రాజధానితో రేపల్లెను అనుసంధానం చేసే APSWAN
(APSWAN project to connect state capital with villages)

 

 

     ప్రభుత్వ కార్యకలాపాల్ని మరింత సమర్థవంతంగా, వేగంగా నిర్వహించేందుకు గాను, రాష్ట్ర సచివాలయం నుంచి మండల స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాలన్నిటినీ జనవరి 2011 నుంచీ Online ద్వారా అనుసంధానించేందుకు రంగం దాదాపుగా సిద్ధమైనట్లు తెలుస్తున్నది. ఇందుకు ఉద్దేశించిన A.P. Secretariat Wide Area Networking (APSWAN) కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. దీంతో సచివాలయం మొదలుకొని మండల కార్యాలయాల వరకూ వివిధ శాఖల అధికార్ల మధ్య వీడియో కాన్ఫరెన్సింగ్‌తో పాటు పలు పరిపాలనా సంబంధిత కార్యకలాపాలను నిర్వహించవచ్చు.


ఈ పరిణామంలో భాగంగా National Institute of Smart Governance సంస్థ నవంబర్ 2010లో సచివాలయంలో e-governance leadership సదస్సును నిర్వహించింది. పౌరులకు ప్రభుత్వ సేవలను అందించేందుకుగాను e-governance ప్రాజెక్ట్‌లను చేపట్టే క్రమంలో సచివాలయం సిబ్బంది, ఉన్నతాధికార్ల మద్దతు, అంకితభావం ప్రాధాన్యతపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం జరిగింది. మన రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా e-governanceను వినియోగించుకోవడం, ఎదురయ్యే సవాళ్ళు, పౌరుల అవసరాల్ని తీర్చే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారికి ఈ సదస్సులో వివరించారు.

 

భారత ప్రభుత్వ NeGP (National e-Governance Plan) భావనను మరింత లోతుగా అర్థం చేసుకోవడంపై ఈ సదస్సు దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో దీనిని అమలు చేసినప్పుడు అనుభవంలోకి వచ్చే వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకునేందుకు, ప్రభుత్వాధికార్లకు ఈ ప్రాజెక్ట్‌కు మరింత చేరువ చేసేందుకు గాను ఈ సదస్సులో పాల్గొన్న అధికార్లు, సిబ్బందికి laptopలు ఇచ్చి పనిచేయించారు.

 

APSWAN పూర్తి స్థాయిలో సిద్ధం కాగానే, e-governance ప్రాజెక్ట్‌లను అమలు చేసి ట్యూషన్ ఫీజు రీఎంబర్స్‌మెంట్, పోస్ట్ మెట్రిక్ ఉపకారవేతనాల చెల్లింపు వంటి వివిధ ప్రక్రియల్ని Onlineలోకి తీసుకురావడం ద్వారా నిధుల దుర్వినియోగం, మోసాలను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. పారదర్శకత, జవాబుదారీతనం, సేవల పంపిణీ మరింత మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమైంది.

 

సామాన్య ప్రజల సాధారణ అవసరాల్ని గుర్తించి, అందుబాటు రుసుములతో పారదర్శకత, విశ్వసనీయత, జవాబుదారీతనం మధ్య వారికి ప్రభుత్వ సేవలను చేరవేయడం NeGP లక్ష్యం. నేడు ప్రపంచవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున e-governance ప్రాజెక్ట్‌ల దిశగా చొరవ చూపుతూ NeGP అమలుకు మొగ్గు చూపుతున్నాయి.