జైల్లో ఖైదీలు... ఇక హార్డ్‌వేర్ ఇంజనీర్లు
(Prisoners... to become Hardware Engineers)
ఆవేశంలో తప్పుచేసి... శిక్షకు గురై... నాలుగు గోడల మధ్య బందీలుగా నలిగిపోతూ కుమిలిపోతున్న ఖైదీలకు ఒక మంచి అవకాశం వచ్చింది. సత్ప్రవర్తన గల ఖైదీలను ఎంపిక చేసి, వారికి హైటెక్ శిక్షణనిచ్చి హార్డ్‌వేర్ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పిస్తున్నది. వీరి శిక్షాకాలం పూర్తయిన తర్వాత నాలుగంకెల జీతం ఇప్పించి మంచి భవిష్యత్తు అందించే దిశగా రంగం సిద్ధమవుతున్నది. ఈ మేరకు అమెరికాకు చెందిన Fusion Control System Private Limited అనే ఒక MNC ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జైళ్లశాఖతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఖైదీలకు శిక్షణనివ్వడమేగాక వారు విడుదలయ్యాక ఉద్యోగాలిచ్చేందుకు కూడా ఈ MNC ముందుకు వచ్చింది.
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న Fusion Control System Private Limited సంస్థ ప్రధాన కేంద్రం అమెరికా. కంప్యూటర్లతోబాటు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఉపయోగించే ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ బోర్డ్ (PCB) లను ఈ సంస్థ తయారు చేస్తుంది. ఈ కంపెనీకి, రాష్ట్ర జైళ్లశాఖకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం హైదరాబాద్ చర్లపల్లి జైల్లో ఉన్న ఖైదీల్లో మంచి ప్రవర్తన గలవారికి ఈ పిసిబిల తయారీలో తర్ఫీదు ఇస్తారు. సుమారు మూడు నెలలపాటు ఇచ్చే ఈ శిక్షణకోసం 10వ తరగతి, ఆపై విద్యార్హతలున్న ఖైదీల్ని ఎంపిక చేస్తారు.
శిక్షణానంతరం PCBల తయారీలో మంచి నైపుణ్యం సాధించిన సదరు ఖైదీలకు శిక్షణనిచ్చిన సంస్థలోనే ఉద్యోగం ఇవ్వడం గానీ లేదా వారిచేతే PCBలు తయారు చేయించి తగిన రేటుకు కొనుగోలు చెయ్యడం జరుగుతుంది. ఈ వినూత్న శిక్షణాకార్యక్రమం, అనంతర ఫలితాలు బాగుంటే ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోని ఇతర జైళ్లకూ విస్తరింపజేస్తారు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే... PCBల తయారీలో శిక్షణ అందుకున్న ఖైదీలు ఆ తర్వాత మిగిలిన ఖైదీలకూ (అర్హతలున్న) శిక్షణనిచ్చేలా ప్రణాళికను రూపొందించారు.