Laptopలతో అంధ విద్యార్థులకు online పరీక్షలు
సాధారణ విద్యార్థులతో పోల్చితే అంధ విద్యార్థులకు చదువు చెప్పడం, వారికి పరీక్షలు నిర్వహించడమన్నది చాలా శ్రమతో కూడుకున్నదన్న అభిప్రాయాన్ని మార్చే రోజులొచ్చాయి. అంధ విద్యార్థులు చదువుకోవడానికి బ్రెయిలీ లిపిలో పాఠ్యాంశాలను సమకూర్చేందుకు, పరీక్షల్ని సైతం బ్రెయిలీ లిపిలో రాసే అవకాశం ఉన్నప్పటికీ, విస్తృతమైన విజ్ఞాన సర్వస్వాన్ని బ్రెయిలీ లిపిలో పాఠ్యాంశాలుగా రూపొందించి కోట్లాదిమంది అంధ విద్యార్థులకు అందించడంలోను, వారి బ్రెయిలీ జవాబు పత్రాల్ని మూల్యాంకనం చెయ్యడంలోను పలు వ్యయప్రయాసలున్నాయి. సాధారణ విద్యార్థుల కోసం రూపొందిస్తున్న పాఠ్య పుస్తకాల్లోనే తప్పులు దొర్లుతున్న ప్రస్తుత తరుణంలో బ్రెయిలీ పాఠ్యాంశాల రూపకల్పన అన్నది మరింత క్లిష్టమైన వ్యవహారం. ఇక బ్రెయిలీ లిపిలో పరీక్షలు రాస్తే అలాంటి జవాబు పత్రాల్ని మూల్యాంకనం చెయ్యడానికి గాను తగినంత మంది బ్రెయిలీ స్పాట్ వాల్యుయేటర్లను సిద్ధం చేసుకోవడం కూడా అంతే సమస్యగా పరిణమిస్తోంది.
పైన పేర్కొన్న ఇబ్బందుల ఫలితంగా అంధ విద్యార్థులు వారి స్నేహితులు లేదా తల్లిదండ్రుల సాయంతో పాఠ్యాంశాలు చదివించుకుని, వాటిని క్యాసెట్లలో రికార్డ్ చేయించుకుని పదే పదే వింటూ పాఠాల్ని నేర్చుకోవడం జరుగుతూ వచ్చింది. ప్రస్తుతం క్యాసెట్ల స్థానంలో CDలు, Internetలో Audio పాఠాలు రంగప్రవేశం చేసి పరిస్థితిని కాస్త మెరుగుపరిచాయి. ఇంతవరకూ బాగానే ఉన్నా పరీక్షలు రాసే విషయంలో ఇతరుల సాయం (scribes) తప్పనిసరిగా మారింది. నేటి యువతరం పెద్ద మనసు చేసుకుని ఈ అంధ విద్యార్థుల కోసం scribes రూపంలో వారి తరఫున లేఖకులుగా పరీక్షల్లో చేయూతనిస్తున్నారు. అయితే, ఇక్కడ కూడా ఇబ్బందులున్నాయి అంధ పరీక్షార్ధులు చెప్పేజవాబుల్ని తెలిసీతెలియక గాని, పొరపాటునగానీ, అర్థం చేసుకోలేకగాని scribes తప్పుగా రాస్తే నష్టపోయేది అంధ విద్యార్థులే. అంధ విద్యార్థులు చెప్పే జవాబుల్ని అంతే వేగంతో scribes రాయగలగాలి. లేకుంటే సమయం మించిపోయి అన్ని ప్రశ్నలకూ జవాబులు చెప్పలేక మార్కుల్ని నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. పరీక్షల్లో అంధ విద్యార్థులకు, scribesకు మధ్యన పూర్తి సమన్వయం ఉంటేనే పరీక్షల్లో అంధ విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. పరీక్షలప్పుడు scribes సరైన సమయానికి రాకపోయినా, వచ్చిన తర్వాత సమయపాలన పాటించకున్నా ఇబ్బందులు తప్పవు. వీటన్నిటిని అధిగమించడానికి ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లు సిద్ధమయ్యాయి.
అంధ విద్యార్థులకు కంప్యూటర్ల ద్వారా online పరీక్షలు నిర్వహించడం కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ల సాయంతో ఇప్పటికే జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (JET) ఆధ్వర్యంలోని నేత్ర విద్యాలయం జూనియర్ కళాశాల విజయవంతంగా పరీక్షల్ని నిర్వహించింది. ఈ క్రమంలో భాగంగా Laptopల వాడకంపై అంధ విద్యార్థులకు పూర్తి స్థాయిలో శిక్షణనిచ్చారు. Laptop keyboardని ఉపయోగించి టైపింగ్ చెయ్యడం మొదలుకొని softwareలు మరియు hardward గురించి వారికి పూర్తి అవగాహన కల్పించారు. అంధులు చూడలేకపోయినప్పటికీ, సూక్ష్మగ్రాహ్యతకు పెట్టింది పేరు. ఆ సూక్ష్మగ్రాహ్యతనే వారు ఆయుధంగా చేసుకుని Laptop వాడకాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకున్నారు.
ఇక తర్వాతి అంకం పరీక్షల నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ వినియోగం. ఇక్కడ జరిగేదేమిటంటే, అంధ విద్యార్థులు ఏదైనా ఒక ప్రశ్నకు (ప్రశ్నలు వినబడతాయి) సంబంధించిన జవాబును టైప్ చేసిన తర్వాత ఆ సాఫ్ట్‌వేర్ ఆ జవాబును పదాలుగా, వాక్యాలుగా, పేరాలుగా చదివి వినిపిస్తుంది. ఇందుకు సంబంధించిన సెట్టింగులను వారే అమర్చుకోవచ్చు. అలా విన్న తమ జవాబు పట్ల వారు సంతృప్తి చెందాక, అవసరమైతే దిద్దుబాట్లు చేసుకుని OK చెయ్యవచ్చు. ప్రస్తుతానికి ఆంగ్ల మాధ్యమ విద్యార్థులకు అనుగుణంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను తీర్చిదిద్దారు. ఈ విధంగా scribes అవసరం లేకుండానే Laptopల ద్వారా విజయవంతంగా అంధ విద్యార్థులు పరీక్షల్ని పూర్తి చేస్తున్నారు. త్వరలో ఈ విధానం దేశవ్యాప్తంగా అమలు చేసే రోజులు రాబోతున్నాయి. భవిష్యత్తులో ప్రాంతీయ భాషల మాధ్యమ విద్యార్థులకూ ఈ సౌకర్యం అందుబాటులోకి రావాలని కోరుకుందాం.