Microsoft మరియు GE సరికొత్త జాయింట్ వెంచర్ Caradigm
(GE, Microsoft Share Plans for New Joint Venture, Caradigm)
హెల్త్ ఐటీ రంగంలో సరికొత్త ఉత్పత్తుల ద్వారా భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకుగాను చేతులు కలిపిన Microsoft మరియు General Electric Co. (GE) సంస్థలు Caradigm పేరిట 50-50 భాగస్వామ్యంతో సరికొత్త జాయింట్ వెంచర్ సంస్థను నెలకొల్పాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో లాస్ వెగాస్లో జరిగే అతిపెద్ద హెల్త్కేర్ ఐటీ వాణిజ్య ప్రదర్శన HIMSS12లో తమ సత్తా చాటాలని నిర్ణయించాయి. కాగా, తగిన అనుమతులు లభించిన మిదట 2012 ప్రథమార్థంలోనే కొత్త కంపెనీ Caradigm ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
ఆరోగ్య పరిరక్షణ రంగంలోని సేవల పంపిణీ క్రమంలో ఒక ఉత్తమ ఉదారహణగా నిలవాలని, నాణ్యతలో, రోగుల అవసరాలపరంగా వాస్తవికతకు, వివేచనకు పెద్దపీట వేయాలన్న లక్ష్యంతో Caradigm ఏర్పాటు చేస్తున్నట్లు Microsoft మరియు GE ప్రతినిధులు పేర్కొన్నారు. కొత్త కంపెనీ ఏర్పాటు అనంతరం ఆచరణయోగ్యమైన టెక్నాలజీ ప్లాట్ఫాం, కొలాబరేటివ్ క్లినికల్ అప్లికేషన్స్పై దృష్టి సారిస్తారు. సామూహిక ఆరోగ్య పరిరక్షణ, నిర్వహణ, ఆరోగ్య పరిరక్షణలోని ఆర్థికాంశాలను పరిగణనలోకి తీసుకుంటారు.
Caradigmకు మైకేల్ సింప్సన్ సిఇఒగా వ్యవహరించనుండగా, ఈయన బృందంలో డాక్టర్ బ్రాన్డన్ సవేజ్ (చీఫ్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్), నీల్ సింగ్ (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్), మాసన్ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్) , టమీ లాంప్ (చీఫ్ పీపుల్ ఆఫీసర్), వారెన్ రాట్లిఫ్ (జనరల్ కౌన్సిల్ మరియు వైస్ ప్రెసిడెంట్) తదితరులు ముఖ్య హోదాల్లో కీలక బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ సంస్థ పాలకమండలిలో GE నుంచి జాన్ డినీన్, జాన్ డె విటె, Microsoft నుంచి కిరిల్ టాటరినొవ్, అమీ హుడ్ డైరక్టర్లుగా ఉంటారు.
కొత్త కంపెనీకి Microsoft Amalga, Microsoft Vergence, Microsoft expreSSO, GE Healthcare eHealth, GE Healthcare Qualibria, Mayo Clinic సంస్థలు మేథోపరమైన చేయూతనందిస్తాయి. ఈ సరికొత్త భాగస్వామ్యం ఆరోగ్య పరిరక్షణ రంగంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువస్తుందని పేర్కొన్నారు.
లాస్ వెగాస్లో జరిగే అతిపెద్ద హెల్త్కేర్ ఐటీ వాణిజ్య ప్రదర్శన HIMSS12లో భాగంగా GE Healthcare బూత్. 2635 మరియు Microsoft బూత్ 1629 నుంచి విప్లవాత్మక ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించవచ్చు. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 21వ తేదీన Sands Expo Convention Centerలో Caradigm భవిష్య నాయకత్వం ద్వారా మీడియా మరియు నిపుణుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటైంది.