భాషాభివృద్ధి వేదికలు... Online తెలుగు గుంపులు
(Online Telugu Group... A venue for language development)

 

ఒకప్పుడు సాహితీ కార్యక్రమాలు విరివిగా జరుగుతుండేవి. తీరికలేని జీవితాలు గడుపుతున్న నేటి పరిస్థితుల్లో అలాంటి కార్యక్రమాలు బాగా తగ్గిపోయాయి. చివరికి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, అంతర్జాతీయ మాతృబాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం లాంటి అధికారిక ఉత్సవాలప్పుడు తప్ప మిగతా సమయాల్లో మన భాషాభివృద్ధిపై దృష్టి సారించే పరిస్థితి కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో తెలుగు భాషాప్రియులు చాలామంది Onlineలో ఏర్పాటు చేసుకున్న పలు గుంపుల ద్వారా మన భాషాభివృద్ధిపై నిరంతర చర్చలు సాగిస్తుండటం చాలా ఆనందించదగిన పరిణామం.

 

ఈ Online తెలుగు గుంపుల్లో పాల్గొనేవారు కేవలం నడివయస్కులో లేదా కాస్త వయసుమీరినవారో అనుకుంటే పొరబాటే. పెద్ద సంఖ్యలో మన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఇందులో పాల్గొంటూ తెలుగు భాషాభివృద్ధికి తమ వంతు చేయూతనిస్తున్నారు. వివిధ సాఫ్ట్‌వేర్లను ఆయా ప్రాంతీయ భాషల్లోకి స్థానీకరించే ప్రయత్నంలో భాగంగా ఈ గుంపుల్లో చర్చల రూపంలో కొనసాగే ప్రయత్నాలు ఎంతో ఆసక్తిదాయకంగా ఉంటున్నాయి. "తెలుగుపదం", "తెలుగుతల్లి",  లాంటి గుంపులలో వందలాదిమంది తెలుగు భాషాప్రియులు సభ్యులుగా చేరి Onlineలో తెలుగు అభివృద్ధికి తమ వంతు చేయూతనిస్తున్నారు.

 

ఈ గుంపుల్లోని చర్చల తీరును ఒకసారి గమనిద్దాం...

 

మన తెలుగు లిపి, దాని పుట్టుపూర్వోత్తరాలు, వివిధ దేశాల్లో మన తెలుగులిపి ఆనవాళ్ళు, తెలుగులో కొత్త పదాల రూపకల్పన, అనువాదాలు, మనం ఏనాడో వదిలేసిన బండి'ఱా', 'ఋ' అక్షరాల వాడకాన్ని పునరుద్ధరించడం, వాడుక భాష కొనసాగింపు, తెలుగు భావజాల వ్యాప్తి లాంటి భాషాపరమైన అంశాలపై తీవ్రస్థాయిలో ఈ గుంపుల్లో చర్చలు జరుగుతున్నాయి. భాష ఒక్కటే కాకుండా తెలుగు సంస్కృతి పై కూడా ఈ గుంపుల్లో చర్చలుంటాయి. తెలుగువారి పంచెకట్టు, చీరకట్టు రీతుల గురించి చెప్పమంటూ కొందరు కోరగా  పలువురు ఉత్సాహంగా ప్రతిస్పందించి సంబంధిత వీడియోల లింకులు ఇస్తూ వివరించడం మనకు కనిపిస్తుంది.

 

తెలుగులో టైపుచెయ్యడం గురించి, తెలుగు బ్లాగుల్ని ఏర్పాటు చేసుకోవడంలో సాంకేతిక సహకారం కోసం ఈ గుంపుల్లో వచ్చే విజ్ఞప్తులకు ఎందరో ఉదారంగా స్పందించి తోచిన రీతిలో సాంకేతికంగా సహకారం అందిస్తుంటారు. మరికొందరు తాము చేపట్టిన సరికొత్త తెలుగు ప్రాజెక్ట్‌లపై సమాచారాన్ని కోరుతుంటారు, ఆ వివరాల్ని ఇతరులతో పంచకుని విశ్లేషిస్తారు. తెలుగు భాషను ప్రేమించేవారంతా ఇలాంటి గుంపుల్లో సభ్యులయినట్లయితే తేట తెలుగు కమ్మదనాన్ని అనునిత్యం ఆస్వాదిస్తూనే ఉంటాం.

Read More on...