Microsoft ITLA 2009–10 విజేతలు...
బోధన మరియు అధ్యయన ప్రక్రియల్లో భాగంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని (IT) ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి వారిని గౌరవించి ప్రోత్సహించే సదుద్దేశ్యంతో Microsoft సంస్థ 2004లో Innovative Teachers Leadership పురస్కారాల్ని (ITLA) ప్రవేశపెట్టింది. ఏటా ప్రదానం చేసే ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ రావడం దీనికున్న ప్రాధాన్యతను వెల్లడిస్తోంది. తాజాగా Innovative Teachers Leadership Awards 2009 - 2010 ఫలితాన్ని Microsoft ప్రకటించింది.
ఈ పురస్కారాలకు సంబంధించిన మరో ముఖ్యాంశం ఏమిటంటే... వీటిని అందుకున్న జాతీయ విజేతలకు కాలక్రమంలో పలు అంతర్జాతీయ వేదికలపై తమ ఉత్తమ అనుభవాల్ని పంచుకునే అవకాశం లభించడంతోపాటు వివిధ దేశాల ఉపాధ్యాయుల నుంచి వినూత్న అంశాల్ని నేర్చుకునే అవకాశమూ దక్కుతోంది. గడచిన 5 సంవత్సరాల కాలంలో భారతదేశంలో Innovative Teachers Leadership పురస్కారాల్ని దక్కించుకున్న ఉపాధ్యాయులు సింగపూర్, దక్షిణ కొరియా, వియత్నాం, కంబోడియా, హాంగ్ కాంగ్, యుఎస్ఎ, ఫిన్లాండ్, బ్రెజిల్ తదితర దేశాల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి మనకు గర్వకారణంగా నిలిచారు.
ఇక ఈ ఏడాది (2009-2010) విషయానికి వస్తే ఎప్పటిలాగే దేశవ్యాప్తంగా వివిధ గ్రామాలు, పట్టణాలు, నగరానికి చెందిన ఎందరో ఉపాధ్యాయులు జాతీయ లేదా ప్రాంతీయ విజేతలుగా నిలిచేందుకుగాను ఉత్సాహంగా ఈ పోటీలకు దరఖాస్తు చేసుకున్నారు. మన దేశానికి చెందిన Microsoft ITLA జాతీయ విజేతల్లో 5 నుంచి 10 మంది ఈసారి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నగరాన్ని సందర్శించి మరో 60 దేశాలకు చెందిన ఉపాధ్యాయులతో పాటు అంతర్జాతీయ గౌరవాన్ని స్వీకరించే సదవకాశాన్ని స్వంతం చేసుకుంటారు.
Microsoft ITLA 2009-2010 విజేతల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు జాతీయ విజేతగా మరొకరు ప్రాంతీయ విజేతగా ఎంపికయ్యారు. వీరిలో విజయనగరం జిల్లా, ఎస్ కోట మండలం, బౌదర గ్రామంలోని జెఎన్‌వి కిలాటపాలెం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు రాఘవేంద్రరావు సమర్పించిన Redefining Classrooms అనే ప్రాజెక్ట్‌కు జాతీయ పురస్కారం దక్కడంతో ఆయన జాతీయ విజేతగా నిలిచారు. అదే విధంగా కరీంనగర్ జిల్లా కతలాపూర్ మండలం తక్కలపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మార్గం రాజేంద్రప్రసాద్ సమర్పించిన Reflection of Lights అనే ప్రాజెక్ట్‌కు ప్రాంతీయ పురస్కారం లభించింది.
విజేతల పూర్తి వివరాలు.. ఈ పురస్కారానికి సంబంధించిన మరిన్ని వివరాలకోసం http://www.microsoft.com/india/itla/winners-projects.aspx సందర్శించండి.