ప్రాంతీయభాషల కంప్యూటింగ్ వ్యావహారిక భాషలో ఉండాలి నల్లమోతు శ్రీధర్

 

నల్లమోతు శ్రీధర్ కంప్యూటర్ ఎరా మేగజైన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. తెలుగులోనే కంప్యూటర్ సంబంధిత సాహిత్యం మొట్టమొదటిసారిగా ప్రారంభించే అవకాశం 1996లో వీరికి దక్కింది. అప్పటి నుండి పలు కంప్యూటర్ పత్రికలు నిర్వహిస్తూ వచ్చారు. 2001 నుండి కంప్యూటర్ ఎరా మేగజైన్ రూపకల్పన చేస్తున్నారు. DOS మొదలుకుని Windows 3.1, 95, 98.. ఇప్పటి Windows 7 వరకూ దాదాపు ప్రతీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసి వాటిలోని మెళకువలను అధ్యయనం చేస్తూ పాఠకులకు అందిస్తూ వస్తున్నారు.

 

 

 

  

1.     1 . ప్రాంతీయ భాషల మాధ్యమంతో కంప్యూటర్లను ఉపయోగించుకునే (Regional Language computing) విషయంలో ప్రస్తుతం మనం ఏ స్థాయిలో ఉన్నాం?

ప్రస్తుతం పూర్తిస్థాయిలో తెలుగులో కంప్యూటర్ల వాడకం అంటూ జరగడం లేదనే చెప్పాలి. ఉదా.కు.. Windows XP కోసం తెలుగు Interface pack ప్రత్యేకంగా లభిస్తున్నప్పటికీ అదొకటి అందుబాటులో ఉందనీ, దాని ద్వారా ప్రయోజనం పొందవచ్చని తెలిసిన వారు పరిమిత సంఖ్యలోనే ఉన్నారు.

 

2.     2.  ఆంగ్లభాషను మినహాయిస్తే ఇతర భాషల మాధ్యమంతో కంప్యూటర్లను ఉపయోగించుకోవడంలో ఏమైనా పరిమితులున్నాయా? ఉంటే వాటిని ఎలా అధిగమించవచ్చు?

ప్రాంతీయ భాషల్లో Language Interface packలు రూపొందించడం వల్ల చాలావరకూ ప్రాంతీయ భాషలకు, ఆయా భాషలు మాట్లాడే ప్రజలకు చేరువ కావచ్చు. అయితే ప్రధానమైన సమస్య ఏమిటంటే.. ఇలాంటి Interface packల రూపకల్పనకు వాడబడుతున్న భాష చాలా సందర్భాల్లో గ్రాంధిక భాష వాడబడుతోంది. గత నాలుగైదు దశాబ్ధాలుగా వ్యావహారిక భాష కొత్త పుంతలు తొక్కడంతో, బాగా ప్రాచుర్యంలోకి రావడంతో గ్రాంధిక భాష అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం ఎవరికీ ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో భాషపై ఎక్కువ మమకారం ఉన్న నిపుణుల సహకారంతో Interfaceల రూపకల్పనకు గ్రాంధిక పదాలను ఎంపిక చేయడం వల్ల సామాన్యప్రజలకు జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువ జరుగుతోంది. ఈ తెలుగు పదాలు అర్థం చేసుకునే కన్నా ఇంగ్లీషులో ఉన్న సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులనే వాడితే ఉత్తమం అని వెనక్కి తగ్గేవారే ఎక్కువ. ప్రాంతీయ భాషలకు తెలుగు వంటి Language Interface packలు రూపొందించే ముందు ఈ ఒక్క అంశాన్ని పరిగణనలోకి తీసుకోకపోతే, సాంకేతిక వనరుల్ని ఎంతగా సామాన్య ప్రజలకు చేరువచేద్దామని ప్రయత్నించినా వృధా ప్రయాసే అవుతుంది.

 

3.       3.ప్రాంతీయ భాషలతో మొబైల్ ఫోన్ల వినియోగంలో ఎలాంటి పరిస్థితి ఉంది ?

వివిధ మొబైల్ ఫోన్లలో వాడబడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఎంతవరకూ యూనీకోడ్‌ని సపోర్ట్ చేస్తాయన్న దానిపై ప్రాంతీయ భాషల వాడకం ఆధారపడి ఉంటుంది. Microsoft Windows Mobile 6.5 వెర్షన్‌నే తీసుకుంటే ఇందులో యూనీకోడ్ సపోర్ట్ ఉన్నప్పటికీ అంతర్గతంగా ఉన్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మొబైల్ బ్రౌజర్ యూనీకోడ్ అక్షరాలను సక్రమంగా రెండర్ చెయ్యలేకపోతోంది. అదే Windows Mobile 6.5 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్ లో స్కైస్పేప్ వంటి ఇతర బ్రౌజర్లు ప్రాంతీయ భాషా అక్షరాలను సక్రమంగా చూపించగలుగుతున్నాయి. అలాగే పాకెట్ ఔట్‌లుక్ ద్వారా ప్రాంతీయ భాషల మెయిల్స్ కూడా సక్రమంగా అక్షరరూపం సంతరించుకోవట్లేదు. ఇటువంటి పరిమితులు, లోపాలు సరిదిద్దబడితే తప్పకుండా మొబైల్ ఫోన్లలో ప్రాంతీయ భాషల వినియోగం పెరుగుతుంది.

 

4.       4.ప్రాంతీయ భాషల ద్వారా మొబైల్ కార్యకలాపాలు లేదా కంప్యూటింగ్ ప్రక్రియలు విస్తృతంగా వినియోగంలోకి రావాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

ముందుగా ఏ వర్గపు వాడకందారుల కోసం ప్రాంతీయ భాషల్లో టెక్నాలజీని రూపొందించదలుచుకున్నదీ నిర్ణయించుకోవాలి. ఇక్కడ ఒక్క చిన్న విషయం చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామస్థాయిలోకి వెళ్లినా టెక్నాలజీ అనే పదాన్ని అర్థం చేసుకునే వారే ఎక్కువగా ఉంటారు కానీ సాంకేతిక పరిజ్ఞానం అనే పదాన్ని వాడితే బుర్ర చిట్లించే వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి జనాల యొక్క వ్యావహారిక భాషని అధ్యయనం చేసి వారికి అర్థమయ్యే భాషలో అది పూర్తిగా తెలుగైనా, ఇంగ్లీషు పదాలను తెలుగు పదాలుగా రాసి తెలుగింగ్లీషుగా రాసినా వాడడం వల్ల మొబైల్, కంప్యూటింగ్ ప్రక్రియలను జనబాహుళ్యానికి చేరువ చెయ్యవచ్చు.

 

5.      5. కంప్యూటర్ ఎరా ద్వారా ఇందుకు సంబంధించిన అవగాహన కల్పించే ప్రయత్నాలు ఏమైనా..

కంప్యూటర్ ఎరా టెక్నాలజీని సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా తెలియజెప్పడానికి గత పదేళ్ల కాలంలో ఎంతో శ్రమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ గ్రామం, పట్టణంలో ఉన్న సగటు కంప్యూటర్ వినియోగదారుని అభిప్రాయాన్ని తెలుసుకుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. Microsoft లాంటి సంస్థలు తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో, అదీ ప్రజలు సులభంగా గ్రహించగలిగిన పదాలతో తమ ఉత్పత్తులను తీర్చిదిద్దగలిగితే వాటిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కంప్యూటర్ ఎరా తప్పకుండా తన వంతు చేయూతను అందిస్తుంది.

 

6.     6.  మీ దృష్టిలో ప్రాంతీయ భాషల కంప్యూటింగ్ ఏ ఏ వర్గాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది ?

ఇంగ్లీషుపై పెద్దగా అవగాహన లేని పూర్తి గ్రామీణ ప్రాంతాల వారికీ, అలాగే నిరక్షరాస్యులకూ ప్రాంతీయ భాషల్లో కంప్యూటింగ్ దోహదపడుతుంది. వీలైనంత సరళంగా ప్రాంతీయ భాషల కంప్యూటింగ్ ఉంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

 

7.       7.తెలుగుభాషలో కంప్యూటింగ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లాలంటే ఏ ఏ వర్గాల తోడ్పాటు అవసరమవుతుంది ? ఇదెలా జరగాలి ?

అన్నింటికన్నా ముఖ్యంగా సామాన్య జనాభా నుండి వారి అవసరాలను వివిధ మార్గాల ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది. అవసరాలూ ప్రజలవే, కంప్యూటింగ్‌ని చేరువ చేయవలసిందీ ప్రజలకే. కాబట్టి నిపుణుల అభిప్రాయాల కన్నా ప్రజల అభిప్రాయాలకు పెద్దపీట వేయాలి. వివిధ ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించడం ద్వారా అక్కడి ప్రజలతో నేరుగా సంభాషించి వారి సూచనలు తీసుకోవాలి. ఆ తర్వాత నిపుణులు, సాంకేతిక మేధావుల సహకారంతో ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్లాలి. దీనికిగాను స్వచ్ఛంధంగా ఓ పటిష్ట యంత్రాంగం అవసరం ఉంటుంది. ఇటువంటి ఏ ప్రయత్నానికైనా కంప్యూటర్ ఎరా ఎల్లప్పుడూ ముందుంటుంది.

 

8.      8. కంప్యూటర్ ఎరా నిర్వహించిన టెక్నికల్ ఫోరమ్ గురించి..

టెక్నికల్ గా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ విజ్ఞానవంతమైన అందరూ విజ్ఞానవంతమైన సమాజాన్ని నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో జనవరి 1, 2007 నుండి 2009 ఆగస్ట్ వరకూ కంప్యూటర్ ఎరా http://computerera.co.in/ అనే సైట్ లో ఓ సాంకేతిక ఫోరమ్‌ని, ఛాట్ రూమ్‌ని నిర్వహించడం జరిగింది. ఆ ఒకటిన్నర ఏడాది కాలంలో 11,500 మందికి పైగా సభ్యులతో దాదాపు అన్నీ తెలుగులోనే పోస్టులతో, వందలాది సందేహాలు, Microsoft Windows, ఇతర ఉత్పత్తుల గురించి చిట్కాలు, సమస్యలకు పరిష్కారాలతో ఈ ఫోరమ్‌ని నిర్వహించడం జరిగింది.