భాషావ్యాప్తి క్షేత్రస్థాయిలో ఉద్యమంలా సాగాలి: GIFTలో వక్తల పిలుపు
తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం పత్రికలు, ప్రసారసాధనాలు ఉద్యమప్రాయంగా కృషి చేయాలని అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు-2011 రెండవరోజు సమావేశం పిలుపునిచ్చింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మిల్పీటస్‌లో సెప్టెంబరు 28-30, 2011 మధ్య ఇండియా కమ్యూనిటీ సెంటర్ వేదికగా ప్రసార సాంకేతిక విభాగం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు సిలికానాంధ్ర - విశ్వ తెలుగు అంతర్జాల వేదిక (GIFT - Global Internet Forum for Telugu) సమర్పణలో జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు వివిధ మాధ్యమాల్లో భాషాభివృద్ధి దిశగా సలహాలు సూచనలు ఇవ్వడంతోపాటు పలు అంశాలపై పత్ర సమర్పణ చేశారు.
సిలికానాంధ్ర, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం (సెప్టెంబర్ 29) నాటి రెండవ రోజు సదస్సు ప్రచారసాధనాలపై దృష్టి సారించింది. భాషావ్యాప్తిలో మీడియా ప్రధాన పాత్ర వహించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు. ఈనాడు జర్నలిజం కళాశాల ప్రధానాచార్యులు ఎమ్.నాగేశ్వరరావు మాట్లాడుతూ లక్షలాదిగా తెలుగు పాఠకులు, వీక్షకులు ఉన్నందువల్లనే పత్రికలు, టీవీ ఛానెళ్ళు మనుగడ సాగిస్తున్నాయని పేర్కొన్నారు. అయితే, భాష అడుగంటితే ఈ మాధ్యమాలు ఏమవుతాయని ప్రశ్నించారు. తెలుగు విశ్వవిద్యాలయం భాషలు అనువాద అధ్యయన కేంద్ర అధ్యాపకులు డాక్టర్.జె.చెన్నయ్య ప్రసంగిస్తూ కంప్యూటర్ మరియు ఆంతర్జాలం వల్ల తెలుగు పత్రికలు ప్రసార మాధ్యమాల్లో ముందెన్నడూ లేని రీతితో వినూత్న విప్లవం ఆవిష్కృతమైందని అన్నారు.
ఇంటర్నెట్‌లో తెలుగు భాష వ్యాప్తికి కృషి చేస్తున్న e-తెలుగు అధ్యక్షుడు వీవెన్ మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్ళి కంప్యూటర్, ఇంటర్నెట్ మాధ్యమాల వాడకం పట్ల చైతన్యం కలిగించడం ద్వారా క్షేత్ర స్థాయిలో భాషా వ్యాప్తి ప్రక్రియను ఉద్యమంలా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. ఐదేళ్ళ తన కుమారునికి తెలుగు భాష నేర్పించాలన్న తపనతో వెబ్ సైటు http://balabharathi.com (బాలభారతి)ని రూపొందించిన వైనాన్ని కందికొండ వంశీ తెలియజేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధకులు డా. రాజ్యరమ, డా. పమ్మి పవన్ కుమార్, డా.పరమేశ్వరి, తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుడు కర్నాటి థోమాసయ్య, పాత్రికేయుడు జగన్ బుద్ధ, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యుడు ననుమాస స్వామి, జాతీయ సమాచార కేంద్రానికి చెందిన డా. చివుకుల శ్రీరామప్రభు వివిధ అంశాలపై ప్రసంగాలు చేశారు. సదస్సు అధ్యక్షులు ఆచార్య పేరి భాస్కరరావు, సిలికానాంధ్ర చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, అధ్యక్షుడు కొండుభొట్ల దీనబాబు పాల్గొన్నారు. సదస్సులో భాగంగా పేరి భాస్కరరావు గారు ప్రవాసరాజ్యం http://www.pravasarajyam.com సైటును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సమర్పించిన పత్రాల వివరాలు:
-------------------------------------------------------
కంప్యూటర్లు మరియు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి క్షేత్రస్థాయి ఉద్యమం (శ్రీ వీవెన్)
ఆంగ్ల-తెలుగు యంత్రానువాదం (డా.కె.రాజ్యరమ)
అంతర్జాలం ఓ అక్షయపాత్ర! తెలుగు అంతర్జాలం ఓ మృణ్మయపాత్ర ! (శ్రీ జగన్ బుద్ధ)
తమిళ - తెలుగు యంత్రానువాదం (డా. పరమేశ్వరి)
మెట్టమొదటి "పూర్తి" తెలుగు పదాలాటలు: సాంఖ్యిక పరికరాలలో తెలుగు పాఠ్య పెట్టుదలకు వినిమయ సౌలభ్యపరిష్కారాలు (శ్రీ విరియాల హరీశ్)
ఇంగ్లీషు లిపివాడకంద్వారా తొమ్మిది భారతీయ భాషలకు రోమనీకరణ ప్రమాణం (శ్రీ.మనూ, ఉణ్ణి)
తెలుగు పదజనకం, తెలుగు పదవిశ్లేషణి (ఆచార్య జి. ఉమామహేశ్వరరావు)
వస్తుపర జ్ఞాన నమూనా ఆధారిత చట్రం విస్తరణ: జాలికా పత్ర విషయాల అర్ధ / జ్ఞాన శోధన సౌలభ్యం కోసం జ్ఞాన ప్రాతినిధ్యం పధ్దతి పటం (డా.చివుకుల శ్రీరామప్రభు)
ప్రాచీన (మౌఖిక) వృత్తి పురాణాలు – శాసనాలు, పదకోశ నిర్మాణం (ఆచార్య ననుమాసస్వామి)
వైదిక విజ్ఞానం: భారతీయ సాహిత్య వర్గీకరణ (శ్రీ వాడ్రేవు శ్రీనివాస్)
తెలుగు నేర్చుకోవడానికి పారస్పరిక మరియు వినూత్న అనువర్తనాలు (శ్రీ కందికొండ వంశీ)
తెలుగు పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో సరికొత్త విప్లవాన్ని ఆవిష్కరిస్తున్న అంతర్జాలం, కంప్యూటరు (డా.జె.చెన్నయ్య)
భాషా నమోదం మరియు టీక (సాంఖ్యిక భాషావనరుల సృష్టి) (శ్రీ శ్రీగణేశ్ తొట్టెంపూడి)