పల్లెసీమల్లోనూ డిజిటల్ పాఠాలు
(Now digital lessons in hamlets)

 

కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలతో కూడిన విద్యా వసతులు పట్టణాలకు, నగరాలకు మాత్రమే పరిమితం అనుకునే రోజులు పోయాయి. పట్టణాలు, నగరాల్లోని ప్రయివేట్, కార్పోరేట్, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు ఏ మేరకయితే Information Technology (ఐటీ) సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో గ్రామీణ విద్యార్థులకు కూడా అదే స్థాయిలో ఐటీ సౌకర్యాలను కల్పిస్తూ సమగ్ర ఐటీ విధానాన్ని ప్రభుత్వం రూపొందించడంతో ప్రభుత్వ – ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం, స్వచ్ఛంద సంస్థల చేయూతతో కొండకోనల్లోని పల్లె ప్రాంతాల విద్యార్థులు సైతం Multimedia మాధ్యమంతో Digital రూపంలో మరింత సులభంగా పాఠాల్ని అర్థం చేసుకోగల్గుతున్నారు.

 

అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ రంగంలో ఒక దిగ్గజమై వెలుగుతున్న Microsoft సంస్థ కూడా భారత ప్రభుత్వ తోడ్పాటుతో దేశవ్యాప్తంగా పట్టణాలు, పల్లె ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులకు సాఫ్ట్‌వేర్ల వినియోగంపై ఇచ్చిన శిక్షణ ఈ పరిణామానికి దోహదపడింది. Microsoft Officeలో భాగమైన Word, Excel, Power Point, Paint లాంటి సాఫ్ట్‌వేర్లను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకున్న ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు పాఠాల్ని బోధించే క్రమంలో వీటి సాయం తీసుకుంటున్నారు.

 

ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా భయపడే సబ్జెక్ట్‌లు  సైన్స్, మేథమెటిక్స్. ఇవి వారికి సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి Excel, Power Point చాలా ఉపయోగపడుతున్నాయి. సైన్స్ బొమ్మలకోసం Power Pointను ఉపయోగించి వాటికి Animation జోడించడం ద్వారా విద్యార్థులు పాఠాల్ని ఆసక్తికరంగా ఆలకిస్తూ సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశాల్ని తయారు చేస్తున్నారు.

 

ఇక సరికొత్త పరిణామం ఏమిటంటే... కంప్యూటర్లలో తెలుగు వాడకం. విద్యార్థులకు వారి మాతృభాషలోనే పాఠ్యాంశాలను బోధించడం వల్ల మరింత మెరుగ్గా రాణిస్తారని విద్యావేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పలువురు ఉపాధ్యాయులు తెలుగులోనే Unicode Fontsతో పాఠాల్ని రూపొందిస్తున్నారు. Unicodeకు అంతర్జాతీయంగా ఆమోదం ఉన్నందువల్ల అటు ఏ రకం కంప్యూటర్‌లో అయినా, ఇంటర్నెట్‌లో అయినా అక్షరాలు చక్కగా కనిపిస్తాయి.

 

ఇక పల్లె ప్రాంతాలకు కూడా Internet విస్తరించడం, ముఖ్యంగా గ్రామీణులకు తక్కువ వ్యయంతోనే Broadband సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల ఏ పాఠ్యాంశానికి సంబంధించిన విషయ సేకరణ చేసుకోవాలన్నా ఉపాధ్యాయులకు సులభతరమవుతున్నది.

 

తరగతిలో ఉపాధ్యాయులు పాఠం చెప్పడం పూర్తయిన తర్వాత విద్యార్థులు ఎప్పుడైనా ఆ పాఠాల్ని మళ్ళీ వినాలని లేదా చూడాలని అనుకోవచ్చు. ముఖ్యంగా పరీక్షల సమయంలో ఈ అవసరం వస్తుంది. ఆ సమయంలో సదరు ఉపాధ్యాయులు అందుబాటులో లేకున్నప్పటికీ ఆ పాఠాలు కంప్యూటర్లలోనే ఉంటాయి కనుక విద్యార్థులు వాటిని ఉపయోగించుకోవచ్చు.

 

శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమయిన పాలకొండకు చెందిన ఉపాధ్యాయురాలు లిల్లీరాణి ఇదే రీతిలో తన విద్యార్థుల కోసం పాఠాలు రూపొందించి రెండు సార్లు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, రాష్ట్ర స్థాయిలో ఇ-గురు పురస్కారానికి ఎంపికై అందరి మన్ననలూ అందుకున్నారు.

ఇదే బాటలో మిగిలిన ఉపాధ్యాయులు కూడా పయనిస్తారని ఆశిద్దాం....