ఆడియో పాఠాలతో అంధ విద్యార్థులకు ఆసరా
(Audio Lessons for Blind Students)

 

అంధులైనవారికి అనుక్షణం ఎవరో ఒకరి ఆసరా తప్పనిసరి. జీవితంలోని వివిధ దశల్లో వారి అవసరాలు రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవలసింది వారి విద్యార్థి దశ. సమాజంలోని వివిధ కాలమాన పరిస్థితుల్ని ఒకసారి పరికిస్తే... తొలుత అంధ విద్యార్థులకు లూయీస్ బ్రెయిలీ నుంచి బ్రెయిలీ లిపి రూపంలో అండ లభించింది. అయితే ఆర్థిక పరిస్థితుల కారణంగా అందరికీ బ్రెయిలీ లిపిలోని పుస్తకాలు కొనుక్కునే అవకాశం ఉండకపోవచ్చు. అదీగాక మామూలు పుస్తకాలు అందుబాటులో ఉన్నంతగా అన్ని రకాల సబ్జెక్ట్‌లూ బ్రెయిలీ లిపిలో లభించకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే మనదేశంలో చాలా రంగాల్లోని పరీక్షలు బ్రెయిలీ లిపిలో రాయడానికి ఇంకా పూర్తిస్థాయి అవకాశం లేదు. అలాంటి ఏర్పాటు చేద్దామనుకున్నా అదే స్థాయిలో బ్రెయిలీ లిపిలోని జవాబు పత్రాలు దిద్దే సామర్థ్యమున్న ఇన్విజిలేటర్ల కొరతను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

 

ఈ పరిస్థితుల నేపథ్యంలో పాఠాల్ని పదే పదే వింటూ మననం చేసుకుని, పరీక్షల్లో సహాయకుల ద్వారా రాసే అంధ విద్యార్థుల సంఖ్య ఎక్కువమంది అన్నది సుస్పష్టం. ఒకనాడయితే వీరు తమ స్నేహితులతో పాఠాలు చదివించుకుని వాటిని టేప్ రికార్డర్ సాయంతో క్యాసెట్లలో రికార్డు చేసుకుని వింటుండేవారు. ఇప్పుడు టేప్ రికార్డర్ స్థానంలో మరింత శబ్ద నాణ్యతను అందించే సీడీ, డీవీడీ ప్లేయర్లు చౌకధరల్లో అందుబాటులోకి వచ్చాయి.

 

ఈ వాతావరణం మధ్య పలు సాఫ్ట్‌వేర్ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసుతో చేపడుతున్న చర్యలు అంధ విద్యార్థులకు మరింత తోడ్పాటును ఇస్తున్నాయి. అదేమంటే సమాజసేవా దృక్పథమున్న ఈ సంస్థలు అంధ విద్యార్థుల పాఠ్యావసరాల్ని తెలుసుకుని వివిధ పరీక్షలకు సంబంధించిన పాఠాల్ని సీడీల్లో రికార్డు చేసి వారికి ఉచితంగా అందిస్తున్నాయి. ఇలా పాఠాల్ని రికార్డు చేసుకోవడానికి ఇంటర్నెట్‌లో ఉచితంగా పలు వాయిస్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్లు అందుబాటులో ఉన్నాయి. Microsoft Plus! Analog Recorder, Windows Media Playerలతో నాణ్యతాపరంగా ఇంకెన్నో అడుగులు ముందుకు వెయ్యవచ్చు.

 

పలు స్వచ్ఛంద సంస్థలు మరో మెట్టు పైకెక్కి అంధుల పురోగమనం కోసం కృషి చేస్తున్న సంస్థలకు ఉచితంగా మల్టీమీడియా సదుపాయమున్న కంప్యూటర్లు ఇచ్చి నెట్ సౌకర్యం కల్పించాయి. ఇందువల్ల ఇంటర్నెట్‌లో అంధులకోసం పొందుపరచి ఉన్న ఆడియో పాఠాలు, ఆడియో పత్రికల్ని విని విషయ పరిజ్ఞానం పెంచుకునే అవకాశం వారికి లభించింది. ఈ పాఠాల్ని, ఇతర ఆడియో సాహిత్యాన్ని డౌన్‌లోడ్ చేసుకోవడం, వాటిని సీడీల్లోకి రికార్డ్ చేసుకోవడం, ఈ ఆడియో ఫైళ్లను సీడీ, డీవీడీ ప్లేయర్ల ద్వారా మాత్రమేగాక మొబైల్ ఫోన్ల ద్వారా కూడా వినే సదుపాయం ఉండటం వల్ల అంధ విద్యార్థులకు విస్తృతంగా ప్రయోజనాలు కలుగుతాయనడంలో సందేహం లేదు.