ముంబై విశ్వవిద్యాలయం: ఇ-గవర్నెన్స్‌తో పరిపూర్ణం

 

జాతి నిర్మాణంలో వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులను అందించిన ఘనతను స్వంతం చేసుకున్న 125 సంవత్సరాల ముంబై విశ్వవిద్యాలయం (ముంబై యూనివర్సిటీ) ఇప్పుడు మరో చరిత్ర సృష్టించింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని (IT) పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఇంటర్నెట్ ఆధారిత పరిపాలనా వ్యవస్థకు (ఇ-గవర్నెన్స్) శ్రీకారం చుట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 64 సంవత్సరాలు గడచిన నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన ఈ సరికొత్త అంకానికి తెరలేచింది.

 

ఈ విశ్వవిద్యాలయం ఉపకులపతి రాజన్ వేలుకార్ మార్గదర్శకత్వంలో చోటు చేసుకున్న ఈ పరిణామంలో భాగంగా నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య బోధన, అధ్యయన ప్రక్రియల్లో భాగంగా కంప్యూటర్లు, సంబంధిత సామగ్రి వాడకంలో అంతరాన్ని తగ్గించే ప్రయత్నం జరుగుతుందని అధికార్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చే విద్యా సంస్థలు, విద్యార్థులకు ఏ సమయంలోనైనా, ఎక్కడున్నా ఇంటర్నెట్ మరియు ఇంట్రానెట్ వ్యవస్థల తోడ్పాటుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన పాఠ్యాంశాలను అందజేయడమే ఇ-గవర్నెన్స్ ప్రధాన లక్ష్యం.

 

ముంబై విశ్వవిద్యాలయం విస్తృత ఇంటరాక్టివ్ నెట్‌వర్క్ పరిధిలో వివిధ ప్రాంతాలలోని సుమారు 670కి పైగా అనుబంధ కళాశాలలు, గుర్తింపు పొందిన విద్యాసంస్థలు ఉండగా వీటికి సంబంధించిన పరిపాలనాపరమైన కార్యకలాపాల నిర్వహణ, సేవల కోసం ఒక ఇ-కార్యాలయాన్ని కూడా నెలకొల్పారు. ఇ-గవర్నెన్స్ అమలులో భాగంగా కొనసాగే ఇ-ఎడ్యుకేషన్ కార్యకలాపాల కోసం పలు వర్క్‌షాపులు, సదస్సులు నిర్వహించి తమ సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో శిక్షణనిప్పించామని Board of College & University Development (BCUD) సంచాలకులు డాక్టర్ రాజ్‌పాల్ హండే తెలియజేశారు. మరోపక్క పర్యావరణ పరిరక్షణ దిశగా నడుం బిగించిన ఈ విద్యాలయంలో ఇకపై కాగితం వాడకాన్ని అత్యంత పరిమితం చేయాలని నిశ్చయించారు.

 

ముంబై విశ్వవిద్యాలయంతో అనుసంధానమై ఉన్న శివారు ప్రాంత కళాశాలల విద్యార్థులకు ప్రస్తుతం ఆన్‌లైన్ కోర్సులను అందుబాటులో ఉంచారు. Department of Lifelong Learning and Extension ఏర్పాటు చేసిన ఇ-లెర్నింగ్ పోర్టల్ http://lms.Mudlle.Ac.In లేదా http://mudlle.Ac.In ద్వారా వారి వారి అవసరాలకు అనుగుణంగా అధ్యయన నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మొత్తం ఇ-గవర్నెన్స్ ప్రక్రియలో అధ్యాపకులు, విద్యార్థులు మాత్రమేగాక విద్యార్థుల తల్లిదండ్రుల్ని కూడా భాగస్వాముల్ని చేసి వ్యవహారాలు, సేవలలో వేగం, కచ్చితత్వం, సమర్థత, పారదర్శకత, విశ్వసనీయతలకు పెద్దపీట వేశారు.

 

మన దేశంలోని మిగిలిన విశ్వవిద్యాలయాలు సైతం ముంబై విశ్వవిద్యాలయం బాటలో పయనించి అత్యుత్తమ విద్యా ప్రమాణాల్ని అందుకోవాలని, దేశానికి మరిందరు ఉత్తమ పౌరుల్ని అందించాలని ఆశిద్దాం.

Read More on...