"ఆరోగ్యశ్రీ" ఆసుపత్రుల ఎంపికకు ఆన్‌లైన్ ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్‌లోని సామాన్య ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలందించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక పథకం ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’. ఈ పథకానికి సంబంధించి రోగులకు వైద్యసేవలు అందించే ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా లబ్ధిదారులకు అందించే వైద్య సేవల నాణ్యతపై నిరంతరం దృష్టిసారించేందుకుగాను ముఖ్య వైద్యాధికారి ఉంటారు. ఆసుపత్రుల ఎంపికకు సంబంధించిన జాబితా రూపకల్పన మరియు క్రమశిక్షణా కమిటీ (Empanelment and Disciplinary Committee - EDC)కి ముఖ్య వైద్య గణకాధికారి (Chief Medical Auditor) నేతృత్వం వహిస్తారు. ఆసుపత్రుల్లో తగిన మేరకు మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, సామగ్రి తగినంతగా ఉండేలా చూసే బాధ్యతను EDC వహిస్తుంది. ఈ ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆసుపత్రుల ఎంపిక ప్రక్రియను సులభతరం చేసి, వేగిరపరిచేందుకు గాను ముఖ్యమంత్రి రోశయ్య ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మౌలిక వసతులు లేని ఆసుపత్రులకు సంబంధించిన దరఖాస్తుల్ని తిరస్కరించాలన్న ప్రతిపాదనపై ఈ సమావేశంలో ఆమోదముద్ర పడింది.
ఆన్‌లైన్ ఎంపిక ప్రక్రియ తీరుతెన్నుల్ని పరిశీలిస్తే... ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించిన ఆసుపత్రుల జాబితాకెక్కాలని ఆశించే ఏ ఆసుపత్రి అయినా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం సదరు ఆసుపత్రిలో కనీసం 50 పడకలైనా ఉండాలి. ఇలాంటి కనీస వసతులు లేని ఆసుపత్రుల దరఖాస్తుల్ని పరిశీలన సమయంలోనే పక్కనపెట్టేస్తారు. ఆసుపత్రికి సంబంధించిన ఫోటోల్ని ఆన్‌లైన్‌లోనే దరఖాస్తుతోపాటు upload చెయ్యాలి, లేనిపక్షంలో ఈ దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు. అవసరమైన పత్రాలు, ఫోటోలన్నిటీనీ ఆన్‌లైన్‌లోనే సమర్పించిన అనంతరం ఈ దరఖాస్తును నమోదు చేస్తారు. తర్వాత సీనియర్ అధికార్లు, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నిపుణులు, బీమా సంస్థ ప్రతినిధుల పర్యవేక్షక బృందం ఆసుపత్రిని నేరుగా పరిశీలించి EDCకి నివేదిక ఇస్తుంది. ఈ నివేదికననుసరించి సదరు ఆసుపత్రి వర్గాలు అంతకుముందు ఆన్‌లైన్‌లో సమర్పించిన పత్రాలు, ఫోటోలు తదితరాల్ని EDC సమీక్షిస్తుంది. అక్కడి మౌలిక వసతులు, సేవలు సక్రమమేనని ధృవీకరించుకున్న తర్వాత ఆయా ఆసుపత్రుల్ని ‘ఆరోగ్యశ్రీ’ జాబితాలో చేర్చోందుకు సిఫారసు చేస్తారు.
ఆరోగ్యశ్రీ పథకం కోసం ఎంపికయ్యేందుకు గాను దరఖాస్తు చేసుకున్న ఆసుపత్రులకు పర్యవేక్షక బృందం వెళ్ళినప్పుడు, అక్కడ ఏవైనా లోపాలు, సమస్యలను ఈ బృందం గుర్తిస్తే, వాటిని పరిష్కరించి అరోగ్యశ్రీ నిబంధనలకు అనుగుణంగా మెరుగుపరిచే అవకాశమున్నప్పుడు ఆ దిశగా పనులు పూర్తి చేసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారి పునఃపరిశీలనకు దరఖాస్తు చేసుకోవాలని ఆ ఆసుపత్రులకు సూచిస్తారు.
లోపాలు, సమస్యల దిద్దుబాటు పూర్తయి... ‘ఆరోగ్యశ్రీ’ ఆసుపత్రుల్ని ఎంపికచేసిన తర్వాత బీమా సంస్థ అక్కడ ‘ఆరోగ్యమిత్ర’ల నియామకం, కియోస్క్‌ల కేటాయింపు పనుల్ని చేపడుతుంది. ఈ ఆసుపత్రుల్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సమన్వయకర్త, ఆరోగ్యశ్రీ వైద్య శిబిర సమన్వయకర్త, బిల్లింగ్ ఎగ్జిక్యూటివ్‌లకు ఈ పథకం, దీనితో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ ప్రక్రియలు, మార్గదర్శక సూత్రాలు, ప్యాకేజీలు, బాధ్యతలను పూర్తిగా వివరించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లోని ఆసుపత్రులకు యాక్సెస్ కోడ్‌లు కేటాయిస్తారు. ఈ పథకాన్ని అమలు చెయ్యడానికి కావలసిన పుస్తకాలు, సామగ్రిని అందజేస్తారు. దీంతో ‘ఆరోగ్యశ్రీ’ పథకం కింద ఈ నెట్‌వర్క్‌లోని ఆసుపత్రుల్లో రోగుల్ని నమోదు చేసుకోవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల్ని EDC ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పరిశీలిస్తూ రోగులు సత్వర చికిత్స పొందేలా తగిన చర్యల్ని సూచిస్తుంటుంది.