అంధ విద్యార్థులకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో లాప్‌టాప్‌లు
 (Visually challenged students to receive laptops from APVCC with specialized software)

 

     జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద అంధ విద్యార్థులకు లాప్‌టాప్‌లను ఉచితంగా అందజేయాలని ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ (ఎపివిసిసి) సంకల్పించింది.

 

ఇందుకు సంబంధించి అంధ విద్యార్థుల సమగ్ర వివరాలతో కూడిన జాబితాను అందజేయాల్సిందిగా కోరుతూ Information Technology (IT), ఇతర సాంకేతిక విద్యలను బోధించే పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు ఎపివిసిసి ఇప్పటికే లేఖలు పంపింది. సాంకేతిక విద్యల్ని అభ్యసిస్తున్న అంధ విద్యార్థులకు లాప్‌టాప్‌లను ఉచితంగా అందించాలని నిర్ణయించామని, ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా అర్హత (విద్యార్థుల ఆర్థిక పరిస్థితి తదితరాలు) గల అంధ విద్యార్థులను గుర్తిస్తామని ఎపివిసిసి మేనేజింగ్ డైరక్టర్ కె భీమారెడ్డి చెప్పారు. తమ సంకల్పాన్ని వివరిస్తూ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ళకు లేఖలు పంపామన్నారు.

 

అంధ విద్యార్థులకు అందజేసే లాప్‌టాప్‌లలో వారికి ఉపయోగపడేలా NVidia అనే ఒక ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను వ్యవస్థాపిస్తారు. ఇందుకుగాను ఒక ప్రయివేట్ సంస్థ ఎపివిసిసికి చేయూతనిస్తున్నది. ముందుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను వ్యవస్థాపించిన కొన్ని లాప్‌టాప్‌లను ఎంపిక చేసిన అంధ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ఇస్తారు. వారికి అవి ఎలా ఉపయోగపడుతున్నాయనేది విశ్లేషించి, ఆ ఫలితాల్ని బట్టి తదుపరి మార్పు చేర్పులకు శ్రీకారం చుడతారు. అంధ విద్యార్థులు కూడా onlineలో పుస్తకాలు చదువుకోవడానికి, చాట్ చెయ్యడానికి, e-mail పంపుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి అనుగుణంగా లాప్‌టాప్‌లలో ఏర్పాట్లు చేశారు. ఒక విద్యార్థి లాప్‌టాప్‌లో  తరచుగా ఉపయోగించుకునే కార్యకలాపాల క్రమాన్ని ఒకే బటన్ లేదా కీ ద్వారా అందుబాటులో ఉంచే సదుపాయం కూడా కల్పించారు.

 

తక్కువ ఖర్చు, సులభమైన, సహజమైన పద్ధతులతో ముందుకెళ్ళాలన్న భావన నేపథ్యంగా ఈ సంకల్పానికి ఎపివిసిసి రంగం సిద్ధం చేసింది. వివిధ కళాశాలల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సుమారు 300 మందికి పైగా అంధ విద్యార్థుల్ని గుర్తించారు. ప్రత్యేకించి ఐటీ విద్య అభ్యసిస్తున్న అంధ విద్యార్థులకు ఉపయోగపడేలా మరో సాఫ్ట్‌వేర్ రూపకల్పన దిశగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయని ఎపివిసిసి ఎండి చెప్పారు.