ఇక నెల రోజుల వ్యవధిలో భవిష్యనిధి ఇ-ట్రాన్స్‌ఫర్
(e-Transfer of PF account within a month)

 

దేశవ్యాప్తంగా ఉన్న ప్రావిడెంట్ ఫండ్ (భవిష్యనిధి) కార్యాలయాల కంప్యూటరీకరణ, వాటి మధ్య అనుసంధాన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావచ్చింది. PF ఖాతాల బదిలీ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నవారెవరైనా ఇక తమ ఖాతాల బదిలీ పురోగతిని onlineలోనే తెలుసుకోవచ్చు. మార్చి నెల మొదటివారంలోనే ఈ online సౌకర్యం అందుబాటులోకి రాగా, ఖాతాదారుల సౌకర్యం, సంస్థ కార్యకలాపాల్లో పారదర్శకత లక్ష్యంగా వ్యవస్థను తీర్చిదిద్దినట్లు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) అధికార్లు పేర్కొంటున్నారు.

 

PF ఖాతాల బదిలీకి విజ్ఞప్తి చేస్తూ ఖాతాదారుల నుంచి దరఖాస్తు అందిన తేదీ నుంచి నెల రోజుల సమయంలో బదిలీ ప్రక్రియ ముగించాలని నిర్దిష్ట కాలాన్ని గడువుగా విధించుకున్నప్పటికీ, అనధికారికంగా "వారంలోపు" సమయంలోనే బదలాయింపు పూర్తయ్యేలా చూసేందుకు అధికార్లు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. PF నగదును ఎలక్ట్రానిక్ పద్ధతిలో బదిలీ చేసే వ్యవస్థను ఈ ఏడాది జనవరి నెలలోనే సిద్ధం చేశారు. అంతక్రితం వరకూ ఖాతాల బదిలీకి దాదాపు ఏడాదిక సమయం పడుతుండగా, ఇప్పుడు బదిలీ గడువుకాలాన్ని నెలరోజులకు కుదించారు.

 

దరఖాస్తుదారులు వారి దరఖాస్తు పురోగతిని గురించి EPFO వెబ్ సైట్ epfindia.nic.in ద్వారా తెలుసుకోవచ్చు. ఈ సైట్‌లో కనిపించే Know Your Claims Status అనే లింక్‌పైన క్లిక్ చేసి వారి PF ఖాతా సంఖ్య, PF కార్యాలయం వివరాలివ్వగానే తాజా పరిస్థితి తెలియజేయబడుతుంది. సదరు దరఖాస్తు పరిశీలనకు వచ్చిందని లేకుంటే లేదని, ఆమోదం పొందిందని లేదా పరిశీలన దశలోనే ఉందని, చెల్లింపు జరిగిందని లేదా ఇంకా జరగాల్సి ఉందని, ఇలా తాజా స్థితిగతుల వివరాలు అక్కడ కనిపిస్తాయి. ఈ వివరాల్ని బట్టి దరఖాస్తుదారులు తదుపరి కార్యాచరణకు ఉపక్రమించవచ్చు.

 

ఇదంతా ఇలా ఉంటే, PF నగదు బదిలీ కోసం ఉద్యోగులు అనుసరించే ప్రక్రియలో మాత్రం మార్పేమీ లేదని తెలుస్తున్నది. ఉద్యోగులు ఫారం 13ను సంబంధిత PF ఖాతా సంఖ్యతో నింపి అందజేయగానే, పరిశీలన కోసం ఒక ప్రాంతీయ కార్యాలయం నుంచి మరొక ప్రాంతీయ కార్యాలయానికి పంపడం (వేర్వేరు ప్రాంతాలు అయినప్పుడు), తర్వాత  ఎలక్ట్రానిక్ పద్ధతిలో కొత్త ఖాతాకు PF నగదు బదిలీ కావడం, ఆయా ఉద్యోగుల కొత్త యజమానులకు ఈ వివరాల్ని తెలియజేయడం వంటివి జరుగుతాయి. వేర్వేరు ప్రాంతాలు కాకుండా, ఒకే ప్రాంతంలో అయితే, నగదును ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు మార్చుతారు. ఈ తాజా పరిణామాల వల్ల కోట్లాదిమంది EPF ఖాతాదార్లకు విలువైన సమయం ఆదా అవుతుంది. అదే సమయంలో అవినీతికి అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ దిశగా నడుం బిగించింది.

Read More on...