సాఫ్ట్వేర్లపై పెద్దల్లోనూ పెరుగుతున్న ఆసక్తి

 

ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లపై ఏమాత్రం అవగాహన ఉంది ? అని ప్రశ్నించుకుంటే రెండు రకాల మనస్తత్వాలు కనిపిస్తాయి. ఉద్యోగుల్లోని యువతీ యువకులు కంప్యూటర్లపై చకచకా పని చేసుకోవడం, కాస్త పెద్ద వయసు వారైతే, అంటే సుమారుగా 50 ఏళ్లు పైబడినవారిలో చాలామంది కంప్యూటర్లను ఉపయోగించే చేసే పనులకు యువ ఉద్యోగులపై ఆధారపడటంకనిపిస్తుంది. కంప్యూటర్ ఆన్ చెయ్యాలన్నా, ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించుకోవాలన్నా, డాక్యుమెంట్ ఏదైనా ప్రింట్ తీసుకోవాలన్నా పాపం వీరు భయపడుతుంటారు. తెలియక ఏదైనా జరిగితే ఏం కోంప మునుగుతుందోనన్న ఆందోళన ఈ పెద్దలలో కనిపిస్తుంది.

 

యువతీయువకులంటే కంప్యూటర్ సెంటర్లకు వెళ్ళి శిక్షణ తీసుకుంటారు. మరి పెద్దల విషయానికి వస్తే చాలామంది ఆ వయసులో కంప్యూటర్ సెంటర్కు వెళ్ళి వాళ్ళకంటే చాలా చిన్నవారైన విద్యార్థుల మధ్య నేర్చుకోవడం ఇబ్బందిగానూ, నామోషీగానూ భావిస్తుంటారు. ఇప్పుడు పరిస్థితి మారింది. కంప్యూటర్లు, సాఫ్ట్వేర్లపై పిన్నలకు ఎంత ఆసక్తి, పట్టు ఉన్నాయో అలాగే పెద్దలుకూడా పోటీపడి ఈ విషయాల గురించి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే పరిస్థితులు వారిని ఆ దిశగా ప్రేరేపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రస్తుత తరం యువతీయువకులు చాలామంది ఐటీ ఉద్యోగాలు లేదా ఇతరేత కారణాల రీత్యా దీర్ఘకాలం విదేశాలకు వెళుతున్నారు. అక్కడికెళ్ళాక తల్లిదండ్రులు, పిల్లల మధ్య Chatting, ఫోటోలు పంపించుకోవడం, Videos, Mails చూసుకోవడం తదితర కార్యకలాపాలకుగాను పెద్దలు సైతం కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ల వాడకంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకోసం వీరు కంప్యూటర్ సెంటర్లకు వెళ్ళడంలేదు పిల్లలే పెద్దలకు అన్నీ నేర్పేస్తున్నారు.

 

ఇతర కారణాల విషయానికి వస్తే, స్టాక్ మార్కెట్ Online కార్యకలాపాలు, Online Banking, Online Tuitions, Online Shopping, Online Games వంటివి ప్రస్తుతం ఊపందుకున్నాయి. నేటి యువతరం ఈ తరహా Online కార్యకలాపాల్ని చురుగ్గా నిర్వహిస్తుండగా ఈ క్రమంలో ఏదో ఒక దశలో ఇంట్లోని పెద్దల భాగస్వామ్యం కూడా తప్పనిసరి అవుతోంది. ఒకసారి Online మజాను ఆస్వాదించాక ఇళ్ళలోని పెద్దలు కూడా వారు బుర్రకు పదునుపెట్టి నాలుగు విషయాలూ నేర్చుకుంటున్నారు.

 

ఇదంతా ఒక ఎత్తయితే, విద్యార్థులున్న ఇళ్ళలోని వ్యవహారం మరొక ఎత్తు. ఇటీవలి కాలంలో టీనేజికి చేరుకున్న విద్యార్థులంతా వారి వసతినిబట్టి స్వంత కంప్యూటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే పరిసరాల ప్రభావానికి గురైన కొందరు విద్యార్థులు తెలిసీతెలియక పక్కదారి పడుతున్నాయి. సైబర్ పోర్నోగ్రఫీ బారిన పడటం లేదా ఉచిత సాఫ్ట్వేర్లు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియలో అనూహ్యంగా వైరస్లను కూడా దిగుమతి చేసుకుని వాటిని తమకు తెలియకుండానే నెట్వర్క్ ద్వారా ఇతరులకూ చేరవేయడం, Online Fraud వంటి అవాంఛనీయ పరిణామాలకు వారు గురవుతున్నారు. వీటన్నిటి గురించి పత్రికలు, టీవీల ద్వారా పుంఖాను పుంఖాలుగా వస్తున్న వార్తాకథనాల ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుంటూనే ఉన్నారు.

 

ఇక వీటికి అడ్డుకట్ట వేసే నిమిత్తం అవసరమైన Filtering, Monitoring, Time Limiting, ISP softwares, Browser Softwares గురించి తెలుసుకుని వాటి సాయంతో పిల్లలు అవాంఛనీయ పరిస్థితులకు గురికాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక పెద్దలూ... కంప్యూటర్ల వాడకంపై ఇక పారాహుషార్.