కంప్యుటర్‌ను కాపాడే Microsoft Security Essentials
మన దైనందిన కార్యకలాపాల్లో ముఖ్యావసరంగా మారిపోయిన కంప్యూటర్ల సాయంతో శరవేగంగా మన పనులు చేసుకుంటూ ఎన్నో ప్రయోజనాలు అందుకుంటున్న తరుణమిది. అవి లేని జీవితాన్ని ఎంతమాత్రం ఊహించుకోలేం. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మనమంతా మన పర్సనల్ కంప్యూటర్లతోను, ఆఫీసుల్లో అయితే పదుల నుంచి వందల సంఖ్యలో అనుసంధానమై ఉన్న కంప్యూటర్ల ద్వారా పనిచేసుకుపోతుంటాం.
ఈ క్రమంలో ఆన్‌లైన్ వ్యవహారాల కోసం ఇంటర్నెట్‌తో కనెక్ట్ కాగానే లక్షల కోట్ల కంప్యూటర్ల మహాసముద్రంలో మన కంప్యూటర్ కూడా ఒక నీటిబొట్టులా కలిసిపోతుంది. ఈ మధ్యలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే సీడీలు, డీవీడీలు, పెన్ డ్రైవ్‌లతో సమాచారం పంపిణీ అవుతుంటుంది. ఇదంతా సాఫీగా జరిగిపోతున్నంతకాలం నల్లేరు మీద నడకలా జీవితం హాయిగా ఉంటుంది. కానీ ఒక దుర్ముహూర్తాన మనకు కావలసిన అతి ముఖ్యమైన సమాచారం కోసం ఎంత వెదికినా కనిపించనప్పుడు, ఏదైనా ఒక ఫైల్‌లో గజిబిజిగా జంక్ లెటర్స్ ఉన్నప్పుడు, కంప్యూటర్ పదే పదే హ్యాంగ్ అవుతున్నప్పుడు... మనకు వైరస్, హ్యాకింగ్, స్పైవేర్, మాల్‌వేర్, ఫిషింగ్ లాంటి పారిభాషిక పదాలన్నీ గుర్తొస్తాయి. మరి ఇలాంటి ఉపద్రవం రాకముందే మనల్ని మేల్కొలిపేందుకు Microsoft సంస్థ Security Essentials పేరిట పటిష్ఠమైన భద్రతా వ్యవస్థను మనముందుంచింది.
ముందుగా మీ Home PC గురించే మాట్లాడుకుంటే... దానిని వైరస్, స్పైవేర్, ఇతర హానికరమైన సాఫ్ట్‌వేర్ నుంచి కాపాడేందుకు Security Essentialsలోని వ్యవస్థలు నిరంతరం నిఘావేసి ఉంచుతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ Security Essentialsను ఇన్‌స్టాల్ చేసుకోవడం, ఉపయోగించుకోవడం చాలా సులభం. అసలైన (genuine) Windowsను ఉపయోగించే వారందరికీ ఉచితంగా లభించే సదుపాయమిది. మీ కంప్యూటర్‌కు రక్షణ ఉందని మీరు నిర్ధారించుకోవడం ఎంత సులభమంటే... దీనికి భద్రత కల్పించే రక్షణ కవచం మీ కళ్ళెదుటే ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.
కంప్యూటర్‌లో మీరు చేసుకునే పనులపై ఎలాంటి ప్రభావం పడకుండా ఈ Security Essentials వాటి పని అవి చేసుకుంటాయి. ముఖ్యంగా భద్రతాపరమైన సమస్యలపై పరిశోధన చేస్తూ ఎప్పటికప్పుడు ప్రతిస్పందించే Microsoft Malware Protection Center (MMPC) పాత్ర ఎంతో కీలకమైంది.
వైరస్, మాల్‌వేర్, స్పైవేర్ సృష్టికర్తల చర్యలపై నిరంతరం నిఘావేసి ఉంచే ఈ MMPCకి అమెరికా, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ప్రయోగశాలలున్నాయి, పరిశోధకులున్నారు. అవాంఛనీయమైన, హానికరమైన సాఫ్ట్‌వేర్ సమస్యలు ఎప్పుడు ఉత్పన్నమైనా ఈ కేంద్రం తక్షణం స్పందించి తోడ్పాటునిస్తుంది.
రక్షణలో భాగంగా Forefront Client Security, Windows Live OneCare, Windows Defender, Malicious Software Removal Tool తదితరాల సమన్వయంతో ప్రతినెలా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్ల నుంచి హానికరమైన సాఫ్ట్‌వేర్ తొలగింపు జరుగుతుంటుంది.
MMPC తన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా పరిశోధన ఫలితాలు, సలహాలు, సూచనలను అందజేస్తుంటుంది. ఇదిగాక ఏటా రెండుసార్లు విడుదలయ్యే Microsoft Security Intelligence Report ద్వారా కంప్యూటర్లు, నెట్‌వర్క్ వ్యవస్థల భద్రతకు సంబందించిన అంతర్జాతీయ పరిస్థితి గురించి తాజా వివరాలు తెలుసుకోవచ్చు.