Tablet PCలతో అక్రమ నిర్మాణాలపై GHMC కన్ను!

 

 


         గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలకమండలి (GHMC) తన సిబ్బంది కోసం Tablet PCల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. నగర పరిధిలో పెరిగిపోతున్న అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవడం కోసం ఈ Tablet PCలను ఉపయోగిస్తారు. టౌన్ ప్లానింగ్, బిల్డింగ్ ప్లాన్స్ సంబంధిత డేటాను ఈ PCలలో పొందుపరుస్తారు. ఈ డేటాకు అనుబంధంగా ఆరోగ్య, పారిశుద్థ్య, ఇంజనీరింగ్ విభాగాల కార్యకలాపాలకు చెందిన సమాచారాన్ని కూడా వీటిలో లోడ్ చేస్తామంటున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది హాజరు వివరాలు, పని గంటలు, వారు విధులు నిర్వర్తించాల్సిన స్థలాలు, బిన్‌ల ఎత్తివేత, వీధి లైట్లు తదితర వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి.

 

      సాధారణ డేటాకు మాత్రమే పరిమితం కాకుండా లాటిట్యూడ్, లాంగిట్యూడ్, టైం, సైట్ మేప్‌తో పాటు క్షేత్రస్థాయిలో అసలైన చిత్రాల్ని ఈ PCలలో ఉంచి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునేలా సర్కిల్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, ఇంజనీర్-ఇన్-చీఫ్, అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అందుబాటులో ఉంచుతారు.

 

      అధికార్లు ఆకస్మిక తనిఖీలకు వెళ్ళినప్పుడు ఆయా స్థలాలు లేదా నిర్మాణాలలో ఏవైనా అక్రమాలు లేక నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే తమ వద్ద ఉండే ఈ Tablet PCలో అప్పటికప్పుడే బిల్డింగ్ ప్లాన్స్, సర్వే సంఖ్యలను, వాటి పరిధులను పరిశీలించి నిర్ధారించుకోవచ్చు. ఇక అనుమతులు లేకుండా ఇష్టమొచ్చినట్లు నిర్మాణాలు చేసే బిల్డర్‌ల దూకుడుకు Tablet PCలు అడ్డుకట్ట వేస్తాయని ఆశిద్దాం. ఈ Tablet PCలు రాష్ట్ర రాజధానికి మాత్రమేగాక మన రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని అధికార్లకు కూడా అందిస్తే అక్రమాలకు ఆదిలోనే వేటు వేసినట్లవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వెలువడుతోంది.

 

     జంటనగరాలకు సంబంధించి GHMC పరిధిలోకి వచ్చే పలు కార్యకలాపాల కంప్యూటరీకరణ, ఆన్‌లైన్ విధానంలో వివిధ సేవల పంపిణీపై ఈ సంస్థ గత కొంత కాలంగా ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ వస్తున్నది. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ల ద్వారా కూడా సిబ్బంది కార్యకలాపాలను పర్యవేక్షించే కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టింది.

Read More on...