మైకేల్, మీతో ముఖాముఖికి అవకాశం రావడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా భారతీయ భాషల కంప్యూటింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారెవరైనా సరే మీ బ్లాగ్ 'Sorting it all Out (Michael Kaplan's random stuff of dubious value)' ను విస్మరించలేరు. భారతీయ భాషలు, లిపులతో మీకున్న అనుబంధం గురించి కొంచెం వివరించగలరా?
నేను అన్ని భాషల్ని, వాటి లిపులను ప్రేమిస్తాను. భారతీయ భాషల్ని నేను చదవలేకున్నా చాలా భారతీయ భాషల యూనికోడ్ ప్రాపర్టీస్ గురించి మంచి పరిశోధన చేశాను. భారతీయ భాషల లిపుల పట్ల నాకున్న ప్రేమ కారణంగా భారతీయ భాషల నిపుణులతో సంప్రదింపులు ప్రారంభించాను. INFITTతో నాకున్న అనుబంధం అలాంటిదే.
INFITT అనేది తమిళ భాషలో కంప్యూటింగ్, తమిళ ఇంటర్నెట్ అభివృద్ధి, వాడకం పట్ల ఆసక్తి కలిగిన బృందాలు, వ్యక్తులతో పాటుగా ప్రభుత్వాలు, సంస్థలకు ప్రాతినిథ్యం వహించే తొలి అంతర్జాతీయ సంస్థ. తమిళ ఐటీ ప్రపంచంలో INFITTని ముఖ్యమైన సంస్థగా యూనికోడ్ కన్సార్టియం పరిగణిస్తున్నది. INFITT సిఫార్సుల్ని అమలు చేసే క్రమంలో యూనికోడ్ కన్సార్టియంలో నేను ముఖ్య పాత్ర పోషించానని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను.
ప్రస్తుతం నేను ప్రపంచ భాషలకు సంబంధించిన కంప్యూటింగ్ కార్యకలాపాలతో వ్యవహరించే మైక్రోసాఫ్ట్ వారి వరల్డ్ రెడీనెస్ బృందంతో పనిచేస్తున్నాను. మా ఉత్పత్తుల్ని స్థానీకరించి వాటిని జనబాహుళ్యానికి చేరవేయడం మైక్రోసాఫ్ట్‌లో మా పని. ప్రపంచంలో అత్యధికులు వారి సంప్రదింపు కార్యకలాపాలకు ఇంగ్లీషేతర భాషల్ని ఉపయోగిస్తున్న విషయం మాకు తెలుసు. ఇందుకు భారతదేశం మినహాయింపు కాదు. ఈ క్రమంలోనే మైక్రోసాఫ్ట్‌లో స్థానీకరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం స్థానీకరణ యుగం నడుస్తున్నది. పలు కంపెనీలు వాటి ఉత్పత్తుల్ని స్థానీకరించడం పట్ల ఆసక్తిగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కూడా తన ఉత్పత్తుల్ని స్థానీకరించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. భారత్‌లో కంప్యూటింగ్ దిశగా సాగే ప్రయత్నాలు, స్థానీకరణ కార్యకలాపాల్ని మొత్తం మీద మీ అభిప్రాయం ఏమిటి?
కంప్యూటర్లలోని ఇంగ్లీష్ భాష, ఇంగ్లీషేతర భాషల వాడకందార్లకు ఒక పెద్ద అడ్డంకి అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో అత్యధిక ప్రజలకు ఇంగ్లీష్ తెలియనందువల్ల వారంతా కంప్యూటింగ్ ప్రయోజనాల్ని కోల్పోతున్నారు. వీరంతా కంప్యూటింగ్ పరికరాల్ని ఉపయోగించుకునేలా చేసి, కంప్యూటింగ్ ప్రయోజనాల్ని ఆస్వాదించేలా చెయ్యడం మా కర్తవ్యం.
పరిస్థితిని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, మైక్రోసాఫ్ట్ వంటి ప్రయివేటు సంస్థలు, వ్యక్తులు ఎంతగానో ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి వివిధ భాషల్లో కొంత పురోగతి ఉంది. వివిధ భాషలకు మద్దతునిచ్చే సామగ్రి ఉంది. వివిధ ఉత్పత్తుల ఇంటర్‌ఫేస్‌లు పలు భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఎన్నో భారతీయ భాషల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIPs) లను విడుదల చేసింది.
ఇక్కడ మీతో ప్రత్యేకమైన అంశాన్ని పంచుకోవాలి. నేను విద్యార్థుల్ని లేదా ప్రోఫెషనల్స్‌ను కలుసుకున్నప్పుడు కొన్ని ప్రశ్నల్ని అడిగేవాణ్ణి - "మీకు మీ భాషలో టైప్ చెయ్యడం తెలుసా ? వివిధ భాషల్లో సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్ని మీరు ఉపయోగించారా ?" చాలా సందర్భాల్లో 'లేదు' అన్నదే ఎక్కువగా వినిపించే సమాథానం !
దీనిని బట్టి వివిధ భాషల కంప్యూటింగ్‌కు మనం సిద్ధంగా లేమని తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ గానీ లేక మరే కంపెనీ అయినప్పటికీ వాటి ఉత్పత్తుల్ని లాంగ్వేజ్ మార్కెట్‌లోకి తీసుకురావడానికి ఎంతో డబ్బు వెచ్చిస్తున్నాయి. ప్రజలు వీటిని ఉపయోగించి ప్రతిస్పందన తెలియజేస్తే ఆ ఉత్పత్తుల్ని ఇంకా మెరుగుపరచాలని ఆ సంస్థలు భావిస్తున్నాయి. అయితే, దురదృష్టవశాత్తు ఇది జరగడంలేదు. మేమిస్తున్న వాటిని ప్రజలు ఉపయోగించి వారి సలహాలివ్వాలని నేను కోరుతున్నాను.
ఇందుకు కారణం ఏమిటంటారు? ఈ అడ్డంకిని మనం ఎలా అధిగమించగలం ? కంప్యూటింగ్ ప్రయోజనాలు ప్రజానీకానికి అందేలా ఏ విధంగా ముందుకెళ్ళాలి ?
ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే, కంప్యూటర్ వాడకందార్లు ఎక్కువ పరిజ్ఞానాన్ని, అవకాశాల్ని సాధించడానికి ఇంగ్లీష్ భాష వీలుగా ఉంది. ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం చేసేవారు వారి అవసరం మేరకు ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ప్రాంతీయ భాషలో కంప్యూటింగ్‌ను అలవరుచుకునే క్రమంలో తొలి అడుగులో ఉంటారు. వీరు ముఖ్యమైన పాత్ర పోషించాలి. ప్రాంతీయ భాషలో కంప్యూటింగ్ అభివృద్ధి ప్రక్రియకు వీరు నాయకత్వం వహించాలి.
ప్రజలు కంప్యూటర్ స్క్రీన్ పైన వారి భాషను చూచినప్పుడు వారు ఉద్వేగానికి గురై దానిని ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలనుకుంటారు. అయితే, కంప్యూటర్‌లో ప్రాంతీయ భాష వాడకం కొంత కష్టతరమైనది. కంప్యూటర్‌లో తమ భాషను సహజంగా వాడుకోవడానికి అడ్డంకిగా ఉండే ఏ విధమైన కంప్యూటర్ సాధనాలనైనా అడ్డు తొలగించుకోవాలని ఏ యూజర్ అయినా భావిస్తారు. అందువల్ల సగటు యూజర్‌కు లాంగ్వేజి కంప్యూటింగ్ సహజంగా ఉండేలా చెయ్యాలి.
స్థానీకరణ, లాంగ్వేజి కంప్యూటింగ్‌కు చెందిన వ్యక్తిగా... సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల్ని భారతీయ భాషల్లోకి స్థానీకరించే క్రమంలో మీరు ఎదుర్కున్న సవాళ్ళు ఏమిటి ? సాఫ్ట్‌వేర్ స్థానీకరణ ప్రక్రియ గురించి కూడా దయచేసి కాస్త వివరిస్తారా ?
స్థానీకరణ అంటే, ఒక ఉత్పత్తి లేదా సేవను దాని డాక్యుమెంటేషన్‌ను నిర్దిష్ట ప్రాంతపు సంస్కృతికి అనుగుణంగా రూపకల్పన చెయ్యడం. ఒక ఉత్పత్తి సిద్ధమైన తర్వాత మేం కృత్రిమ స్థానీకరణ (Pseudo localization) చేస్తాం. కృత్రిమ స్థానీకరణ అంటే ఒక సాఫ్ట్‌వేర్‌ను అంతర్జాతీయీకరించడానికి గల అవకాశాల్ని పరీక్షించడానికి చేసే సాఫ్ట్‌వేర్ పరీక్షా విధానం. తర్వాత UIలోని ప్రతి అంశాన్నీ ఒక టెస్టర్ పరిశీలించి ప్రతి ఒక్కటీ సక్రమంగా ప్రదర్శితమయ్యేలా చూస్తారు.
ఒక అప్లికేషన్‌ను స్థానికరించడమంటే... క్యారెక్టర్ సెట్స్ గురించి ప్రాథమికమైన అవగాహన కలిగి ఉండాలి. వీటికి సంబంధించిన అంశాలు తెలిసి ఉండాలి. స్థానీకరణలో భాగంగా అప్లికేషన్ యూజర్ ఇంటర్‌పేస్‌ను అనువదించడం, నిర్దిష్ట సంస్కృతి / ప్రాంతానికి అనుగుణంగా గ్రాఫిక్స్‌ను మలచడం తదితర ప్రక్రియలుంటాయి. సదరు అప్లికేషన్‌కు సంబంధించిన సహాయాంశాల్ని కూడా అనువదించడం కూడా స్థానీకరణలో భాగమే.
ఏ ఉత్పత్తినయినా భారతీయ భాషల్లోకి స్థానీకరించేటప్పుడు మేం ఎదుర్కున్న పెద్ద సవాల్ స్థలానికి సంబంధించిన సమస్య. ఇంగ్లీష్ పదం ఎక్కువ స్థలం ఆక్రమించదు. అయితే దానిని భారతీయ భాషల్లోకి అనువదించినప్పుడు ఆ పదం ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఉత్పత్తికి సంబంధించిన స్థానీకరణ ప్రణాళికలు వేసేటప్పుడే ఈ అంశంపై దృష్టిసారించి పరిష్కరించాలి.
స్థానీకరించిన ఉత్పత్తి యొక్క నాణ్యత అనేది మరొక సవాల్. మైక్రోసాఫ్ట్‌లో మేం ఎప్పుడూ అనువాదం అత్యుత్తమ నాణ్యతను కలిగి ఉండేలా కృషి చేస్తాం.
యూనికోడ్ ప్రమాణాలపై భాషా పండితులు, కంప్యూటింగ్ నిపుణుల నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. యూనికోడ్, ఇన్‌పుట్ మెథడ్స్‌తో దగ్గరి సంబంధాలున్న వ్యక్తిగా ఈ ఫిర్యాదులపై మీరెలా స్పందిస్తారు ?
అవును, యూనికోడ్ ప్రమాణాలపై ఫిర్యాదులున్నాయి. సమస్యలున్న మాట వాస్తవం. యూనికోడ్ పరిపూర్ణంగా లేదు. అయితే, ఈ సమస్యల విషయంలో ఏ ఒక్కరినో నిందించలేం. సంప్రదింపులు సరైన రీతిలో సాగనప్పుడు ఇబ్బందులు తలెత్తుతాయి. అనవసరమైన రగడ లేదా తీవ్రస్థాయిలో వాగ్యుద్ధాల వల్ల లాంగ్వేజి కంప్యూటింగ్ పురోగమనం మందగిస్తుందని నేను గట్టిగా నమ్ముతాను. ప్రస్తుతమున్న యుక్తమైన సమస్యలపై యూనికోడ్ కన్సార్టియంతో భాషా సంస్థలు సంప్రదింపులు జరపాలన్నది నా సలహా.
భారత్‌లో మైక్రోసాఫ్ట్ లాంగ్వేజి కంప్యూటింగ్ కార్యకలాపాల గురించి దయచేసి కొన్ని వివరాలివ్వగలరా?
భారత్‌లో లాంగ్వేజి కంప్యూటింగ్‌పై 1998 నుంచీ మైక్రోసాఫ్ట్ ఇండియా పని చేస్తున్నది. దేశ ఐటీ విప్లవంలో స్థానీకరణ కీలకపాత్ర పోషించగలదని గ్రహించిన తరుణంలో మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ బిల్ గేట్స్ సందర్శనతో ఇది మొదలైంది.
ఇంచుమించు 33కు పైగా భాషలు, 1652కు పైగా మాండలీకాలతో విభిన్న సంస్కృతులున్న దేశం భారత్. ప్రజల్లో 95 శాతం మంది ప్రజలు ప్రాంతీయ భాషలతో పనిచెయ్యడానికి ప్రాధాన్యతనిస్తారు. కేవలం ఐదు శాతం మందికే ఇంగ్లీష్ తెలుసు. భాషా వినియోగంలోని వ్యత్యాసం డిజిటల్ అంతరానికి దోహదపడుతోంది. భాషాపరమైన అడ్డంకిని అధిగమించేందుకు గాను దీనిపై వారధిగా ఈ కంపెనీ 1989నుంచీ పనిచేస్తోంది.
ముఖ్యమైన ఉత్పత్తుల స్థానీకరణలో టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా మైక్రోసాఫ్ట్ సంస్థ భారత మార్కెట్ కోసం వివిధ అవసరాలకు తగినట్లుగా ఇప్పటివరకూ ఎన్నో సోల్యూషన్లను అందించింది.
వాడకందార్లు తమ కంప్యూటర్లలో సులభంగా, వేగంగా భారతీయ భాషల పాఠాన్ని పొందుపరిచేందుకుగాను ఇన్‌పుట్ టూల్ (Indic Language Input Tool) ను మైక్రోసాఫ్ట్ అభివృద్ధి పరిచింది. 12 భారతీయ భాషలకు లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) లు అందుబాటులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ బ్రౌజర్ అయిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను కూడా ప్రధానమైన భారతీయ భాషల్లోకి స్థానీకరించారు.
మీరు ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ "Most Valued Professional" (MVP) గా ఉండేవారు. దాని గురించి మాతో కొంచెం పంచుకుంటారా ?
అవును, నేను ఒకప్పుడు "Most Valued Professional"గా ఉన్నాను. మైక్రోసాఫ్ట్ స్పాన్సర్ చేసిన CompuServe Access ఫోరంలో ఎక్కవ సమయం గడుపుతూండేవాడిని. మైక్రోసాఫ్ట్ తాజా ఉత్పత్తులపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే అవకాశం MVPకి కలగడమేగాక, మిగిలినవారికంటే ముందే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వీరికి అనుభవంలోకి వస్తుంది.
మైక్రోసాఫ్ట్ వార్తలు, సాఫ్ట్‌వేర్ ముందస్తు విడుదలలు, సాంకేతిక పరిజ్ఞాన పునాదిని పటిష్టపరచుకోవడానికి ఒక మార్గంగా MVP హోదా సహకరిస్తుంది. MVPగా ఉన్న వ్యక్తి తన కార్యకలాపాల్లో సహాయం పొందేందుకుగాను మైక్రోసాఫ్ట్‌లో ఎందరినో కలుసుకునే అవకాశం ఉంటుంది. తాను సముపార్జించిన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడానికి MVP సిద్ధంగా ఉండాలి. MVPల నుంచి ఎంతో పరిశోధన, పరిశ్రమను ఆశిస్తారు. MVPగా ఆ రోజుల్ని నేను ఎంతగానో ఆస్వాదించాను. తర్వాత నాకు మైక్రోసాఫ్ట్ నుంచి ఉద్యోగ ప్రతిపాదన రావడంతో MVP హోదాను విడిచిపెట్టాను.
కోయంబత్తూర్‌లో ఇటీవల జరిగిన తమిళ ఇంటర్నెట్ సదస్సులో మీరు అధికారిక ఆహ్వానితునిగా ఉన్నారు. భారత్‌ను మీరెలా చూస్తారు ? తమిళ ఇంటర్నెట్ సదస్సులో మీ అనుభవాల్ని మాతో పంచుకోగలరా ?
అదొక అద్భుతమైన అనుభవం. నేను రెండు పత్రాలు సమర్పించాను. నేను భారతదేశాన్ని, ఇక్కడి విభిన్న సంస్కృతుల్ని ప్రేమిస్తాను. వాస్తవానికి నేను ఇక్కడికి రావడం ఇది రెండోసారి. కోయంబత్తూర్‌లో నేను కంప్యూటింగ్ ప్రొఫెషనల్స్‌ను, భాషా పండితుల్ని కలుసుకున్నాను. ఆసక్తికరమైన అంశమేంటంటే ఉద్యోమిస్తామంటూ తమిళనాడు ప్రభుత్వం నుంచి నాకు ప్రతిపాదన వచ్చింది (నవ్వారు). ఇదొక మంచి జ్ఞాపకం. భారతదేశంలో ఉండటం నాకెంతో ఇష్టం. అయితే, మైక్రోసాఫ్ట్ కార్యకలాపాల పరంగా నేను చెయ్యాల్సింది ఎంతో ఉంది.
భాషాఇండియా ప్రయత్నాలపై మీ అభిప్రాయం తెలియజేస్తారా ?
భారతీయ భాషలతో కంప్యూటింగ్, స్థానీకరణ రంగాలపై దృష్టిసారించిన ఒక ప్రత్యేకమైన పోర్టల్ భాషాఇండియా అని నేను భావిస్తాను. స్థానిక భాషల్లో కంప్యూటింగ్‌పై అవగాహన కల్పించే ఈ పోర్టల్‌ను తరచూ వీక్షిస్తుంటాను. ఇది చాలా బాగుంది. అయితే, నాదొక సలహా. మా ఉత్పత్తులపై వాడకందార్ల ప్రతిస్పందన కోసం మైక్రోసాఫ్ట్‌లో ఉన్న మేమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటాం. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులపై వాడకందార్ల ప్రతిస్పందనను ఆహ్వానిస్తూ ఒక సంప్రదింపుల వ్యవస్థను భాషాఇండియాలో చేర్చవచ్చు. భాషాఇండియా కొనసాగిస్తున్న ప్రయత్నాలు ఎంతో విలువైనవి. భారతీయ భాషల్లో కంప్యూటింగ్ కార్యకలాపాలకు ఒక మార్గదర్శిగా భాషాఇండియా విజయవంతం కావాలని నేను కోరుకుంటున్నాను.