మన డిజిటల్ మేప్‌లు సిద్ధం.. రియల్ రంగానికి వరం


(Digital Maps ready for Andhra Pradesh)

 

 

      మన గ్రామం లేదా పరిసర ప్రాంతాలకు సంబంధించిన నిర్దిష్ట గణాంకాలు, ఎల్లలు లేదా కొలతల వివరాలతో కూడిన భౌగోళిక చిత్రపటాలు (Maps) కావాలంటే మనమంతా ఎం చేస్తాం ? గ్రామ పంచాయితీ కార్యాలయానికి లేదా రెవెన్యూ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుని ఆ పటాల నకలు పత్రాలులు చేతికి వచ్చే వరకూ ఆ కార్యాలయాల చుట్టూ వారాలు లేదా నెలల తరబడి తిరుగుతుంటాం. అంతే కదా! పరిస్థితిని బట్టి జేబులు తడుముకుని అమ్యామ్యాలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలకు చెల్లుచీటీ పాడే తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డిజిటల్ మ్యాపింగ్ పనులు పూర్తవడమేగాక, రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన మ్యాప్‌నయినా క్షణాల్లో వీక్షించేలా వీటిని వివిధ అవసరాల కోసం ప్రభుత్వం సిద్ధం చేయించింది.

 

      ఈ వెబ్ ఆధారిత సేవలను ఇటీవలే కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ ప్రారంభించారు. http://nsdiindia.gov.in నుంచి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ప్రత్యేకించి గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన డిజిటల్ మ్యాప్‌లు మాత్రమే పూర్తయి అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల డిజిటల్ మ్యాపింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తవుతాయంటున్నారు. ఈ సరికొత్త వ్యవస్థ వల్ల 5 నుంచి 10 శాతం రెవెన్యూ ఆదా అవుతుందని ఒక అంచనా.

 

      ముఖ్యంగా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగానికి ఇవి ఎంతో కీలకం. ఈ మ్యాప్‌ల ద్వారా ఒక ప్రాంత సరిహద్దులు, నిర్దిష్ట కొలతలు, అక్కడి కాలువలు, చెఱువుల వైశాల్యాలు, రహదార్లు, భవనాలు, విద్యుత్ లైన్లు మొదలైనవాటి వివరాలన్నీ పొందవచ్చు. 1 : 50,000 స్కేలుతో తయారుచేసిన ఈ డిజిటల్ మ్యాప్‌ల ద్వారా ప్రస్తుతానికి కనిష్టంగా 12 మీటర్ల పరిధిలోని వివరాలు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో 1 : 10,000 స్కేలుతో ఈ మ్యాప్‌లను ఇంకా మెరుగుపరుస్తారట. అప్పుడు కనిష్టంగా 2.5 మీటర్ల పరిధిలో మరింత కచ్చితంగా ఒక ప్రాంతంలోని ప్రార్థనా మందిరాలు, గృహ సముదాయాలు, రైల్వే మార్గాలు, బస్ స్టాపులు, తపాలా కార్యాలయాలు, పోస్ట్ బాక్స్‌లు, ఎటిఎంల వివరాలు కూడా లభ్యమవుతాయి.

 

     భూకబ్జాలు, అక్రమ నిర్మాణాల భాగోతాల గుట్టు విప్పేందుకు ఈ డిజిటల్ మ్యాప్‌లను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. మున్ముందు మొబైల్ నుంచి కూడా వీటిని పొందే అవకాశం రావచ్చేమో ! ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.

Read More on...