GIFT ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు ఇంటర్నెట్ సదస్సు

 

 

 

                                       తెలుగు భాషకు సంబంధించి లాంగ్వేజి కంప్యూటింగ్ పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా విస్తరిస్తూ ఉధృతమవుతున్న తరుణంలో ఈ రంగానికి చెందిన నిపుణుల్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమీక్షించడం ద్వారా ఒక సమగ్ర అవగాహన కల్పించేందుకు గాను అమెరికాలోని ప్రముఖ ప్రవాసాంధ్ర సంస్థ సిలికానాంధ్ర, మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి 30 తేదీల మధ్య తొలి అంతర్జాతీయ తెలుగు ఇంటర్నెట్ సదస్సును కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో ఉన్న ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో నిర్వహించాలని సంకల్పించాయి. సిలికానాంధ్ర మరియు అంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటి విభాగం సంయుక్తంగా రూపకల్పన చేసిన Global Internet forum for Telugu (GIFT) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది.

 

లాంగ్వేజి కంప్యూటింగ్ రంగంలో తెలుగు భాషకు సంబంధించిన పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న సాంకేతిక నిపుణులు పాల్గొనే ఈ సమావేశం ప్రధానంగా ఇంటర్నెట్ యూజర్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, సాధనాలు,  ఇంటర్నెట్‌లో తెలుగు భాష వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సారిస్తుంది. “Telugu in the Internet Age” అనే ఇతివృత్తంతో నిర్వహించే ఈ సదస్సు పై అంశాలకు సంబంధించిన ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదలకు తగిన సిఫారసులు చేస్తుంది.

 

తెలుగు భాషకు సంబంధించిన కంప్యుటేషనల్ భావనలపై గతంలో ఎన్నడూ జరగని రీతిలో చర్చలు జరిపే తొట్టతొలి సమగ్ర సదస్సు ఇదే అవుతుందని ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న Tokyo University of Foreign Studies లింగ్విస్టిక్స్ విభాగం ఆచార్యులు పేరి భాస్కరరావు పేర్కొన్నారు. ఇంటర్నెట్‌లో తెలుగు బాష వినియోగంలో భాగంగా ఆన్‌లైన్ నిఘంటువులు, అక్షరక్రమ తనిఖీ సాధనాల (spell checkers) వాడకం బాగా పెరిగిందని, ఈ క్రమంలో ప్రామాణీకరించిన యూనికోడ్ క్యారెక్టర్ ఎన్‌కోడింగ్‌తో పాటు ఇంటర్నెట్ బ్రౌజర్లు, పర్సనల్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో భాషాపరమైన మద్దతు లభిస్తున్నదన్నారు. మరోపక్క తెలుగు భాషలో స్పీచ్ ఇన్‌పుట్ / అవుట్ పుట్, చేతి రాత గుర్తింపు కార్యకలాపాలు కూడా ఊపందుకుంటున్నాయని చెప్పారు. కాగా, తెలుగు భాష క్యారెక్టర్ ఎన్‌కోడింగ్, ఉచితంగా పంపిణీ చేయడానికి గాను అత్యుత్తమ నాణ్యతగల యూనికోడ్ అనుకూల ఫాంట్స్, తెలుగులో స్పీచ్ I/O తదితర అంశాల్లో ఇంకా కొన్ని ప్రమాణాలు, సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపడాల్సి ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నిటిపైనా సెప్టెంబర్‌లో జరిగే అంతర్జాతీయ సదస్సులో విస్తృతంగా చర్చిస్తారు.

 

సదస్సులో భాగంగా... Language Technology Tools for Telugu, Computational Lexicons for Telugu Electronic/Digital dictionaries for Telugu, Telugu Corpora, Annotation and Analysis;Search Engines for Telugu ; Telugu Content Development, Computational analysis of Telugu Tools for Telugu Computing, Enabling and embedding of Telugu in various platforms, Unicode Character Encoding, Keyboards and IMEs for Telugu, Commercial solutions and e-commerce, Application of Telugu in E-Governance తదితర అంశాలపై పత్రాల సమర్పణకు నిపుణులను ఆహ్వానిస్తున్నారు. అంశాల పరిధి, గడువు తేదీల వివరాలకు

http://sites.google.com/site/iticgift/call-for-papers

వీక్షించండి.

 

 

రానున్న దశాబ్ద కాలంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వాడకం చెప్పుకోదగిన మార్పులకు లోనవుతుందని భావిస్తున్నారు. ప్రత్యేకించి వ్యక్తుల స్థాయిలోను, వికలాంగులైన వారికి (స్పీచ్ ఇన్‌పుట్ / అవుట్ పుట్ వంటి) మరింత తోడ్పాటునందించేలా మొబైల్ మరియు కంప్యూటింగ్ టెక్నాలజీ అభివృద్ధి వల్ల సుదూర ప్రాంతాల ప్రజలు సైతం ఇంటర్నెట్ ప్రయోజనాల్ని మరింత ఎక్కువగా పొందే వీలుందని, ముఖ్యంగా ప్రభుత్వం ఇంటర్నెట్ ఆధారిత పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మరింత తక్కువ వ్యయంతోనే ప్రజలకు పలు సేవలందించవచ్చని GIFT పత్రికా ప్రకటన అభిప్రాయపడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఐటి మరియు కమ్యూనికేషన్ ( IT&C ) విభాగం ద్వారా తెలుగు భాషకు ప్రాధాన్యతనిస్తూ ఇ-గవర్నెన్స్‌ను ఎంతో అభివృద్ధి చేసిందని, కోట్లాదిమంది ప్రజలు దీనిని ఉపయోగించుకుంటున్నారని సిలికానాంధ్ర అధ్యక్షుడైన కూచిభొట్ల ఆనంద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నగరం ప్రస్తుతం భారత్‌లో ఒక ప్రధాన సాఫ్ట్‌వేర్ కేంద్రంగా ఉన్న నేపథ్యంలో, ఇంటర్నెట్ మరియు ఇన్ఫర్మేషన్‌కు సంబంధించి తెలుగు భాషలో లాంగ్వేజి కంప్యూటింగ్ మరియు అభివృద్ధి కార్యకలాపాలు గత కొంతకాలంగా పురోగమిస్తున్నాయన్నారు. తెలుగు భాషా కంప్యుటేషన్ నిపుణుల మధ్య నిర్మాణాత్మక చర్చల దిశగా మార్గం సుగమం చేసేందుకు GIFT ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుందన్నారు. http://gift.siliconandhra.org

ద్వారా మరిన్ని వివరాలు పొందవచ్చు.


 

Read More on...