Go Search

 

బ్లాక్‌బోర్డ్‌ను సాగనంపుతున్న స్మార్ట్‌బోర్డ్
(Black Board Vs Smart Board)

 

అవును... ఇప్పుడు పాఠశాలల్లోని తరగతి గదుల స్వరూపం మారిపోతున్నది. బ్లాక్‌బోర్డ్‌ను స్మార్ట్‌బోర్డ్ (డిజిటల్ స్క్రీన్), సుద్దముక్కను స్టైలిష్ పెన్ (డిజిటల్ పెన్), ఆక్రమిస్తున్నాయి. వీటితో పాటు ఎల్‌సిడిలు, రిమోట్‌లు, ప్రొజెక్టర్లు కూడా విద్యాబోధనలో భాగమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బహుశా కొన్ని రోజుల్లో బ్లాక్‌బోర్డ్, సుద్దముక్క, డస్టర్ అనే మాటలు వినిపించకపోవచ్చు.

ఉపాధ్యాయులంతా తరగతి గదిలో చెప్పబోయే పాఠాన్ని ముందుగా తాము చదువుకుని, ఒక నోట్స్ తయారుచేసుకుని, విద్యార్థులు సంధించబోయే సందేహాస్త్రాల్ని ఎదుర్కునేందుకుగాను అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితిని మనం గమనిస్తూనే ఉన్నాం. సాంకేతిక పరికరాల రాకతో విజ్ఞానాన్ని వినోదాత్మకంగా అందించే వినూత్న రూపాన్ని తరగతిగది సంతరించుకుంది. మొన్నటివరకూ
మొద్దులనిపించుకున్న చాలామంది పిల్లలు నేడు కదిలే రంగుల చిత్రాలు, కళ్ళెదుట జరిగే ప్రయోగాలను కళ్ళప్పగించి చూస్తూ విజ్ఞాన వినువీధిలో పరుగులు తీస్తున్నారనడం అతిశయోక్తి కాదు.

ఒక డిజిటల్ తరగతి గదిని సిద్ధం చెయ్యడానికి పైన తెలిపిన స్మార్ట్‌బోర్డ్, స్టైలిష్ పెన్ లాంటి పరికరాలతో పాటు వివిధ తరగతుల విద్యార్థులకు బోధించేందుకుగాను ఆయా సబ్జెక్ట్‌ల యానిమేటెడ్, విడియో మాడ్యూల్స్‌ను సిద్ధం చేసుకుంటారు. ఈ మాడ్యూల్స్ అద్దె పద్ధతిమీద, సీడీల రూపంలోను, లభ్యమవుతాయి. ఈ వ్యవస్థను ఇంటర్నెట్‌తో అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది కనుక సరికొత్త పరిణామాలు, ఎప్పటికిప్పుడు అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న సంఘటనలపై అప్పటికప్పుడే విద్యార్థులకు అవగాహన కల్పించవచ్చు.

ఈ డిజిటల్ క్లాస్‌రూంకు సంబంధించిన
మరో విశేషమేమిటంటే... ఉపాధ్యాయులు స్మార్ట్‌బోర్డ్ పైన స్టైలిష్ పెన్‌తో రాస్తూ చెప్పే ముఖ్యమైన పాఠాల్ని కంప్యూటర్‌లో నిక్షిప్తం చెయ్యవచ్చు. దీని ఉపయోగం ఏమిటంటే... ఈ పాఠాల్ని మళ్ళీ చెప్పాల్సి వచ్చినా లేదా ఇతర సెక్షన్ల ఉపాధ్యాయులకు వీటి అవసరం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. మరో అడుగు ముందుకేసి ఇంటర్నెట్‌లోనూ అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెట్ సదుపాయం ఉన్న విద్యార్థులు వారి ఇళ్ళలోనూ ఈ నెట్ పాఠాల్ని మననం చేసుకోవచ్చు.

 

పాఠాల విషయానికి వస్తే విద్యార్థులకు అంతగా కొరుకుడు పడనివి లెక్కలు, సైన్స్ అని చాలామంది అభిప్రాయం. ఈ సబ్జెక్ట్‌లలోని సిద్ధాంతాలు, ప్రయోగాల్ని సులభశైలిలో వివరించేందుకు గాను వీడియో, యానిమేటెడ్ పాఠాలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా రసాయన ప్రయోగాల్లో తెరపై కనిపించే కెమికల్స్‌ను డ్రాగ్ చేసి మిశ్రమించి ఫలితాన్ని చూడవచ్చు. అలాగే జీవశాస్త్రంలో మొక్కలు, మనుషులు, జంతువుల్లో చోటు చేసుకునే జీవక్రియల్ని మరింత పెద్దవిగా, స్పష్టంగా ఈ యానిమేటెడ్ లేదా వీడియో పాఠాల్లో గమనించవచ్చు. ఈ స్థాయిలో అవగాహన ఏర్పడిన తర్వాత నిజమైన ప్రయోగశాలకు వెళ్ళి కచ్చితమైన ఫలితాల్ని రాబట్టి మంచి మార్కులు పొందవచ్చు.

 

ఈ డిజిటల్ తరగతులు కేవలం మెట్రో నగరాలకే పరిమితం అనుకుంటే పొరపాటే... ఇప్పుడు జిల్లా కేంద్రాలు, జిల్లాల్లోని ముఖ్యమైన పట్టణాల్లోనూ ఇవి ప్రత్యక్షమవుతున్నాయి.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2013 Microsoft Corporation. All rights reserved.