Skype ఇక Microsoftలో అంతర్భాగం
ఇంటర్నెట్ కమ్యూనికేషన్ రంగంలో కోట్లాదిగా వినియోగదారుల్ని ఆకర్షించి తనకంటూ ఒక స్థానం సంపాదించుకున్న Skype Global S.à r.l సంస్థ ఇప్పటికే ఈ రంగంలో దిగ్గజంగా వెలుగొందుతున్న Microsoftలో అంతర్భాగం కావడానికి రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి Silver Lake నేతృత్వంలోని పెట్టుబడిదార్ల బృందానికి $ 8.5 బిలియన్ మొత్తం నగదు చెల్లింపు దిశగా జరిగిన నిర్దిష్ట ఒప్పందానికి Skype మరియు Microsoft సంస్థల డైరక్టర్ల బోర్డులు ఆమోదం తెలిపాయి.
ఈ పరిణామంతో అటు వినియోగదారులకు, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు రియల్ టైం వీడియోలు, వాయిస్ కమ్యూనికేషన్‌లు మరింతగా అందుబాటులోకి రావడమేగాక వీరికి సరికొత్తగా వ్యాపార మరియు ఆదాయ వృద్ధి దిశగా అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఈ రెండు సంస్థల కలయికతో Skype యొక్క ప్రపంచస్థాయి బ్రాండ్ మరియు దీని ప్లాట్‌ఫాం నెట్‌వర్క్ మరింత విస్తృతం కానుండటం ఒకటైతే, మరోపక్క Microsoft ప్రస్తుత రియల్ టైం కమ్యూనికేషన్ ఉత్పత్తులు మరియు సేవల పోర్ట్‌ఫోలియో పరిధి ఇంకా విస్తరించనుంది.
Skypeకు సంబంధించి చూస్తే, సుమారు 170 మిలియన్ల మంది అనుసంధిత యూజర్లు ఉండటం ఒక ఎత్తు కాగా, 2010వ సంవత్సరంలో 207 బిలియన్ నిమిషాలకు పైగా వాయిస్ మరియు వీడియో సంభాషణలతో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు, కుటుంబాలు, వ్యాపార వర్గాల మధ్య ఒక అర్థవంతమైన సంబంధాల్ని సమృద్ధిగా నెలకొల్పి సమున్నత స్థానంలో నిలబడటం మరో అంశం. ఇంకో వైపు Microsoft కూడా తనకున్న Lync (3వ త్రైమాసికంలో 30 శాతం ఆదాయవృద్ధిని సాధించింది), Outlook, Messenger, Hotmail మరియు Xbox LIVE వంటి వివిధ రకాల ప్లాట్‌ఫాంల వెంబడి రియల్ టైం కమ్యూనికేషన్ల పట్ల దీర్ఘకాల దృష్టికోణం మరియు పెట్టుబడులతో ముందుకు సాగుతున్నది.
Microsoft ఉత్పత్తులైన Xbox మరియు Kinect, Windows Phone తదితర Windows శ్రేణి పరికరాలకు Skype తోడ్పాటు ఉంటుంది. అలాగే, Microsoft కూడా Skype యుజర్లను Lync, Outlook, Xbox Live మరియు ఇతర కమ్యూనిటీలతో అనుసంధానిస్తుంది. ఈ క్రమంలో Microsoftకు చెందని ప్లాట్‌ఫాంలపై కూడా Skype క్లయింట్లకు మద్దతు, పెట్టుబడులతో తోడ్పాటును కొనసాగిస్తుంది.
Microsoft సంస్థ CEO స్టీవ్ బామర్ స్పందిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజల ఆదరాభిమానాన్ని అందుకున్న విశిష్ఠ సేవకు మారుపేరుగా Skype నిలిచిందన్నారు. ఈ రెండు సంస్థలూ భవిష్యత్తులో రియల్ టైం కమ్యూనికేషన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. భూమి నలు చెరగులా ఉండే తమ మిత్రులు, కుటుంబాలు, క్లయింట్లు, సహచరులతో ప్రజలను అత్యంత సులువుగా కలిపి ఉంచేలా సేవలందిస్తాయని పేర్కొన్నారు.
తాజా పరిణామంలో భాగంగా Skype ఇక Microsoftలో ఒక నూతన వ్యాపార విభాగంగా ఉంటుంది. Skype సంస్థ CEO టోనీ బేట్స్ Microsoft Skype విభాగం ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా బేట్స్ స్పందిస్తూ ఖాతాదారులకు వైవిధ్యభరితమైన సాఫ్ట్‌వేర్లు మరియు ఉత్పత్తులను అందించేందుకు గాను ఒక ఉమ్మడి దృక్కోణంతో Skype మరియు Microsoft సంస్థలు ముందుకు సాగుతాయన్నారు. అంతర్జాతీయంగా విస్తరణ మరియు సంప్రదింపులు, సమన్వయం కోసం ప్రతి ఒక్కరికీ సరికొత్త మార్గాల్ని అందించాలన్న Skype ప్రణాళికలను తామిరువురం కలిసి సాధించగలమన్నారు.
టోనీ బేట్స్‌కు అత్యుత్తమ నాయకత్వ లక్షణాలున్నాయని ప్రశంసించిన స్టీవ్ బామర్, ఆయన చేరికతో Microsoft యాజమాన్యం మరింత పటిష్ఠమవుతుందని, అంతర్జాతీయంగా ఉన్న Skype నిపుణుల బృందం తమ సాంకేతిక పరిజ్ఞానం, ఆలోచనలు, అనుభవంతో Microsoftను మరింత ముందుకు నడిపించగలరని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Silver Lake మేనేజింగ్ డైరక్టర్ ఎగాన్ డర్బన్ మాట్లాడుతూ Skype యాజమాన్య బృందం, ఉద్యోగుల అంకితభావాన్ని కొనియాడారు. తమ హయాంలో Skype సాధించిన విజయాల పట్ల ఆనందంగా ఉందన్నారు. ఇక నుంచీ Microsoftలో భాగమై ఒక సమగ్ర క్రియాశీల కమ్యూనికేషన్ ప్లాట్‌ఫాంగా Skype ఉజ్వల భవిష్యత్తును పొందగలదని ఆకాంక్షించారు.
2003లో ప్రారంభమైన Skype సంస్థ సెప్టెంబర్ 2005లో eBay స్వంతమయ్యింది. తర్వాత నవంబర్ 2009లో Silver Lake యాజమాన్యంలోకి వెళ్ళింది. గత 18 నెలల కాలంలో నెలవారీ కాలింగ్ మినిట్స్‌ను 150 శాతం మేర పెంచుకుని ఆదాయ మార్గాల్ని పెంపొందించుకోవడంతో పాటుగా వ్యూహాత్మక భాగస్వామ్యాలను నెలకొల్పుకుంది. తన peer-to-peer నెట్‌వర్క్‌ను మరింత శక్తిమంతం చేసుకునే క్రమంలో ప్రతిభగల సీనియర్ మేనేజిమెంట్‌ని నియమించుకుని మేధోసంపత్తిని ఇనుమడింపజేసుకుంది.