డిజిటల్ వీడియోలు... కదలాడే జ్ఞాపకాలు

(Digital Videos, the moving memories....)

 

 

జీవితంలోని ఏ సందర్భాన్నయినా ఒక చలనచిత్రం (Movie) గా మలుచుకుంటే అది ఒక వేయి జ్ఞాపకాల దొంతరకు ప్రతిరూపమై నిలుస్తుంది. కదిలే బొమ్మల ఈ సమాహారం ఎన్నో జ్ఞాపకాల్ని తట్టి లేపుతుంది. అందుకేనేమో ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లోనూ బుల్లి బుల్లి వీడియో కెమెరాలు ప్రత్యక్షమవుతున్నాయి. స్టిల్ ఫొటోగ్రఫీ అందించే ఛాయా చిత్రాలకు అదనంగా కదలికలు, మాటలు, ఆటలు, పాటలు ఇలా ఎన్నిటినో చేర్చుకునే అవకాశం వీడియోలకు మాత్రమే ఉంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న Digital Video సాంకేతిక పరిజ్ఞానంతో వీడియోల్ని మరింత స్పష్టంగా రూపొందించుకోవచ్చు.

 

 

కెమెరాలు, మొబైల్ ఫోన్లు

 

గతంలో అయితే ఒక వీడియోను షూట్ చేసుకోవాలంటే వీడియోగ్రాఫర్ను పిలిపించుకోవడం, షూటింగ్ అయ్యాక ఆయన దానిని ఎడిట్ చేసి అక్కడక్కడా పాటలు చేర్చడం లాంటి తతంగం అంతా ఉండేది. ఫొటో ఆల్బం చేతికందడానికి ఒక వారం పడితే వీడియో వచ్చేసరికి సుమారు పదిహేను లేదా ఇరవై రోజులు పట్టేది. స్టిల్ ఫొటోలతోపాటు తక్కువ నిడివిగల వీడియోలు కూడా తీసుకునే వీలున్న డిజిటల్ కెమెరాలు, ఎక్కువ నిడివిగల వీడియోలు తీసుకోవడానికి ప్రత్యేకంగా డిజిటల్ వీడియో కెమెరాలు రంగ ప్రవేశం చెయ్యడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మొబైల్ ఫోన్లలోనూ ఇవే సదుపాయాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి.

 

 

అంతా ఇంట్లోనే

 

ఇక ఈ స్టిల్ ఫొటోలు, వీడియోలతో రకరకాల ఎడిటింగ్ కార్యకలాపాలు చేసుకోవడానికి Windows Movie Maker లాంటి ఎన్నెన్నో సాఫ్ట్వేర్లు అందుబాటులోకి రావడంతో కెమెరాలు, మొబైల్ ఫోన్లద్వారా Digital Movies తయారు చేసుకోవడం చాలామందికి ఒక అలవాటుగా మారింది. అంటే, ఒక డిజిటల్ లేదా వీడియో కెమెరా, కంప్యూటర్ మన దగ్గరుంటే ఇంట్లోనే కూర్చుని ఒక సినిమానే తయారు చెయ్యవచ్చు. ఇలా తయారు చేసుకున్న Digital Videosను ఇంటర్నెట్ ద్వారా మరెందరికో పంపించవచ్చు. Microsoft వారి MSN గ్రూపు వెబ్సైట్లలో పొందుపరుచుకోవచ్చు. ఇలా ఈ జ్ఞాపకాల్ని చిరకాలం పదిలం చేసుకోవచ్చు.

 

 

ఖర్చు ఎంతవుతుంది...

 

ఇంతాచేసి ఇందుకయ్యే ఖర్చు ఎంతండీ అంటే దాదాపు ఏమీ లేనట్టే. కెమెరా, కంప్యూటర్, అవసరమైన సాఫ్ట్వేర్లకు ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడతారు. కొన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఉచితంగా కూడా అందుబాటులో ఉన్నాయి. మీ Digital Videosను మరింత ఆకర్షణీయంగా తయారు చేసుకోవడమన్నది ఇక మీ ఎడిటింగ్ సామర్థ్యంపైన ఆధారపడి ఉంది. ఎడిటింగ్ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన చిట్కాలు ఇంటర్నెట్లో ఉచితంగానే దొరుకుతాయి.

 

 

ఎలాంటి వీడియోలు ?

 

పదిలంగా దాచుకునే జ్ఞాపకాలుగా ఎన్నో సందర్భాల్ని Digital Videos రూపంలోకి మార్చుకుంటున్నారు. IT అభివృద్ధి నేపథ్యంలో ముఖ్యంగా విదేశాలకు భారీ ఎత్తున తరలివెళ్ళిన మన భారతీయులు అక్కడి వేడుకలు, చూచిన ప్రదేశాలను వీడియోలకెక్కించి భారతదేశంలోని తమ బంధువులు, మిత్రులతో పంచుకుంటున్నారు. విదేశాల్లోని భారతీయ దంపతులు వారి పిల్లల కేరింతలు, అల్లరి, వినోద చేష్టల్ని వీడియోలకెక్కించి స్వదేశంలోని ఆ పిల్లల బామ్మలు, తాతయ్యలు తదితర బంధుమిత్ర గణంతో పంచుకుంటున్నారు. అదే విధంగా ఇక్కడివారు కూడా ఇలాంటి వాటిని అక్కడివారికి పంపుతున్నారు. వీరుగాకుండా వివిధ అంశాలపై ప్రత్యేకంగా ఆసక్తిగల వ్యక్తులు వారి అభిరుచుల మేరకు Digital Videosను రూపొందిస్తున్నారు. పర్యావరణ ప్రేమికులైతే ప్రకృతి, పశుపక్ష్యాదుల్ని, సామాజిక అంశాలపట్ల ఆసక్తి ఉన్నవారైతే సామాజిక స్పృహను రేకెత్తించే అంశాల్ని, విద్యార్థులైతే వారి వారి ఆసక్తుల మేరకు Digital Videos రూపొందించి ఇంటర్నెట్ ద్వారా ప్రదర్శిస్తున్నారు. వీటిలో చాలా వీడియోలు Short Filmsగా పోటీలకు కూడా వెళ్ళి బహుమతుల్ని గెల్చుకుంటున్నాయి. మరి మీరు కూడా చూడచక్కని Digital Videosను తయారు చేస్తారు కదూ...!