"భాషా పండితులు, సాంకేతిక నిపుణులు ఏకతాటిపై పనిచేయాలి"
- డాక్టర్ ఎం.ఆనంతకృష్ణన్
తమిళనాడులోని వాణియంబాడిలో పుట్టిన విద్యాశిఖరం డాక్టర్ ఎం.ఆనంతకృష్ణన్. విద్యాభ్యాసాన్ని తమిళంలోనే పూర్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచే గణితం పట్ల ఎంతో ఆసక్తిని కనబరచిన ఈయన రోడ్ల నిర్మాణ రంగంలో ఇంజనీరింగ్ పట్టభద్రులు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన అన్నా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీ కాన్పూర్‌లోను, అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ఓ సంస్థ సైన్స్ విభాగంలో పనిచేశారు. గతంలో తమిళనాడు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారునిగా కూడా సేవలందించారు. విద్యాభివృద్ధి లక్ష్యంగా ఏఐసీటీఈ దక్షిణ ప్రాంత ఛైర్మన్‌గా పనిచేసిన ఆనంతకృష్ణన్ చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ స్టడీస్ ఛైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించారు. 77 ఏళ్ల ప్రాయంలోను 25 ఏళ్ల యువకునిలా పని చేస్తున్న ఆయనను మన భాషా ఇండియా కోసం కలుసుకున్నప్పుడు...
విద్యాశాఖను మినహాయించి సాంకేతిక శాఖలో మీ భాగస్వామ్యం ఏమిటి?
ఆనంతకృష్ణన్: ఎన్నో విభాగాల్లో పలు చోట్ల పనిచేసినప్పటికీ తమిళనాడు ప్రభుత్వానికి సాంకేతిక సలహాదారునిగా పనిచేయడం నాకు ఎంతో సంతృప్తిని కలిగించింది. పలు ప్రజా సంక్షేమ పథకాల అమలుకు టెక్నికల్, సమాచార అంశాల ప్రాధాన్యతను తెలుసుకునే అవకాశం లభించింది. దేశంలోనే తొలిసారిగా ఇ-గవర్నెన్స్‌ను తమిళనాడులో అమలు చేశాం. దీన్ని మార్గదర్శకంగా తీసుకుని పలు రాష్ట్రాలు ఇ-గవర్నెన్స్‌ను అమలు చేస్తున్నాయి.
ప్రపంచ తమిళ మహాసభలను నిర్వహించిన అనుభవాన్ని వివరించండి
ఆనంతకృష్ణన్: తమిళ భాషాభివృద్ధి కోసం 1999లో రెండవ ప్రపంచ తమిళ మహాసభలను రాష్ట్రంలో ఘనంగా నిర్వహించాం. ఇందులో తమిళ భాషా పండితులు సాఫ్ట్‌వేర్ నిపుణులు, విద్యావంతులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ మహానాడులోనే తొలిసారిగా TAM మరియు TAB అక్షరాలను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేయటం జరిగింది. హైయ్యర్ సెకండరీ విద్యాస్థాయిలో తమిళ మీడియంలోనే కంప్యూటర్‌ కోర్సును ప్రారంభించడం జరిగింది.
గ్రామీణ ప్రాంతాల్లో సమాచార, సాంకేతిక రంగం అభివృద్ధికి మీ సూచనలు, సలహాలు ఏమిటి ?
ఆనంతకృష్ణన్: కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య విడుదల చేసిన పది వేల రూపాయలకే కంప్యూటర్‌ విక్రయం అహ్వానించదగినది. పాఠశాలలు, కళాశాలలు, పంచాయతీ శాఖలు, ప్రభుత్వ శాఖలకు వెళ్లే ప్రతి కంప్యూటర్‌లోను ప్రాంతీయ భాషా సాఫ్ట్‌వేర్‌ను పొందుపరచాలి. సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రజలకు ఉన్న లోటుపాట్లన్నీ భర్తీ చేయాలి. విదేశీ సాఫ్ట్‌వేర్‌లలో పలు రకాల అంశాలు అందుబాటులో ఉన్నప్పటికీ, మాతృభాషలో సాఫ్ట్‌వేర్ నిపుణులు తయారు చేసిన సాఫ్ట్‌వేర్ల ద్వారానే ఆ సంతృప్తిని పొందగలం.
ప్రాంతీయ భాషల్లో కంప్యూటింగ్ అభివృద్ధికి ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ఆనంతకృష్ణన్: భాషా పండితులు, సాంకేతిక నిపుణులు మరియు శాస్త్రవేత్తలు వేర్వేరుగా విడిపోయి పనిచేయకుండా ఏకతాటిపై పనిచేయాలి. అప్పుడే ప్రాంతీయ భాషల్లో కంప్యూటింగ్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు, యువకులు కూడా ఇందులో పాల్గొనాలి.
ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతున్న సమాచార రంగంలో మీకు నచ్చిన అంశాలు ఏమిటి ?
ఆనంతకృష్ణన్: కంప్యూటర్ ఆధారిత నిఘంటువుల రూపకల్పన, ఆప్టికల్ కేరక్టర్ రిగగ్నైజర్, సెర్చ్ ఇంజన్లు వంటివి ప్రాంతీయ భాషలకు ఎంతో దోహదపడుతున్నాయి. ఆర్థిక, వాణిజ్య పరంగా విజయం సాధించిన మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు కూడా.. తమిళం వంటి ప్రాంతీయ భాషలపై ప్రత్యేక శ్రద్ధ చూపించి, ప్రాంతీయ భాషల్లోనే సాఫ్ట్‌వేర్ల తయారీకి కృషి చేస్తున్నాయి. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రాంతీయ భాషల సాఫ్ట్‌వేర్ సీడీ ఓ విప్లవాన్నే సృష్టించింది. వీటిని అనుసరించినట్టయితే ప్రాంతీయ భాషల సాఫ్ట్‌వేర్‌ను మరింత ఉన్నత స్థానానికి తీసుకు వెళ్ళవచ్చు.