e-Tradingలో రైతుల ఉత్పత్తులకు లాభసాటి బేరం
(Online trading of farm produce)
ఇక రైతాంగం తమ పంట దిగుబడిని నేరుగా e-Trading Exchange ద్వారా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. ఇందుకు సంబంధించి 1966 నాటి ఆంధ్రప్రదేశ్ మార్కెట్స్ (వ్యవసాయ ఉత్పత్తులు, పశుగణం) చట్టాన్ని సవరించాలన్న ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 21, 2011న ఆమోదముద్ర వేసింది. ఫలితంగా స్పాట్ ఎక్స్‌ఛేంజీల ఏర్పాటు, పంటల ఇ-ట్రేడింగ్‌కు కావలసిన లైసెన్స్ పత్రాల జారీకి రంగం సిద్ధమైంది. పంటలకు సంబంధించిన వ్యాపారపరమైన లావాదేవీల్లో అనుసరించే సంప్రదాయ విధానానికి ఇది ఒక ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ఇస్తుంది.
e-Tradingలోని ముఖ్యాంశం ఏమిటంటే, దళారుల ప్రమేయం గణనీయంగా తగ్గడం. ఈ దళారుల ప్రమేయం వల్లనే తామంతా తీవ్రంగా నష్టపోతున్నామని గగ్గోలు పెడుతున్న రైతులకు e-Trading ద్వారా ఉపశమనం కలుగుతుందని చెప్పవచ్చు. పంటను పండించే రైతులకు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారులకు మేలు కల్గించే వ్యవస్థ ఇదని నిపుణులు పేర్కొంటున్నారు. వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో పాల్గొనే రైతులు, వ్యాపారులు, కార్పోరేట్ సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈ రంగాలకు చెందిన ఇతరులెవరైనా నిర్దిష్ట పంటకు సంబంధించి అందుబాటులో ఉన్న సరైన ధరను గురించి Spot Exchangeల ద్వారా తెలుసుకోవచ్చు.
తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు, వ్యాపారులకు మధ్య online trading platformగా వ్యవహరించేందుకు National Spot Exchangeకి లైసెన్స్ ఇచ్చే దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన చేస్తుంది. రైతులు తమ ఉత్పత్తికి తగిన ధరను నిర్ణయించుకుని, ఈ online trading platform ద్వారా ఆ ధరను తెలియజేస్తే, ఆ ఉత్పత్తిని కొనుగోలు చెయ్యడానికి వ్యాపారులు, కార్పోరేట్ సంస్థలు, ఎగుమతిదార్లు, దిగుమతిదార్లు పోటీపడతారు. తద్వారా రైతులకు మంచి ధర దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తమ ఉత్పత్తికి లభించే ధరను బట్టి దానిని సంప్రదాయ వ్యవసాయ విపణిలో అమ్ముకోవాలా లేక e-trading Exchangeలో అమ్ముకోవాలా అనేది రైతుల ఇష్టానికే వదలివేయబడుతుంది. ఇప్పటివరకూ వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయిస్తూ కీలకపాత్ర పోషిస్తున్న దళారుల వ్యవస్థ కనుమరుగై రైతుల జీవితాలు మెరుగావుతాయని భావిస్తున్నారు.
ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటంటే, నాణ్యతా నియంత్రణ విధానాల్ని అనుసరిస్తూ పంటల్ని సాగుచేసి Spot Exchange గోదాములలో నిల్వ చేసుకున్న పంటలకు బ్యాంకుల నుంచి రూణాల్ని కూడా పొందవచ్చు.