ఉద్యోగుల కలల సంస్థగా Microsoft

 

              నాణ్యమైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల రూపకల్పనతో ప్రపంచ ఐటీ రంగంలో దిగ్గజంగా వెలుగొందుతున్న Microsoft సంస్థ తన ఖాతాదారుల పట్ల ఎంత బాధ్యతగా సేవల్ని కొనసాగిస్తుందో అదే విధానాన్ని తన ఉద్యోగుల విషయంలోనూ అవలంబిస్తూ "ఉద్యోగుల కలల సంస్థ"గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఉద్యోగులకు మంచి పనివాతావరణాన్ని కల్పిస్తున్న అత్యుత్తమ బహుళజాతి సంస్థగా "Great Place to Work" ఇనిస్టిట్యూట్ జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఉద్యోగులకు పనిచేయడానికి అనువైన తొలి 25 సంస్థలలో మొదట నిలిచింది Microsoft Corporation కావడం గమనార్హం.

 

ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకుని విశ్వసనీయతను సంపాదించుకోవడం ద్వారా ఈ సంస్థలు "ఉద్యోగ మిత్ర" సంస్థలుగా నిలిచాయని "Great Place to Work" నివేదిక వెల్లడించింది. ఈ జాబితా రూపకల్పన కోసం ప్రపంచవ్యాప్తంగా కనీసం 5 వేలమంది ఉద్యోగులను కలిగి ఉండి, వారిలో కనీసం 40శాతం మంది దేశం వెలుపల ఉన్న కంపెనీలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఈ సంస్థ తెలిపింది. సర్వే కోసం దేశవిదేశాల్లోని సుమారు 25 లక్షల మంది ఉద్యోగులను ఎంచుకున్నారు.

 

ఇటీవల ఏర్పాటు చేసిన పురస్కార ప్రదానోత్సవంలో Microsoft Corporation నుంచి ఈ సంస్థలో Chief People Officerగా సేవలందిస్తున్న Lisa Brummel స్వయంగా "World’s Best Workplace" పురస్కారాన్ని అందుకున్నారు. గత 20 ఏళ్ళకు పైగా Microsoft కుటుంబంలో ఉన్న Lisa తన అనుభవాల్ని బ్లాగ్ ద్వారా పంచుకున్నారు. ఉద్యోగుల ఎదుగుదల క్రమంలో ప్రతి ఒక్కరికీ, ప్రతి రోజూ సరికొత్త అవకాశాలను కల్పించడం ఈ సంస్థ ప్రత్యేకత అనీ, జయాపజయాల మధ్య తన ఉద్యోగ జీవితం విభిన్న కోణాల్ని స్పృశించిందని ఆమె పేర్కొన్నారు.

 

సాఫ్ట్‌వేర్ రంగంలో Windowsతో సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించిన Microsoft సంస్థ పదేళ్ళ కిందట PC గేమ్స్ వ్యాపారంలో మాత్రమే ఉండేదని, తర్వాత ప్రతిభావంతులకు అవకాశమిచ్చిన ఫలితంగా Xbox ఆవిష్కరణ వినోద రంగంలో ఒక సంచలనంగా నిలిచిందని, తాజాగా దీనికి Kinect తోడు కావడంతో సరికొత్త విప్లవం అవిష్కృతమైందని ఇటీవలి పరిణామాలను ఆమె నెమరు వేసుకున్నారు.

Read More on...