అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు తీర్మానాలు

 

 

       తెలుగు భాషకు ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప్రపంచభాషగా చేసే కృషిని ఒక ఉద్యమంలా చేపట్టాలని అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు నినదించింది. అమెరికాలో కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించిన ఈ మూడు రోజుల సదస్సు సెప్టెంబర్ 30వ తేదీ శుక్రవారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం శనివారం) ముగిసింది. వివిధ దేశాలకు చెందిన భాషావేత్తలు కంప్యూటర్ రంగ నిపుణులు పాల్గొన్న ఈ సదస్సు పలు తీర్మానాల్ని ఆమోదించింది. ముగింపు సభకు మాజీమంత్రి మండలి బుద్ధ ప్రసాద్ అధ్యక్షత వహించారు.

 

సమాచార సాంకేతిక శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన ఆ శాఖలోని అంతర్జాల సలహామండలి సభ్యులు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణకు తుది రూపమిచ్చారు. అంతర్జాలంలో తెలుగు భాష అభివృద్ధికి తగిన సాంకేతిక ఉపకరణాలను సిద్ధం చేయాలని, కంప్యూటర్లో అందుబాటులో ఉన్న ప్రామాణిక ఉపకరణాలను మన స్థానిక భాషకు అనువుగా మలచుకోవాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోడానికి అవసరమైన బోధన మరియు శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని తెలుగు కోసం వివిధ రకాలైన అనువర్తనాలను రూపొందించాలని తీర్మానించారు. వీటి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ముందు నిలుస్తుందని, ఈ రంగంలో చైతన్యం తీసుకురావాలని మంత్రి అన్నారు. ప్రభుత్వ వెబ్ సైట్లు, రికార్డ్‌లను యూనికోడ్‌కు అనునంధానిస్తూ తెలుగులోనికి మారుస్తామని, త్వరలో ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు.

 

సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ ఈ సదస్సు విజయవంతమయిందని, ఈ సదస్సులో చర్చించిన అంశాలపై రాబోయే రోజులలో విస్తృతమైన అభిప్రాయాల్ని సేకరిస్తామని అన్నారు. వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 21, 22, 23 తేదీలలో విశాఖపట్టణంలో రెండవ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు జరిగేనాటికి చాలా పురోగతి సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. సదస్సు అధ్యక్షులు టోక్యో విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పేరి భాస్కరరావు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆచార్య ఆవుల మంజులత, శాసనమండలి సభ్యులు ఐలాపురం వెంకయ్య, సమాచార సాంకేతిక శాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ జాజు, నాలెడ్జ్ సొసైటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమరనాథ్ రెడ్డి, అంతర్జాల సలహా మండలి సభ్యులు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, e-తెలుగు అధ్యక్షులు వీవెన్, సిలికానాంధ్ర అధ్యక్షులు కొండుభొట్ల దీనబాబు, సమన్వయకర్త చామర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.

 

చివరి రోజున "హిందీ - తెలుగు ద్వైదిశాత్మక యంత్రానువాదం" అంశంపై ఆచార్య  జి. ఉమామహేశ్వరరావు పత్ర సమర్పణ చేశారు. అనంతరం ఆచార్య  పేరి భాస్కరరావు, టోకియో (అధ్యక్షులు), ఆచార్య ఆవుల మంజులత, (పూర్వ అధ్యక్షులు, తెలుగువిశ్వవిద్యాలయం) ఆచార్య అనుమాండ్ల భూమయ్య (పూర్వ అధ్యక్షులు, తెలుగు విశ్వవిద్యాలయం) తదితరులు "అంతర్జాలంలో తెలుగు" అన్న అంశంపై  సమీక్ష మరియు భవిష్యదవకాశాలపై చర్చించారు.

 

భాషాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం దోహదం: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

 

తెలుగు భాష అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సిలికానాంధ్ర, రాష్ట్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ సంయుక్తంగా కాలిఫోర్నియాలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు ముగింపు సభకు ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీడియో సందేశాన్ని ఇచ్చారు. తెలుగు అత్యంత ప్రాచీనమైనదే గాక సుసంపన్నమైనదని, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్ల కేంద్రం తెలుగుకు విశిష్ట భాషా హోదాను కల్పించిందని ఆయన గుర్తు చేశారు. ఇది మనకు గర్వకారణమని అన్నారు. ఈ గుర్తింపును పూర్తిగా వినియోగించుకొని సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో భాషను అభివృద్ధి చేయాలని ఇందుకు తగిన సూచనలు అందజేయాలని కిరణ్ కుమార్ రెడ్డి సదస్సులో పాల్గొన్న పరిశోధకులను కోరారు. అమెరికాలో తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు గణణీయమైన సేవలందిస్తున్న సిలికానాంధ్రను ముఖ్యమంత్రి అభినందించారు. వివిధ దేశాల నుండి విచ్చేసిన భాషా వేత్తలు, అంతర్జాలం, కంప్యూటర్ నిపుణులు ముఖ్యమంత్రి సందేశ ప్రసారాన్ని తిలకించేందుకు వీలుగా సిలికానాంధ్ర ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

Read More on...