వాహనాల డేటాబేస్‌తో అక్రమాలకు చెక్
(Online database of vehicles and licences)
దేశవ్యావ్తంగా ప్రభుత్వ రవాణా కార్యాలయాలలో (RTO) నమోదయి ఉన్న మొత్తం వాహనాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తుల వివరాలతో ఆన్‌లైన్ డేటాబేస్ ఒకటి నెలకొల్పాలని భారత ప్రభుత్వం సంకల్పించింది. కోట్ల రూపాయల ఋణాలిచ్చే బ్యాంక్‌లు, వాహన బీమా సదుపాయం కల్పించే కంపెనీలకు, నేరగాళ్ళను పట్టుకునే క్రమంలో ప్రత్యేకించి పోలీస్ శాఖకు ఈ డేటాబేస్ అత్యంత ఉపయోగపడుతుంది. సమగ్ర కార్యాచరణతో ఒక వేదికను ఇందుకోసం సిద్ధం చెయ్యాలని రహదార్లు మరియు రవాణా మంత్రిత్వ శాఖ ఆలోచన చేసింది. ప్రభుత్వ అనుమతి కలిగిన సంస్థలు, ఈ ఆన్‌లైన్ డేటాబేస్‌కు SMSలు పంపి ఆయా వాహనాలు, డ్రైవర్, లైసెన్స్‌దారుల వివరాలను సరిపోల్చుకోవచ్చు. ఇలాంటి ఒక సౌకర్యం వల్ల తమకెంతో చేయూత లభిస్తుందని పోలీస్ శాఖ ఉన్నతాధికార్లు అంటున్నారు. "దొంగతనానికి గురైన వాహనాల వివరాలు తెలుసుకోవడం, ట్రాఫిక్ నేరాలకు పాల్పడిన దోషుల్ని గుర్తించడం సులభమవుతుందన్నారు.
నేరాలకు పాల్పడిన డ్రైవర్లకు విధించిన జరిమానాల నుంచి తప్పించుకోవడంకోసం వారు ఫోర్జరీ చేసిన పత్రాలను సమర్పిస్తున్నట్లు గుర్తించిన రవాణా మంత్రిత్వ శాఖ, ఇలాంటి మోసపూరిత చర్యలకు అడ్డుకట్ట వేయడానికిగాను చాలారోజుల క్రిందటే ఈ ప్రాజెక్ట్ ప్రారంభించింది. నేరస్తులు ఉపయోగించే వాహనాల వివరాలు కావలసిన విధంగా అందుబాటులో లేనందున ఆ వాహనాలను గుర్తించడం ఇబ్బందిగా మారుతున్నదని పోలీస్ విభాగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలవారీగా రిజిస్టర్‌లను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఉన్న మోటారు వాహనాల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశారు.
బ్యాంకుల విషయానికి వస్తే తమ వద్దకు తనఖా కోసం వచ్చే వాహనాల వివరాలను సరిచూసుకోవడానికి ఈ ఆన్‌లైన్ డేటాబేస్‌ను వినియోగించుకోవచ్చు. ఏ వాహనానికైనా రోడ్దు సుంకం చెల్లింపు వివరాల పరిశీలన, అత్యధిక బరువు గల సరుకుతో వెళ్ళే వాహనాలకు ఓవర్ లోడ్ (నిబంధనల్ని ఉల్లంఘించి ఎక్కవ బరువు తీసుకెళ్ళడం) జరిమానా విధింపు తదితర కార్యకలాపాల్లో అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులకు ఈ డేటాబేస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
దేశంలోని ఏ ప్రాంతం నుంచయినా వాహనాల వివరాలను పొందడానికి వీలుకలిగించేలా ఈ వివరాలన్నిటితో కూడిన జాతీయస్థాయి రిజిస్టర్ల ఏర్పాటుకు ఒక ఏడాది కాలం పట్టవచ్చని ప్రభుత్వ నివేదిక పేర్కొంది. డేటాబ్యాంక్ నుంచి సమాచారం కావలసిన వారు రవాణాశాఖ వెబ్‌సైట్‌ను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న ఆన్‌లైన్ పత్రాలను పూరించి ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చెయ్యడం ద్వారా తగు సేవలు పొందగలుగుతారు. లెర్నర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దాఖలుచేసే దరఖాస్తు పత్రం మొదలుకొని పర్మిట్ సుంకం, రోడ్ టాక్స్ తదితరాలను ఆన్‌లైన్‌లోనే పేమెంట్ గేట్ వే ద్వారా చెల్లించడానికి కావలసిన అన్నిరకాల పత్రాలూ, వివిధ రకాల సేవలు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ రూపొందించిన www.aptransport.org వెబ్‌సైట్‌ను వీక్షించండి. లెర్నర్స్‌కు పెట్టే పరీక్షల నమూనా ప్రశ్నాపత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ కోసం రవాణా శాఖ నిర్వహించే డ్రైవింగ్ పరీక్షకు హాజరయ్యేందుకు డ్రైవింగ్ ట్రాక్ స్లాట్ బుకింగ్ లాంటి పలు సేవల్ని అందుబాటులో ఉంచారు.
ఇక జాతీయస్థాయి వాహన వివరాల డేటాబేస్ విషయానికి వస్తే దేశంలోని అన్ని రాష్ట్రాలకూ దీనితో అనుసంధానం ఉంటుంది. రాష్ట్రాల స్థాయిలో ఇప్పటికే చాలావరకూ రిజిస్టర్ల ఏర్పాటు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాలలో RTOల మధ్య అనుసంధానం నెలకొంది. మరోవైపు ఈ కార్యాలయాల పూర్తిస్థాయి కంప్యూటరీకరణకు రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వశాఖ తోడ్పాటును ఇస్తున్నది.