ఆన్‌లైన్‌లో సెలెబ్రిటీలు... అభిమానుల కేరింతలు
(Celebrities online)
మన సమాజంలో సినిమా ప్రముఖులు, క్రీడాకారులు, రచయితలకు అభిమానులు ఎక్కువే. షారుఖ్, నాగ్, కరీనా, త్రిష, సచిన్, సెరెనా... ఇంకాస్త ముందుకెళితే ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ లాంటి యువ రాజకీయ నాయకులు... ఇలా ప్రముఖ వ్యక్తులతో సంభాషించాలని, వారి వ్యక్తిగత జీవితం, వారి ఇష్టాఇష్టాల గురించి తెలుసుకోవాలని ఆరాటపడే అభిమానులు కోకొల్లలు.
ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి వెళ్ళే భక్తులంతా శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత వారెక్కిన టూరిస్ట్ బస్సు ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లాంటి సినిమా యాక్టర్లని చూడటానికి ఆ పక్కనే ఉన్న మద్రాస్ (నేటి) చెన్నై కూడా వెళ్ళేది. వాళ్ళను ఈ అభిమానులు వ్యక్తిగతంగా కలుసుకుని, ఫోటోలు తీయించుకుని సరదా పడేవారు. మద్రాస్ రాలేని అభిమానులంతా తెలుగు సినిమా పత్రికల్లో వచ్చే సినిమా ఇంటర్వ్యూలు, వాళ్ళ ఇతర విశేషాల గురించిన విషయాల్ని ఆసక్తిగా తెలుసుకునేవారు. క్రికెట్, టెన్నిస్ క్రీడలకు విశేష ఆదరణ పెరిగాక స్పోర్ట్స్ పత్రికల ద్వారా క్రీడాకారుల విశేషాల్ని కూడా తెలుసుకుంటూ వచ్చారు ఈ అభిమానులు.
కాలం మారింది... వెబ్‌సైట్లు వచ్చాయి. ప్రముఖ వెబ్‌సైట్లు ఒకడుగు ముందుకేసి సినిమా ప్రముఖులు, క్రీడాకారులు, రచయితలతో నిర్దిష్ట సమయంలో Online Chat కు అవకాశం కల్పించేవి. అభిమానులు ముందుగానే సదరు వెబ్‌సైట్‌లోకి Log అయ్యి, పేరు నమోదు చేసుకుని వారి అభిమాన ప్రముఖులతో అవకాశమున్నంతమేర ముచ్చటించేవారు. అభిమానులు కూడా వెబ్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని తాము ఇష్టపడే ప్రముఖుల పేరిట సైట్స్ ప్రారంభించి వీలైనన్ని ఫోటోలు, వివరాలు, పాటలు సేకరించి పెట్టేవారు.
సాంకేతిక పరిజ్ఞానం ఇంకా అభివృద్ధి చెందింది. బ్లాగులు రంగప్రవేశం చేశాయి. అయితే ఈ సారి అభిమానులతో పాటు ప్రముఖులు కూడా టెక్నాలజీకి సై అన్నారు. వెండితెర వేల్పులు కూడా ఆధునిక పరిజ్ఞానానికి దాసోహమయ్యారు. Laptop కంప్యూటర్లు ఉపయోగిస్తూ e-mails, chatting ద్వారా తమ సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటూ, అభిమానులతో ముచ్చటిస్తూ బిజీ అయిపోయారు. స్వయంగా బ్లాగింగ్ చేస్తున్నారు. వారి బ్లాగుల్లో Poll, RSS feed, విడియోలు, ఆడియోలు పెట్టి అలరిస్తున్నారు.
బిగ్ బి అమితాబ్, అమీర్ ఖాన్, షారుఖ్, సల్మాన్, బిపాషా, కరీనా, ప్రిన్స్ మహేష్, సుమంత్, దర్శకుడు రాం గోపాల్ వర్మ ఇలా ఎందరెందరో Onlineలో అభిమానుల్ని అలరిస్తున్నారు. వీరి తాజా సినిమాల విశేషాలు, వ్యక్తిగత అంశాలు, ఇంకా ఎన్నో విషయాల్ని అభిమానులకు అందిస్తూ వారిని ఆహ్లాదపరుస్తున్నారు సినీ ప్రముఖులు.
ప్రస్తుతం Micro Blogging లేదా Mobile Blogging కూడా అందుబాటులోకి రావడం ప్రముఖులకు ఇంకా కలిసొచ్చింది. Laptop లేదా నెట్ కనెక్షన్ కోసం ఎదురుచూడకుండా చేతిలో ఉన్న Mobile Phoneతో చిన్న చిన్న సందేశాల రూపంలో ఎప్పటికప్పుడు వారి విశేషాల్ని తెలియజేస్తూ అభిమానుల్ని ఆనందపరుస్తున్నారు. ఒక అభిమానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి.... ఇప్పటికైతే ఇంగ్లీష్‌లోనే కొనసాగుతున్న ఈ తతంగం బహుశా త్వరలో తెలుగు, తమిళం లాంటి ప్రాంతీయ భాషలకూ విస్తరించవచ్చు. ఎందుకంటే అభిమానుల కోసం చాలామంది తారలు ప్రాంతీయ భాషల్ని కూడా నేర్చుకుంటున్నారు. ఈ ప్రయత్నం సఫలం కావాలని మనమంతా ఆకాంక్షిద్దాం.