ఆపత్కాలంలో అండగా Microsoft My Phone
ప్రస్తుతం మనమున్న ఈ సమాచార యుగంలో వెబ్‌సైట్లు, మొబైల్ ఫోన్లదే కీలకపాత్ర అన్నది జగమెరిగిన సత్యం. టెక్నాలజీ పరంగా నానాటికీ చోటు చేసుకుంటున్న పురోగతి నేపథ్యంలో ప్రస్తుతం మొబైల్ ఫోన్లు దాదాపుగా కంప్యూటర్లతో సమానంగా ఇంటర్నెట్ తదితర సేవలందిస్తూ శరవేగంగా ముందుకు దూసుకుపోతున్నాయి. ఇది ఎంతదూరం వెళ్ళిందంటే... పొరపాటున ఒక్కరోజు ఇంట్లో మొబైల్ ఫోన్ మర్చిపోయి బయటకెళితే... శరీరంలోని ఒక అంగం పనిచెయ్యనంతగా బాధపడిపోతాం. ఎందుకంటే... అందులో మనం తరచుగా సంభాషించే అత్యంత ముఖ్యమైన వ్యక్తుల ఫోన్ నెంబర్లు, చిరునామాలు, మనం ఎంతో కష్టపడి సేకరించుకున్న పాటలు, వీడియోలు ఉంటాయి. ఇవేగాక, మనం ఎక్కడుంటే అక్కడి నుంచే... ఎప్పుడు కావాలంటే అప్పుడే మనకు కావలసిన వెబ్ సైట్లను మొబైల్ ఫోన్ ద్వారా బ్రౌజ్ చేసుకునే సదుపాయం కూడా వచ్చేసింది. వీటన్నిటికీ క్షణం కూడా దూరం కావడానికి మనసు అంగీకరించదు.
.
ఇక తాజా పరిణామాల గురించి చెప్పుకుంటే... మొబైల్ ఫోన్ ద్వారా పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకోవడానికి ఒక పక్కన రంగం సిద్ధమవుతోంది. అదే విధంగా మొబైల్ ద్వారా స్టాక్‌మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవిగాక, మొబైల్ ఫోన్ల నుంచి పంపే ఎస్ఎంఎస్‌లతో బోలెడు పనులు పూర్తి చేసుకోవచ్చు. అంటే.. అరచేతిలోని మొబైల్ ఫోన్ ద్వారా అనంతకోటి పనులు చకచకా పూర్తి చేసుకోవచ్చని వేరే చెప్పాల్సిన పనిలేదు.
మరి ఉన్నట్టుండి ఒక రోజున మన మొబైల్ ఫోన్ కనిపించకుండా పోతే...! లేదా పనిచెయ్యక పోతే...!
అమ్మో.. ఇంకేమైనా ఉందా... ఈ ఆలోచనలు భరించలేనివిగా ఉన్నాయి కదూ. ఏదేమైనా అన్ని రోజులూ మనవి కాదన్న సంగతి అందరికీ తెలుసు. మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ? పరిష్కారం ఏమిటి ? అనేకదా మీ సందేహాలు. అవును అందుకే Microsoft సంస్థ My Phone అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. పైన పేర్కొన్న పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకందార్లకు నిజంగా వరం లాంటిది ఈ My Phone.
అవును. My Phone మీకు ఎలా సహాయపడుతుందంటే, ఇది మీ ఫోన్‌ను వెబ్‌లో అనుసంధానం చేస్తుంది. తద్వారా మీరు మీ ఫోన్‌లోని సమస్త సమాచారాన్నీ ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫోన్ పనిచెయ్యకున్నా లేదా పొరపాటున సమాచారం పోయినా లేదా ఫోనే పోయినప్పటికీ కొత్తదాంట్లోకి ఈ బ్యాకప్ నుంచి సమాచారాన్ని పునరుద్ధరించుకోవచ్చు. మరో గొప్ప విషయం ఏమిటంటే... ఒకవేళ మీరు ఫోన్ పోగొట్టుకుంటే దానిని కనిపెట్టడంలో My Phone మీకు పూర్తి సహకారం అందిస్తుంది.
My Phone ద్వారా కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే... మీ ఫోన్‌లోని ఫోటోల్ని మీరు ఇష్టపడే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల వెంబడి పంపిణీ చెయ్యవచ్చు. మీ కాంటాక్ట్స్, టెక్ట్స్ సందేశాల్ని పొందడం లాంటి పలు ఆన్‌లైన్ కార్యకలాపాల్ని My Phone ఉచితంగా నిర్వహించుకోవచ్చు. My Phone వెబ్ సైట్ ద్వారా మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు సింక్రనైజ్ చేసుకుని యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు. Windows Mobile 6 ఫోన్లతో My Phone పనిచేస్తుంది. కొత్త Windows ఫోన్లలో ఇది ముందే లోడ్ అయి ఉంటుంది. అలాకానిపక్షంలో http://myphone.microsoft.com/install లింక్ ద్వారా దీనిని పొందవచ్చు. My Phone గురించి మున్ముందు మరిన్ని వివరాలు తెలుసుకుందాం.