ఒకేఒక్క SMS... రైతులకు లాభసాటి బిజినెస్
(Farmers receive profits through Guntur market yard SMS system)
మిరప సాగు చేసే రైతు సుబ్బారావుగారి మొబైల్ ఫోన్‌కు ఒక SMS వచ్చింది. అది గుంటూరు మార్కెట్ యార్డ్‌లో క్వింటాల్ మిరప ధర ఏ రోజు ఎంత పలుకుతున్నదో ఏ రోజుకు ఆ రోజే తెలియజేసే SMS. ఆ రోజు ధర చూసుకున్న సుబ్బారావుగారు వెంటనే ఎగిరి గంతేస్తూ తోటి రైతులకూ సమాచారం ఇచ్చారు. అంతా కలసి మొత్తం 110 క్వింటాళ్ళ మిరపతో మార్కెట్ యార్డ్‌కు చేరుకుని అమ్మేశారు. సుమారు ఆరున్నర లక్షల రూపాయలకు పైగా ఆదాయాన్ని కళ్ళజూశారు. అంతకు ముందు పాపం వీరంతా మార్కెట్ యార్డ్ నిర్ణయించిన ధరకంటే తక్కువ మొత్తానికే దళారులకు పంట అమ్ముకుని చాలీచాలని ఆదాయంతో ఇంటిముఖం పట్టేవారు. ఇప్పుడు SMS వ్యవస్థ పుణ్యమా అంటూ వీరి పరిస్థితి మారింది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతున్నారు.
ఇక గుంటూరు మార్కెట్ యార్డ్‌లోని SMS వ్యవస్థ నేపథ్యం గురించి తెలుసుకుందాం...
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ శరత్ గుంటూరు మార్కెట్ యార్డ్‌లో మిరప ధరల వివరాల్ని MROలు, MDOలు, ప్రజా ప్రతినిధులు, ఆదర్శ రైతులకు SMS ద్వారా తెలియపరిచే విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ SMS అందుకున్నవారు దానిని మిగిలిన రైతులకూ పంపుతారు. తద్వారా దళారుల బెడద లేకుండా నేరుగా యార్డ్‌లోనే పంట అమ్ముకుని శ్రమకు తగిన ప్రతిఫలం అందుకునే అవకాశం లభిస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న ఈ అధునాతన సేవను సద్వినియోగం చేసుకోవడం ద్వారా అక్కడి రైతుల బేరసారాల జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.
జాయింట్ కలెక్టర్ ఈ మధ్యనే ప్రవేశపెట్టిన ఈ SMS విధానం అందించే మిరప ధరవరల తాజా సమాచారం స్వల్పకాలంలోనే అత్యంత ఆదరణ పొంది స్థానిక రైతులోకంలో చర్చనీయాంశంగా మారింది. ఈ పద్ధతి వచ్చిన తర్వాత... డిసెంబర్ 2010లో రైతులు నేరుగా 22.49 లక్షల క్వింటాళ్ళ మిరపను యార్డ్‌లో విక్రయించారు. దళారుల బెడద లేకుండా నేరుగా అమ్ముకుని సుమారు 180 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందారు.
ఇక మన రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి SMS విధానాన్నే ప్రవేశపెట్టి రైతుల్ని ఆదుకోవాలని, ఆత్మహత్యల మాట వినిపించకూడదని మనమంతా కోరుకుందాం.