడమే కష్టంగా మారింది. పోటీకి తోడు పాఠకుల అభిరుచులు కూడా మారాయి. తెలుగులో చాలా పత్రికలు, రకరకాల సాహిత్యం, ఇతర సమాచారం ఇంటర్నెట్‌లో ఉచితంగానే అందుబాటులో ఉన్నందువల్ల పుస్తకాలు కొని చదివే పాఠకుల సంఖ్య చాలా తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చులు రాబట్టుకుని లాభం, నష్టం లేని స్థితి (break even point)కి రావడానికి రచయితలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సామాజిక కోణం (Developmental issues) లో వచ్చే రచనలు అమ్ముడు పోవడం మరింత కష్టం. ఈ తరహా రచనలు లాభార్జన దృష్టితో కాకుండా పుస్తకాలు జనంలోకి వెళ్ళడమే లక్ష్యంగా ఉంటాయి. అంటే, ఖర్చులు తిరిగివస్తే చాలన్నమాట. అలాంటప్పుడు వీటి రచయితలు, ప్రచురణకర్తలకు నష్టం వస్తే మరింత కష్టంగా ఉంటుంది.

 

ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే e-పుస్తక రూపం. అదేలాగంటే.. ఒక రచన పూర్తయ్యాక దానిని e-పుస్తకం రూపంలో వెలువరిస్తే తక్కువ వ్యయంతోనే మనం చెప్పాల్సింది జనానికి చేరవేయవచ్చు. రచనను టైప్ చేశాక డిజైన్ పని పూర్తి చేస్తే చాలు.. e-పుస్తకం సిద్ధమైనట్లే. Design, Paper, పిన్నింగ్, బైండింగ్, పంపిణీ దశలు లేవు. CDలుగా లేదా online ద్వారా అందుబాటులోకి తెస్తే భౌగోళిక ఎల్లలతో నిమిత్తం లేకుండా సదరు రచనలు ఎవరికి చేరాలో వారికి క్షణాల్లో చేరిపోతాయి. పైన పేర్కోన్న కమర్షియల్ రచనల విషయానికి వస్తే అలాంటి రచయితలు కూడా password భద్రత లాంటి ఆత్యాధునిక రక్షణ మధ్య నిర్ణీత ధరలకు వారి రచనల్ని e-పుస్తకంగా CDలుగా విక్రయించుకోవచ్చు. ఒకసారి డబ్బు పెట్టి కొన్నవారు ఉద్దేశ్యపూర్వకంగా దానిని ఇతరులకు ఉచితంగా ఇవ్వరు కదా... అలా చూసుకుంటే మామూలు పుస్తకాలు కూడా ఒకరు డబ్బు పెట్టి కొన్న తర్వాత అది చాలా చేతులు మారుతుంది. ఇలా కాదంటే మొదటి ఎడిషన్ మామూలు పుస్తకంగా వెలువరించి, ఆశించిన లాభం వచ్చాక తదుపరి ఎడిషన్ నుంచీ e-పుస్తకంగా చేసుకోవచ్చు. జేబులోంచి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుపెట్టకుండా ప్రపంచానికి మీ రచనల్ని సులభతరంగా చేరవేయడానికి సరైన మార్గం e-పుస్తకం.

 

*****

 

భాషా ఇండియా: తెలుగు రచయితలు ఎవరైనా వారి పుస్తకాల్ని e-పుస్తకాలుగా మార్చుకోవడానికి, వాటిని వికాసధాత్రి ద్వారా onlineలో అందుబాటులోకి తేవడానికి ఏం చెయ్యాలో చెప్పండి.

వికాసధాత్రి: ముందుగా చెప్పేదేమిటంటే, రచయితలు వారి పుస్తకాల్ని వికాసధాత్రిలో ఉచితంగా ఉంచవచ్చు. ఇందుకుగాను కంప్యూటర్‌లో టైప్ చేసి, లేఅవుట్ చేసిన పుస్తకం సాఫ్ట్ కాపీని CDలో మాకివ్వాలి. దీనిలోనే డిజైన్ చేసిన కవర్ పేజీ కూడా ఉండేలా చూడాలి. CDతో పాటు ముద్రించిన పుస్తక ప్రతులు రెండిటిన జతపరచాలి. రచయితల వద్ద వారి ముద్రిత పుస్తకాల సాఫ్ట్ కాపీ లేకుంటే పుస్తకంలోని ప్రతి పేజీనీ స్కానింగ్ చేసి తిరిగి పుస్తక రూపంలో డిజైన్ చేయాల్సి ఉంటుంది. లేదా మళ్ళీ టైపింగ్, డిజైన్ చేయించవలసి ఉంటుంది. రచయితలకు స్వయంగా వీటిని చేయించడం సాధ్యం కాకుంటే వికాసధాత్రిని సంప్రదించవచ్చు.

 

*****

 

భాషా ఇండియా: ఇంకా అచ్చువేయని పుస్తకాల్ని కూడా onlineలో ఉంచాలంటే ఎలా ?

 

వికాసధాత్రి: ఇంకా అచ్చుకురాని రచనలను కూడా ఇంటర్నెట్‌లో ఉంచవచ్చు. ఇందువల్ల తక్కువ వ్యయంలోనే ప్రపంచంలోని పాఠకులందరినీ చేరగలుగుతారు. ముందుగా మీ రచనను కంప్యూటర్‌లో టైప్ చేయించి, కవర్ పేజీతో సహా డిజైన్ చేయించాలి. అనంతరం ఈ సాఫ్ట్ కాపీని మాకు CDగా అందజేస్తే చాలు. దీనిని ఉచితంగా e-పుస్తకంగా onlineలో ఉంచుతాం. టైపింగ్, కవర్ పేజీ డిజైన్ కార్యకలాపాల్లో రచయితలకు ఇబ్బందులుంటే వికాసధాత్రిని సంప్రదించవచ్చు.

 

*****

 

భాషా ఇండియా: పుస్తక రచయితలంటే కాపీరైట్ అంశం తెరపైకి వస్తుంది. ఈ విషయంలో వికాసధాత్రి విధానం ఏమిటి ?

 

వికాసధాత్రి: ఇంటర్నెట్లో ఉంచాలనుకుంటున్న పుస్తకం కాపీరైట్ హక్కుదారు రచయితే అయి ఉండాలి. ఒకవేళ ఇతర ప్రచురణ సంస్థల ద్వారా పుస్తకాన్ని ముద్రించి ఉంటే దానిని "వికాసధాత్రి" ద్వారా పాఠకులకు e-పుస్తకం రూపంలో అందజేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారి నుంచి రచయిత అనుమతి తీసుకోవాలి.

 

*****

 

భాషా ఇండియా: పాఠకులకు e-పుస్తక పరిచయం ఎలా జరుగుతుంది ?

 

వికాసధాత్రి: online ద్వారా అందుబాటులో ఉన్న కొత్త, పాత పుస్తకాల్ని ఇంటర్నెట్ పాఠకులకు పరిచయం చేయడం కోసం పుస్తక సమీక్ష ఫీచర్ "పుస్తకాలయం"ను ప్రారంభించాం. ఇందుకోసం రచయితలే వారి రచనల గురించి ఇంగ్లీష్ లేదా తెలుగులో సమీక్ష చేసి పుస్తకం కాపీలు రెంటిని జతచేసి పంపాలి. మరో ముఖ్య విషయం ఏమిటంటే, తెలుగు రచయితల, పాత్రికేయుల సమగ్ర సమాచారంతో కూడిన ఒక డైరక్టరీని కూడా http://vikasadhatri.org వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చాం. రచయితలు వారి గురించి, వారి రచనల వివరాల్ని వికాసధాత్రి వెబ్‌సైట్‌లో ఇచ్చిన ఫారంలో నింపి పంపవచ్చు.

 

*****

 

భాషా ఇండియా: బాగుంది.. మీ ఇతర కార్యకలాపాల గురించి కూడా తెలియజేయగలరా ?

 

వికాసధాత్రి: సామాజికంగా మార్పు లక్ష్యంగా యువతరం కోసం సోషల్ డెవలప్‌మెంట్ మరియు మీడియాలో దాదాపు 20 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న అరుణ ఆధ్వర్యంలో http://blog.vikasadhatri.org వికాసధాత్రి e-పత్రిక నడుస్తోంది. ఇందులో చట్టాలు, వినియోగదారుల హక్కులు, పర్యావరణం, మానవహక్కులు, లింగ వివక్ష తదితర అంశాలెన్నో ఉన్నాయి. అలాగే, వినియోగదారుల అవగాహన కోసం http://consumer.vikasadhatri.org అనే బ్లాగ్ కూడా నడుస్తోంది. ఇది వినియోగదారుల హక్కులు, ఆరోగ్యం, పేదరికం, సుపరిపాలన తదితర అంశాలపై దృష్టి సారించింది. విద్య, రైల్వే, ట్రాఫిక్, టెలికాం, నీరు, వినోదం, విద్యుత్, రవాణా, పర్యావరణం బిఐఎస్ లాంటి ఎన్నో విషయాల్లో వినియోగదారులను చైతన్యపరిచేందుకు ఉద్దేశించిన online వేదిక ఇది. ఇంకా.. స్వచ్ఛంద సంస్థగా Consumer Education Society (CES ) పేరిట Free and Open Source Software (FOSS) గురించి, వినియోగదారులకు సంబంధించిన మరెన్నో విషయాలపై రాష్ట్రవ్యాప్తంగా వర్క్‌షాప్‌ల నిర్వహణ జరిగింది. లాభాపేక్ష రహిత సంస్థలు, ప్రజా సంఘాలు, యువజన, మహిళా సంఘాలవారు వీటిలో పాల్గొంటారు.