సోషల్ నెట్‌వర్కింగ్ నుంచి స్నేహ పరిమళాలు
(Friendship fragrance from Social Networking)
భావోద్వేగాల సమాహారమే సమాజం.
అందులో ఒక్కో వ్యక్తికీ ఒక్కో అభిరుచి, ఒక్కో మనస్తత్వం. ఇంటర్నెట్ యుగం మొదలయ్యాక ఆరంభంలో కేవలం వెబ్ సైట్లు చూడటం, మెయిల్స్ పంపుకోవడానికే నెటిజన్లు పరిమితమయ్యారు. ఇక ఇంటర్నెట్‌లో ఆన్‌లైన్ గేమ్స్, చాటింగ్ వచ్చాక కొందరు పరిమితులు మీరారు. సమాజానికి దూరంగా గంటలకొద్దీ ఆన్‌లైన్ ఆటలు, చాటింగ్‌లో కాలం గడిపేసేవారు తయ్యారయ్యారు. ఈ చాటింగ్‌లలో చాలావరకూ చీటింగ్‌తో ముగిసేవే ఎక్కువ. ఇలాంటి నెట్ వ్యసనపరులపై వైద్యరంగం ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వచ్చింది. కొన్ని దేశాల్లో అయితే ఇలాంటివారిని దారిలోకి తేవడానికి స్పెషల్ క్లీనిక్‌లు వెలిశాయి. అయితే ఈ పరిణామాలకు చాలామంది ఇంటర్నెట్‌ను నిందించడం తప్పు. ఒక డాక్టర్ కత్తితో రోగికి ఆపరేషన్ చేసి ప్రాణం నిలబెడతాడు. దొంగలు ఆదే కత్తిని డబ్బుకోసం మనుషుల ప్రాణాల్ని తియ్యడానికి వాడతారు. తప్పు కత్తిది కాదుగా... అలాగే ఇంటర్నెట్ కూడా. అది అందించే సదుపాయాల్ని ఏ రూపంలో వినియోగించుకుంటున్నామనేది మనిషి విచక్షణపై ఆధారపడి ఉంది.
అవును, ప్రస్తుతం విచక్షణ గల మనుషులు ఇంటర్నెట్‌ను సరైన మార్గంలో ఉపయోగించుకుంటున్నారు. భావసారూప్యత గల వ్యక్తులు, ఒకే రంగానికి చెందినవారు ఒకప్పుడు అవలంబించిన పద్ధతి ఏమిటంటే గ్రూప్ మెయిల్స్ ద్వారా తమ అనుభవాలు అనుభూతులు పంచుకోవడం. ఒకే అంశంపై నిర్వహించే వెబ్‌సైట్లు, బ్లాగులు నేడు వీరి మధ్య వారధిగా ఉంటున్నాయి. తాజాగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు అన్ని వయసులవారినీ, అన్ని రంగాలవారినీ ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయి.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా పరిచయమైన వ్యక్తులు నిజమైన స్నేహితులవుతున్నారు. అవును ముమ్మాటికీ నిజం. తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఒక సోషల్ నెట్‌వర్కింగ్ సమావేశం ఇది నిజమని చెబుతోంది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా పరిచయమైన పలువురు వ్యక్తులు ఈ సమావేశంలో కలుసుకుని ఆత్మీయంగా పలుకరించుకున్నారు. అప్పటివరకూ కీబోర్డ్‌పై అక్షరాల వెంబడి కదలాడిన హస్తాలు కరచాలనం చేసుకోగా భావసారూప్యతగల ఈ వ్యక్తుల సమ్మేళనం అబ్బురపరచింది.
ఈ సమావేశానికి వచ్చినవారిలో సేవాతత్పరులు, ఒకే విధమైన అభిరుచులు, నైపుణ్యాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. నేరుగా కలుసుకోవడంలోని మాధుర్యాన్ని చవిచూచిన వీరంతా ఇక నుంచీ అప్పుడప్పుడూ ఇలాగే కలుసుకుని ప్రత్యక్షంగా ఏవైనా కొన్ని కార్యక్రమాల్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు.
ప్రస్తుతానికి బ్లాగర్ల మధ్య ఇలాంటి సమావేశాలు తరచుగా జరుగుతున్నప్పటికీ ఇప్పుడిది సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకు కూడా విస్తరించడం సంతోషించదగిన పరిణామం. ఇంటర్నెట్‌తో ఇంట్లో గదికే పరిమితమయ్యే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారుకూడా ఈ ‘సోషల్’ లైఫ్‌లోకి అడుగుపెడతారని ఆశిద్దాం. ఇంటర్నెట్‌ను నిందించేవారు సైతం మారతారని ఆకాంక్షిద్దాం.