కొబ్బరికాయలు కొయ్యాలా.. ఇదిగో ఆన్‌లైన్ డైరక్టరీ
నారికేళ పరిశ్రమ అనగానే ప్రపంచమంతా కేరళ రాష్ట్రంవైపే దృష్టిసారిస్తుందంటే అతిశయోక్తి గాదు. కొబ్బరి ఉత్పత్తులకు కేంద్రంగా అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఈ రాష్ట్రంలో చోటు చేసుకున్న సామాజిక మార్పుల నేపథ్యంలో ఇప్పుడు కొబ్బరి కాయలు కోసేవారే కనుచూపు మేరలో కనిపించడంలేదు. దీంతో కొబ్బరి పంటల యజమానులంతా కొబ్బరి కాయలు దించే కార్మికుల కోసం కన్నులు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
కొబ్బరి కాయల్ని కోసే వ్యక్తుల కొరత వల్ల మొత్తం పరిశ్రమకే ముప్పు వాటిల్లుతున్న తరుణంలో కేరళలోని కొబ్బరి అభివృద్ధి సంస్థ (సిడిబి) మేలుకుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడం కోసం ఆన్‌లైన్ సాయం తీసుకోవాలన్న ఆలోచనతో ముందుకొచ్చింది. వెంటనే ఒక సర్వే ప్రారంభించి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కొబ్బరి కాయలు కోయడాన్ని వృత్తిగా చేసుకున్న సుమారు 2,750 మంది వివరాల్ని సేకరించి వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.
ఈ డేటాబేస్‌కు Friends of Coconut Tree అని పేరు పెట్టారు. http://coconutboard.nic.in/friends-district.htm లోని ఈ వివరాల్ని కొబ్బరి తోటల యజమానులు ఉపయోగించుకోవచ్చు. కొబ్బరి కాయలు కోసేవారి పేర్లు, చిరునామా, వయసు, ఫోన్ నెంబర్లను ఇందులో పొందుపరిచారు. వీరిలో కాసర్‌గోడ్, కన్నూర్, కొళికోడ్, మలప్పురం, పాలక్కాడ్, త్రిశూర్, ఎర్నాకుళం, అలపుళ, కొట్టాయం, ఇడుక్కి, పత్తనంతిట్ట, కొల్లం, తిరువనంతపురం ప్రాంతాలకు చెందినవారుండగా, లక్షద్వీప్‌కు చెందినవారి వివరాలూ ఇక్కడున్నాయి.
కొబ్బరికాయలు కోసేవారి సంఖ్య నానాటికి తగ్గిపోతుండటంతో భవిష్యత్తులో ఈ పరిశ్రమపై ఎదుర్కొనబోయే ఇక్కట్లను దృష్టిలో ఉంచుకున్న సిడిబి నిరుద్యోగ యువకులకు శిక్షణనిచ్చి ఈ పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇందుకోసం 18 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసులో ఆరోగ్యవంతులైన పురుషులు, స్త్రీలనూ ఎంపిక చేసి కృషి విజ్ఞాన్ కేంద్రాల తోడ్పాటుతో శిక్షణనివ్వడానికి ఏర్పాట్లు చేసింది. వీరికి నెలకు రూ.950 రూపాయల స్టయిఫండ్, భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తారు. కనీస విద్యార్హతను ఏడవ తరగతిగా నిర్ణయించారు. ప్రతి జిల్లాలోనూ కొబ్బరి కాయలు కోయడమే వృత్తిగా ఉన్నవారిని గుర్తించడంలో కుటుంబశ్రీ, నెహ్రూ యువకేంద్ర, కొబ్బరి పెంపకందార్ల సహకార సంస్థలు, స్వయం సేవా సంస్థలు సిడిబికి సహకరిస్తున్నాయి.
ఒక అంచనా ప్రకారం కేరళలో 15 కోట్లకు పైగా కొబ్బరి చెట్లుండగా, కాయలు దించడానికి కనీసం 30,000 మంది కాయలు కోసేవారి అవసరముంది.