యూనికోడ్‌లో తెలుగు ఒదిగిపోవాలి: అంతర్జాల సదస్సు
యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం తీసుకున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని యూనికోడ్ కన్సార్షియం ఉపాధ్యక్షురాలు లిసామూర్ వెల్లడించారు. తెలుగు భాషకు సంబంధించిన కంప్యుటేషనల్ భావనలపై కాలిఫోర్నియాలోని మిల్‌పిటాస్‌లో ఇండియన్ కమ్యూనిటీ సెంటర్ వేదికగా బుధవారం ఘనంగా ప్రారంభమైన మూడు రోజుల అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు (International Telugu Internet Conference, 2011)లో ఆమె కీలకోపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ తోడ్పాటుతో సిలికానాంధ్ర నిర్వహించిన ఈ సదస్సుకు పలు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
సమాచార సాంకేతిక రంగంలో తెలుగువారు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని, సమాచార-సాంకేతిక విజ్ఞాన ప్రగతికి తెలుగు పౌరులు చేస్తున్న కృషి నిరుపమానమని లిసామూర్ పొగడ్తల జల్లు కురిపించారు. తెలుగుభాష యూనికోడ్‌లో పూర్తిగా ఒదిగిపోవాలంటే తెలుగుపండితులు, పరిశోధకులు, కంప్యూటర్ రంగ నిపుణులు మరింత క్రియాశీలం కావాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. యూనికోడ్‌లో ఇప్పటికే తెలుగు భాషకు సంకేత పట్టిక (code chart) రూపకల్పన పూర్తయిందని వెల్లడిస్తూ తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, దేవనాగరి లిపులను కూడా యూనికోడ్‌లోకి తీసుకువచ్చామన్నారు. అయితే ప్రాంతీయ భాషల విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయన్నారు.
ఇక తెలుగు భాషలో విద్యాభ్యాసం చేస్తే ఉద్యోగాలు దొరకవనే అపనమ్మకాన్ని తొలగించాలన్నది కూడా ఈ సదస్సు లక్ష్యాల్లో ఒకటని స్వాగతోపన్యాసం చేసిన సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆనంద్ కూచిభోట్ల నొక్కి చెప్పారు. ప్రాచీనభాషగా గౌరవాన్ని దక్కించుకున్న తెలుగు భాషకు అంతర్జాతీయ భాషగా గుర్తింపు లభించాలంటే తెలుగువారంతా తక్షణం నడుం బిగించాలని స్పష్టం చేశారు. ఇంటర్‌నెట్‌లోగానీ, మొబైల్ ఫోన్‌లోగాని మాతృభాషలో ఎస్ఎంఎస్‌ను పంపలేని నిస్సహాయస్థితి తెలుగువారికి ఉండరాదన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ప్రపంచంలోని సాఫ్ట్‌వేర్ నిపుణులను పరిశీలిస్తే ప్రతి ముగ్గురిలో ఒకరు భారతీయులై ఉంటారని, వీరిలో కూడా ప్రతి ముగ్గురు భారతీయుల్లోనూ ఒకరు తెలుగువారై ఉంటారని ఈ సభలో ప్రసంగించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మరియు కమ్యూనికేషన్ల మంత్రి పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. యూనికోడ్ కన్సార్షియంలో మన రాష్ట్రం శాశ్వత సభ్యత్వాన్ని స్వీకరించడమేగాక, తెలుగులో ఆరు రకాల ఖతుల (fonts) రూపకల్పనకు కార్యరంగం సిద్ధమైందన్నారు. ఇందుకు 36 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తెలియజేస్తూ వాటిలో ఒక 'ఫాంట్' అభివృద్ధికి వ్యక్తిగతంగా 6 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్టు సభాముఖంగా ప్రకటన చేశారు. అంతర్జాలంలో తెలుగుభాష వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని, ఆ తరుణం వచ్చిందని అన్నారు (మంత్రి పొన్నాల ప్రకటన నేపథ్యంలో ఒక తెలుగు ఫాంట్‌కు "పొన్నాల" అని పేరు పెడతారు). ఇంటర్‌నెట్‌లో తెలుగుభాష ప్రయోజనార్థం మంత్రి బాటలో పలువులు ముందుకు రావాలని నిర్వాహకులు కోరారు.
ప్రపంచంలో తెలుగువారిని ఏకం చేసేది ఇంటర్‌నెట్ ఒక్కటేనని మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొనగా, ఈ అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సు భవిష్యత్తులో ఇంటర్‌నెట్ వినియోగానికి మార్గనిర్దేశం చేసే చరిత్రాత్మక సందర్భమని అకాడమీ ఛైర్మన్ పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కొనియాడారు. యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌కు ఓటింగ్ హక్కు కూడా ఉంటుందన్న ఐటి శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, స్పెల్ చెకర్లు, ఎడిటర్లు, బ్రౌజర్లను రూపొందిస్తే తెలుగుభాషకు మరింత ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర శాసనమండలి సభ్యులు అయిలాపురం వెంకయ్య, ఏపీ సొసైటీ ఫర్ నాలెడ్జ్ నెట్‌వర్క్స్ సి.ఇ.ఓ. అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు అంతర్జాలంలో తెలుగుభాష ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు.
ఈ సదస్సు లక్ష్యాలను సదస్సు అధ్యక్షుడు ఆచార్య పేరి భాస్కరరావు వివరించగా, కీలకోపన్యాసం చేసిన యూనికోడ్ కన్సార్షియం ఉపాధ్యక్షురాలు లిసామూర్ గురించి కార్యక్రమ అధ్యక్షుడు ఆచార్య ఉమామహేశ్వరరావు సభకు పరిచయం చేశారు. ప్రార్థనా గీతంతో మొదలైన ఈ సదస్సులోని ఆహూతులకు స్థానిక నిర్వాహక బృందానికి నేతృత్వం వహించిన చామర్తి రాజు స్వాగతం పలికారు.
సదస్సులో భాగంగా క్రింది అంశాలపై పత్ర సమర్పణ జరిగింది:
తెలుగు సంగణకంలో ముఖ్యాంశాలు : అంతర్జాలంలో వాటి ఉపయోగాలు (Essentials of Telugu computing for applications in internet) - ఆచార్య పేరి భాస్కరరావు.
తెలుగు గుణింత పరిష్కరిణి (Telugu Spell-checker) - ఆచార్య ఉమామహేశ్వరరావు.
మెరుగైన సమాజసేవా కార్యక్రమాల్లో ఇంటర్నెట్ పాత్ర - శ్రీ చెన్నూరి వెంకట సుబ్బారావు.
తెలుగు లిపి సంస్కరణలు (Reforms to Telugu Script), తెలుగు సాహిత్య వాదాలకు సంగణక పద్ధతుల ద్వారా పరిష్కారాలు (Use of Computational Methods to resolve Literary Controversies) - శ్రీ కొలిచాల సురేశ్.
తెలుగులో భాషాంతర సమాచార ప్రాప్తి (Cross Language Information Access in Telugu) - డాక్టర్ కలిదిండి వాసుదేవ వర్మ.
తెలుగు అధివ్యాకరణం (Telugu HyperGrammar) - డాక్టర్ కె రాజ్యరమ.
తెలుగు సాహిత్య పదప్రయోగకోశాల తయారీ కొరకు సంగణక అనువర్తనాలు (Computer application for preparation of concordances for Telugu literary texts) - ఆచార్య కర్నాటి తోమాసయ్య.
వ్యాకరణ నిర్మాణంలో లాఘవం: సంగణక ఉపకరణాలు, అనువర్తనలు - డాక్టర్ పమ్మి పవన్ కుమార్.
తెలుగు భాషా వికాసంలో తెలుగుపత్రికల కృషి - ఆచార్య ఎం నాగేశ్వరరావు.