మీ గురించి, ఇండిక్ లాంగ్వేజి కమ్యూనిటీ అభివృద్ధి దిశగా సాగిన మీ అభిరుచి గురించి దయచేసి తెలియజేయండి?
నేను అహ్మదాబాద్‌కు చెందిన కామర్స్ గ్రాడ్యుయేట్‌ను. నా భర్త, ఇద్దరు పిల్లలే నా కుటుంబం. మాది ప్రధానంగా వస్త్రరంగ వ్యాపారం. వృత్తిపరంగా నేను వెబ్‌సైట్ల అభివృద్ధి, ఆంగ్లం నుంచి గుజరాతీలోకి పుస్తకాలు, వెబ్‌సైట్లను అనువదించడం చేస్తుంటాను. ఇదికాకుండా పలు సంస్థలకు నేను స్వచ్ఛందంగా సేవలందిస్తాను. నాకెన్నో అభిరుచులున్నాయి. స్వీయపరిశీలనతో స్వయంగా నేర్చుకుంటాను. జీవితంలోని కొత్త విషయాలు నేర్చుకోవడమంటే ఎంతో ఇష్టపడతాను. చిన్నతనం నుంచీ పుస్తకపఠనమంటే ప్రాణమిచ్చేదాన్ని, బహుమతులుగా పుస్తకాలు రావాలని కోరుకునేదాన్ని. వ్యక్తిగా అవకాశమున్నప్పుడల్లా ఎవరికైనా చేయూతనివ్వడానికి ప్రయత్నిస్తుంటాను.
మీ విద్యా నేపథ్యం కామర్స్... అంటే అకౌంటెన్సీకి సంబంధించింది. అయితే మీ కెరీర్‌లో ఎక్కువ భాగం కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌తో ముడిపడి ఉండటం ఆసక్తికరంగా ఉంది. మీకు వీటిపట్ల ఆసక్తి ఎలా కలిగింది?
నేను కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక మా కుటుంబ వ్యాపార సంస్థలోనే అకౌంట్స్ విభాగంలో పని చేసేదాన్ని. 1982-83 ప్రాంతంలో మేం ఒక కంప్యూటర్ (ZX-Spectrum) కొన్నాం. అది మాకు అకౌంట్స్‌లో తోడ్పడుతుందని భావించి నేను ఎంతో ఇష్టపడేదాన్ని. అయితే, ఈ మెషీన్లు పురుషులకే గాని స్త్రీలకు కాదని (ఆ రోజుల్లో స్త్రీలు ఎంతో అరుదుగా కంప్యూటర్లు వాడేవారు) ఒకరు జోక్ చేసి వేళాకోళం చేశారు. దాంతో నేను ఈ విషయాన్ని ఒక సవాల్‌గా తీసుకుని "బేసిక్" ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి షార్ట్ టెర్మ్ కోర్స్‌లో చేరాను. తర్వాత నాకు మరింత ఆసక్తి కలిగి కోబాల్ కూడా నేర్చుకున్నాను. కోర్స్ పూర్తయిన తర్వాత కార్పోరేట్ సంస్థలు, ట్రయినింగ్ ప్రోగ్రామర్లు, తర్వాత ప్రాజెక్ట్ సమన్వయకర్తగా నాకు ప్రయివేట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సంస్థలో ఉద్యోగావకాశాలు వచ్చాయి. ఆ రోజు జోక్ చేసిన వ్యక్తికి నిజంగా ధన్యవాదాలు. నా కెరీర్‌ను అది ఒక ముఖ్యమైన మలుపు తిప్పింది.
మీ సంస్థలు "సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్", "సైబర్‌స్కోప్ కనెక్షన్స్" గురించి చెప్పండి. వాటిలో భారతీయ భాషల కంప్యూటింగ్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయా ? సంస్కృతి, సంగీత ఇత్యాది సమాచార వ్యాప్తి ప్రాంతీయ భాషల్లోనే సాగుతుందా ?
1988-89 ప్రాంతాల్లో ఇంట్లో నా అవసరం (పిల్లలు చిన్నవారు కావడం వల్ల) ఉండటంతో ఇంట్లోనే ఒక ఆఫీస్ పెట్టుకుని ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌లు చెయ్యడం మొదలుపెట్టాను. అదే "సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్". ఇందులో అకౌంటింగ్, సేల్స్, ఇన్వెంటరీ వ్యవహారాల కోసం వారి వారి అవసరాలకు అనుగుణంగా క్లిప్పర్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజి ద్వారా సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తుండేదాన్ని. ఇండిక్ కంప్యూటింగ్‌తో వీటికేమీ సంబంధంలేదు. అయితే, గుజరాతీ మాట్లాడే వ్యాపారులతో నా సంప్రదింపుల నేపథ్యంలో ఇంకా ఎంతో చెయ్యాలని నాకనిపించేది.
"సైబర్‌స్కోప్ కనెక్షన్స్" ద్వారా నా ఆకాంక్ష నెరవేరింది. 1996-97 ప్రాంతంలో గుజరాత్ ఆన్‌లైన్ అనే పోర్టల్‌ను మొదట ఇంగ్లీష్‌లో ప్రారంభించి ఆ తర్వాత గుజరాతీ పాంట్స్ చేర్చాం. దాంతో సంస్కృతి, సాహిత్యం, ప్రాంతీయపరమైన పలు అంశాల్ని అందించడానికి కావలసినంత స్వేచ్ఛ వచ్చింది.
ఇక LIVE WIRE! BBS ఏర్పాటు వెనుక గల ఉద్దేశ్యం ఏమిటి? ఇక్కడి మీ కార్యకలాపాల గురించి కొంచెం వివరించండి.
బాంబే ప్రధాన కేంద్రంగా Live Wire! BBS (http://lwbbs.net/) ను 1989లో సుచిత్ నందా ప్రారంభించారు. కలకత్తా, పూణే, మద్రాస్, హైదరాబాద్, వాపిలలో శాఖలతో ఇది విజయవంతంగా నడుస్తోంది. ఇక మైక్రోకంప్యూటర్ యూజర్స్ క్లబ్ (MUC) అనే ఉమ్మడి నేపథ్యం ఉండటంతో MUC సభ్యుల మధ్య కమ్యూనికేషన్ కోసం అహ్మదాబాద్‌లోనూ ఒక శాఖను నెలకొల్పాలన్నది నా మొదటి ఉద్దేశం. అసలు ఇలాంటి ఒక కమ్యూనికేషన్ సాధనం గురించిన ఆలోచనే ఎంతో ఉత్సాహాన్ని కల్గించింది.
అహ్మదాబాద్ శాఖను 1994లో ఏర్పాటైంది. ఇదే ఇక్కడ మొదటి మరియు ఏకైక BBS కాగా ఈ ప్రాంతీయ శాఖ నిర్వహణకు గాను నేనే (సిస్టం ఆపరేటర్) సేవలందించాను. సభ్యులు డయల్-అప్ మోడెంలతో లోకల్ నెట్‌వర్క్‌లోకి లాగిన్ అయ్యి ఇ-మెయిల్స్ రాసుకోవడం, ఓపెన్ సోర్స్ మరియు షేర్‌వేర్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవడం, చాటింగ్, ఆన్‌లైన్ గేమ్స్ ఆడటం, మెసేజ్ ఫోరాల్లో పాల్గొనడం వంటివి చేసేవారు. మాకు BharatNet (భారతదేశంలోని BBSలన్నిటి అనుసంధానం), Asianet, IndiaNet, and FidoNet (ప్రపంచవ్యాప్తంగా BBSలన్నిటి అనుసంధానం) లాంటి పబ్లిక్ మెసేజ్ ఫోరంలు ఉండేవి. వీటిలో కంప్యూటర్లు, ప్రోగ్రామింగ్, మెడిసిన్, కార్యక్రమాలు మరియు సహాయం మొదలుకొని మామూలు కబుర్లు, స్నేహాల వరకూ రకరకాల అంశాలుండేవి. వీటి ద్వారా వృత్తి నైపుణ్యం, సంస్కృతి, సంగీతం, సాహిత్యం, వ్యాపారాలకు సంబంధించిన అంశాల్ని పంచుకునేవారం. ఇది ఒక క్లోజ్ కమ్యూనిటీగా ఉండేది. Live Wire! BBSలో సుమారు 7000 మంది సభ్యులుండగా అహ్మదాబాద్ శాఖలోనే 150 మందికిపైగా ఉండేవారు.
వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి 1998లో మీరు ఎలాంటి ప్రాజెక్ట్‌లు నిర్వహించేవారు?
1998లో అంటే ఎక్కువ పని గుజరాత్ ఆన్‌లైన్ (http://gujaratonline.com/) కోసమే జరిగింది. వెబ్‌సైట్ వీక్షకుల విజ్ఞప్తులు, వారి వ్యాఖ్యల మేరకు గుజరాత్ ఆన్‌లైన్‌లో వివిధ అంశాల విస్తరణ కోసం తొలుత ప్రాజెక్ట్‌లు చేపట్టాం. 1998లో నిర్వహించిన ఇతర ముఖ్యమైన కార్యకలాపాల విషయానికి వస్తే హాస్యం, కవిత్వానికి సంబంధించిన పోర్టల్ Jokes’n’Stuff (http://jokesnstuff.net/) కోసం పని జరిగింది. క్రమక్రమంగా నేను వ్యక్తులు, స్థానిక వ్యాపారులు, ఔషధ సంస్థలు, మత సంస్థలు, వివిధ అభిరుచులున్నవారు, స్వచ్ఛంద సంస్థల కోసం వెబ్‌సైట్ల డెవలప్‌మెంట్ చేశాను.
నేటి రోజుల్లో ప్రాంతీయ భాషల్లో కంప్యూటింగ్, అనువాదం మధ్య పొంతన గురించి మీరేమనుకుంటున్నారు ?
ప్రస్తుతం మనం ప్రాంతీయ భాషలో కంప్యూటింగ్ మరియు అనువాదాల్ని కలిగి ఉండాల్సిన చోట మనమున్నాం. నేడు కంప్యూటర్లను ఉపయోగిస్తున్నవారిలో అత్యధికులకు ఇంగ్లీష్ తెలుసు కనుక వారికి ఇదేమంత విషయం కాకపోవచ్చు. ఈ అంశాన్ని మనం విస్తృతంగా చూస్తే కంప్యూటర్లను వారి మాతృభాషలో ఉపయోగించే వ్యక్తుల గురించి మనం ఆలోచించాలి. ప్రాంతీయ భాషలో కంప్యూటింగ్ లేకుంటే ఈ అడ్డంకిని అధిగమించలేం. రెండో అంశం... మన డేటాలో అత్యధిగ భాగం (ప్రభుత్వ సంబంధమైనటువంటి) ప్రాంతీయ భాషలోనే ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సి వస్తే ప్రాంతీయ భాషలో కంప్యూటింగ్, అనువాదాలు వంటివి లేకుండా సాగించలేం. ఇక మూడో అంశం, నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏమిటంటే... రాబోయే తరాల్లో మన ప్రాంతీయ భాషల్ని సజీవంగా నిలపాలంటే ఇదొక్కటే మార్గమని నేను భావిస్తున్నాను.
గుజరాత్ ఆన్‌లైన్ పోర్టల్ నుంచి గుజరాతీ సామాజిక వర్గం ఏ విధమైన ప్రయోజనాలు అందుకుంటుందో చెబుతారా?
గుజరాత్‌లో "జ్యాఁ జ్యాఁ వాసే గుజరాతీ, త్యాఁ సదా కాల్ గుజరాత్" అని ఒక సామెత ఉంది. అంటే గుజరాతీయులు ఎక్కడ నివసిస్తున్నప్పటికీ వారి హృదయాల్లో ఎప్పటికీ "గుజరాత్" సజీవంగానే ఉంటుందని అర్థం. ఇంకొకలా చెప్పాలంటే గుజరాత్ ఒక పారిశ్రామిక సామాజిక వర్గం కాగా ప్రపంచవ్యాప్తంగా గుజరాతీయులున్నారు. వారు తమ మాతృభూమికి దూరంగా ఉన్నప్పటికీ వారి జన్మభూమిని, ప్రజల్ని మరువరు. ఈ హృదయాలన్నిటి అనుసంధానం జరగాల్సిన అవసరముందని నేను భావిస్తున్నాను. ఈ అనుసంధానానికి ఒక వేదికే గుజరాత్ ఆన్‌లైన్. సమాచారం, స్థానిక వార్తలు, వ్యాపార అవకాశాలు, సాహిత్యం, సంగీతం, సంప్రదింపులను అందిస్తూ ఇలాంటి వేదికను నిలబెట్టేందుకు నేను వీలైనంత ప్రయత్నం చేస్తున్నాను.
శ్రీరామచంద్రా మిషన్‌లో గుజరాతీ అనువాద బృందం సభ్యురాలిగా మీ కార్యకలాపాల గురించి మరిన్ని వివరాలు తెలియజేయగలరా ?
శ్రీరామచంద్ర మిషన్ (http://srcm.org/) ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇక్కడ మేము మా మాస్టర్ (గురూజీ) పూజ్య చారీజీ మార్గదర్శకత్వంలో ధ్యానాది కార్యక్రమాల్ని నిర్వర్తిస్తుంటాం. ఈ సంస్థ యొక్క సాహిత్యం మా మాస్టర్ బోధనలు, రచనలు, ప్రసంగాలతో కూడి ఉంటుంది. ఇందులో అత్యధిక భాగం ప్రధానంగా ఇంగ్లీష్‌లో ఉంటుంది.
పాఠకులు బాగా అర్థం చేసుకోవడం కోసం ఈ సాహిత్యాన్ని గుజరాతీలోకి (ఇతర ప్రాంతీయ భాషల్లోకి కూడా) అనువదించేందుకు బృందాల్ని ఏర్పాటు చేశారు. పుస్తకాల అనువాదం, అనువదించినవాటిని సమీక్షించేందుకు, సరిదిద్దేందుకు వారిలోవారే ఇచ్చిపుచ్చుకోవడం, తుదిరూపునివ్వడం తదితర కార్యకలాపాల్ని ఈ బృంద సభ్యులు నిర్వర్తిస్తారు. చేయవలసిన పని, ఉన్న సమయం వంటి కారణాల మేరకు బృంద సభ్యుల కార్యకలాపాలు మారుతుంటాయి. సాధారణంగా మేం ఒక సంవత్సరకాలంలో రెండు నుంచి మూడు గుజరాతీ పుస్తకాల్ని అనువదిస్తాం. శ్రీ రామచంద్రా మిషన్, చెన్నైవారు ఈ పుస్తకాల్ని ప్రచురిస్తారు.
మీరు KIDLINK కోసం చేస్తున్న కార్యకలాపాలు విభిన్నంగాను, ఆసక్తిదాయకంగాను ఉన్నాయి. KIDLINK గురించి, భూకంపం సంభవించినప్పుడు బాధితులకు పునరావాసం కోసం ఇది చేసిన కృషి గురించి తెలియజేయండి.
KIDLINK (www.kidlink.org) అనేది ఇంటర్నెట్‌లో నడిచే సార్వత్రిక అంతర్జాతీయ పాఠశాల లాంటిది. పిల్లలు (4 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసుగలవారు) పరిపక్వత సాధించడానికి, జీవితంలో ఉపయోగపడే మెళకువల్ని నేర్చుకోవడానికి అవసరమైన తోడ్పాటునివ్వడమే దీని ఉద్దేశ్యం. పిల్లలు, విద్యార్థులు విడివిడిగా వారి తరగతుల్లో భాగంగా ఇందులోకి లాగిన్ అయ్యి వారి భావాల్ని వ్యక్తీకరించుకుంటారు. కొనసాగుతున్న ప్రాజెక్ట్‌లు, ఆర్ట్స్‌లో పాల్గొంటారు. 1990లో ఇది ప్రారంభమైన నాటి నుంచీ 165 దేశాలకు చెందిన బాలలు ఇందులో నమోదయ్యారు.
ఇక 2001లో భూకంపం సంభవించినప్పుడు KIDLINK యొక్క డిజాస్టర్ ప్రాజెక్ట్‌లో భాగంగా నేను ఒక పునరావాస శిబిరంలో పనిచేశాను. భూకంప బాధిత బాలల్ని మిగతా ప్రపంచంలోని బాలలతో అనుసంధానించేందుకు (ఇంటర్నెట్ ద్వారా) మేం ప్రయత్నించాం. వారి మధ్య స్నేహం పెంపొందేందుకు, భావాలు మరియు కళల్ని పరస్పరం పంచుకునేందుకు మేం చేసిన ప్రయత్నం కొంతమేర వారికి సహకరించింది. బయటి ప్రపంచంలోని బాలల ప్రేమను ఆస్వాదించి, భద్రత, స్నేహ భావాల్ని పెంపొందించుకోగలిగారు. వారి భావోద్వేగాల్ని తెలుసుకోవడం ద్వారా వారు జీవనస్రవంతిలో ముందుకెళ్ళేలా చూడటం చాలా ముఖ్యం. ఇలాంటి కష్టతరమైన సమస్యల్లో చిక్కుకున్న బాలలకు ఇంకా విస్తృతంగా సాయం అందేలా చెయ్యడం కోసం, డిజాస్టర్ ప్రాజెక్ట్ అనుభవం ఆధారంగా సుదీర్ఘకాలంలో మేం ఇంకా ఎంతో చెయ్యాలనుకుంటున్నాం. KIDLINKలో గుజరాతీ బాలలకోసం గుజరాతీ భాషతో పాటుగా 12 భాషల్లో వెబ్ పేజీల్ని అందిస్తున్నాం.
ఆధ్యాత్మికత విషయానికి వస్తే చాలామంది... మరీ ముఖ్యంగా యువతరం దీనిని ఒక నిస్సారమైన అంశంగా భావిస్తున్నది. మరి ఇలాంటివారు దీని ప్రాధాన్యతను గుర్తెరిగేలా చేసేందుకు గాను సహజ్ జ్యోత్ పత్రిక సంపాదకురాలిగా మీరు దీనిని మరింత ఆసక్తికరంగా మలిచేందుకు ఏ విధమైన ప్రణాళికలతో ముందుకెళుతున్నారు ?
నిజం చెప్పాలంటే ఆధ్యాత్మికత అనేది ఒక విధమైన జీవనశైలి. అది భౌతిక జీవితం కంటే భిన్నమైందీకాదు, కష్టమైందీకాదు. మా మాస్టర్ చెప్పిన ప్రకారం జీవితంలో "సమతౌల్యత"ను సాధించాలి. మేం సహజ మార్గాన్ని సాధన చేస్తుంటాం. సహజ్ జ్యోత్ అనేది మా గుజరాతీ ఆధ్యాత్మిక త్రైమాసిక పత్రిక. ఇక ఆలోచనలు, భావాలు, వ్యవస్థలు, అధ్యయనం విషయానికి వస్తే నేటి యువత రూపాంతరం చెందడానికి ఎంతో అనుకూలంగా ఉంది. వాస్తవానికి శ్రీరామచంద్ర మిషన్‌లో నేడు పెద్ద సంఖ్యలో యువతీయువకుల్ని చూస్తున్నాను. మేం సహజ్ జ్యోత్ పత్రికను యువతరం కోసం, బాలలకోసం పుస్తకరూపంలోనూ, ఇ-మెయిల్ రూపం (యూనికోడ్ ఫాంట్స్) లోనూ వెలువరిస్తున్నాం. దీని ప్రస్తుత సర్క్యులేషన్ 950 ప్రతులు.
కొత్త భాషలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి కేవలం ఆసక్తి మాత్రమేనా లేక భాషాపరమైన అభివృద్ధికి చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో నేర్చుకున్నారా ?
భాషలు నేర్చుకోవాలన్న నా ఆసక్తి పూర్తిగా అభిరుచి మాత్రమే. భారతీయులుగా ఎవరైనా నాలుగు భాషలు అంటే... ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, వారి మాతృభాష (నా విషయంలో గుజరాతీ) నేర్చుకోవాలి. ఇవికాకుండా నేను ఇష్టపడిన భాష ఫ్రెంచ్ కూడా నేర్చుకున్నాను. భవిష్యత్తులో బెంగాలీ కూడా నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే, ఈ భాషలు నేర్చుకోవడం వెనుక ప్రత్యేకంగా ఉద్దేశ్యమంటూ ఏమీ లేదు. నాకు అవకాశమున్నంత మేర భాషాభివృద్ధికి చేయూతమివ్వడం ఎంతో ఇష్టపడతాను. ఇక కంప్యూటర్లకు సంబంధించిన పలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలు నేర్చుకోవడం వెనుక నిజంగానే ఒక లక్ష్యముంది.
భాషాఇండియా పోర్టల్‌పై మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి.
భాషాఇండియా పోర్టల్‌పై నా దృష్టి పడినప్పటి నుంచీ అది నన్ను ఎంతో ఆకర్షించింది. అంతకు ముందయితే... ఇంటర్నెట్‌లో భారతీయ భాషల అభివృద్ధికి పెద్దగా జరిగిందేమీ లేదన్న అసంతృప్తి ఉండేది. భాష అనేది అవరోధం కాకుంటే మనం ఎంతైనా సాధించవచ్చు.
తొలినాళ్ళలో సంప్రదింపులు జరుపుకోవడానికి వ్యక్తులు ఉపయోగించిన మాటలు లేదా రాతలు వారి పరిసరాలకే పరిమితం. ముద్రణ వ్యవస్థను కనుగొన్న తర్వాత మొదటి విప్లవం చోటు చేసుకుంది. వారి భాష ఎందరినో చేరింది. ఇంటర్నెట్‌తో మరో విప్లవం మొదలైంది. భాషాపరమైన అవరోధాన్ని మినహాయిస్తే, వారి భావాలు మరెందరినో చేరుకున్నాయి. ఇప్పుడు భాషాఇండియాతో ఆ అవరోధం కూడా తొలగిపోయింది. భాషాఇండియా అనేది కేవలం ఒక పోర్టల్ మాత్రం కాదు. అదొక విప్లవం. ఈ దిశగా అడుగులు వేసిన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను.
భాషాఇండియా వేదికగా గుజరాతీ కమ్యూనిటీని ఆన్‌లైన్‌లో విస్తరింపజేసేందుకు మీరు ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళుతున్నారు, పురోగతి ఎలా ఉంది ?
కంప్యూటింగ్ ప్రపంచంలో "గుజరాతీ ఎందుకు?" అంటూ కళ్ళెగరేసినవారిని నేను చూశాను. "ఎందుకు కాదు" అని నేను వారితో ఎప్పుడూ అంటుండేదాన్ని. నేటి ప్రపంచంలో ఇంగ్లీష్‌కి ఉన్న ప్రాధాన్యతను నేను కాదనడంలేదు. అయితే ఒక భాష కనుమరుగైపోవడం నేను భరించలేను. ఒక మాతృభాష ఎప్పుడూ హృదయంతో ముడిపడి ఉంటుంది.
ఇక భాషాఇండియాలో గుజరాతీ సామాజికవర్గం కలసికట్టుగా వారి మాతృభాషను అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక మంచి మార్గంలో ఈ సుందరమైన భాషను సజీవంగా నిలుపుకోవచ్చు. ఇక యూనికోడ్‌తో ఇది అత్యంత సులభ సాధ్యం. ఇప్పటివరకూ చూస్తే భాషాభివృద్ధికి తోడ్పాటు మాత్రమేగాక "అప్‌నీ భాషా, అప్‌ను గౌరవ్" (మన భాషే మనకు గర్వకారణం) లాంటి గుజరాతీ చర్చా వేదికల్ని నిర్వహించాం. గుజరాతీ కంప్యూటింగ్ పరిభాష రూపకల్పన కోసం కూడా పనిచేసేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఇందులో పాల్గొనేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇది అన్నిరకాలుగా పురోగతి సాధిస్తుందని నేను నమ్ముతున్నాను.