మీ కంప్యూటర్ మీరు "చెప్పినట్లు" చెయ్యాలంటే ?..
(Your voice to control your computer.)
మీరు ఉచ్ఛరించే పదాల ఆధారంగా మీ కంప్యూటర్ స్పందిస్తుందని మీకు తెలుసా ? అవును, కీ బోర్డ్‌తో కాకుండా మీరు నోటితో ఇచ్చే కమాండ్స్ (ఆదేశాలు) ప్రకారం మీ కంప్యూటర్ నడుచుకునేలా చెయ్యవచ్చు. మీరు నోటితో పాఠం చెబుతుంటే కంప్యూటర్ దానిని వింటూ దానంతట అదే టైప్ చేసేలా మలుచుకోవచ్చు. దీనినే Speech Recognition (గొంతును గుర్తించడం) అంటాం. ఇందుకు మీరు ఏమి చెయ్యాల్సి ఉంటుందో తెలుసుకుందాం.
Windows Speech Recognition కార్యకలాపాల్ని ప్రారంభించడానికి ముందుగా మీరు మీ కంప్యూటర్‌ను అందుకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముఖ్యమైన మూడు పనులు చెయ్యాలి. అవేమిటంటే..
1) మైక్రోఫోన్‌ను సిద్ధం చేసుకోవడం
2) కంప్యూటర్‌తో మాట్లాడే విధానాన్ని తెలుసుకోవడం
3) మీ గొంతును గుర్తించి, దానికి అనుగుణంగా స్పందించేలా మీ కంప్యూటర్‌కు శిక్షణనివ్వడం
ముందుగా మీ కంప్యుటర్‌కు మైక్రోఫోన్ అమర్చి Start బటన్ నొక్కండి. తర్వాత Control Panelలోకి వెళ్ళి వరుసగా Ease of Access పైన, Speech Recognition పైన క్లిక్ చెయ్యండి. అక్కడ Set up microphone పై క్లిక్ చెయ్యాలి. అక్కడ స్క్రీన్ మీద కనిపించే సూచనల్ని అనుసరించండి.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. Speech Recognition అనేది మీ మైక్రోఫోన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. వీటిలో హెడ్ సెట్ మైక్రోఫోన్లు, డెస్క్‌టాప్ మైక్రోఫోన్లు అని రెండు రకాలుంటాయి. వీటిలో హెడ్ సెట్ మైక్రోఫోన్లు Speech Recognition కార్యకలాపాలకు బాగా ఉపయోగపడతాయి. డెస్క్‌టాప్ మైక్రోఫోన్ల వల్ల బయటి నుంచి వచ్చే అనవసరమైన శబ్దాలు కూడా రికార్డ్ అయ్యే ప్రమాదముంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్, జపనీస్, సింప్లిఫైడ్ చైనీస్, ట్రెడిషనల్ చైనీస్ భాషల్లో Speech Recognition కార్యకలాపాల్ని నిర్వహించుకోవచ్చు.
కంప్యూటర్‌కు Speech Recognition పద్ధతిలో ఆదేశాలు ఇవ్వడం కోసం మీరు నోటి ద్వారా ఇచ్చే కమాండ్స్‌కు సంబంధించిన పాఠాలతో కూడిన ట్యుటోరియల్ Windowsలో అందుబాటులో ఉంది. సుమారుగా 30 నిమిషాల వ్యవధిలో దీనిని పూర్తి చెయ్యవచ్చు. దీని కోసం ముందుగా Start బటన్ నొక్కి, Control Panelలోకి వెళ్ళి, వరుసగా Ease of Access పైన, Speech Recognition పైన, తర్వాత Take Speech Tutorial పైన క్లిక్ చేస్తే చాలు. ఆ తర్వాత వచ్చే సూచనల్ని అనుసరించండి.
Speech Recognition కార్యకలాపాల్లో మొట్టమొదటి ముఖ్యమైన అంశం ఏమిటంటే మీ గొంతును మీ కంప్యూటర్ గుర్తించడం. దీనిని Voice Profileగా పేర్కొంటారు. ఈ గుర్తింపును అనుసరించి ఆ (మీ) గొంతు ద్వారా వచ్చే ఆదేశాల ప్రకారం సదరు కంప్యూటర్ నడుచుకుంటుంది. మీ Voice Profile ఎంత నాణ్యతతో ఉంటే అంత చక్కగా మీ ఆదేశాల్ని కంప్యూటర్ అర్థం చేసుకుని అమలు చేస్తుంది. కంప్యూటర్ మీ గొంతును గుర్తుపట్టేలా శిక్షణ ఇవ్వడానికిగాను మీరు ఏం చెయ్యాలంటే...
Start బటన్ నొక్కి, Control Panelలోకి వెళ్ళి, వరుసగా Ease of Access పైన, Speech Recognition పైన, తర్వాత Train your computer to better understand you పైన క్లిక్ చెయ్యండి. తర్వాత స్క్రీన్ పై కనిపించే సూచనల ప్రకారం చెయ్యండి.
అంగవికలురకు (చేతి వేళ్ళను ఉపయోగించలేనివారు, అంధులు) Speech Recognition ఎంతగానో ఉపయోగపడుతుంది. అవయువాలు సక్రమంగా ఉన్నవారు ఏ విధంగా అయితే కంప్యూటర్ వాడకం ద్వారా ప్రయోజనాల్ని పొందగల్గుతారో, అంగవికలురు సైతం అలాంటి ప్రయోజనాలు పొందడానికి ఈ సదుపాయం తోడ్పడుతుంది. వర్డ్ ప్రాసెసింగ్ ప్రోగ్రాములను ఉపయోగించి నోటి ద్వారా పాఠం ఇవ్వడానికి, దిద్దుబాట్లు చేసుకోవడానికి, ఇచ్చిన పాఠాన్ని తిరిగి వినడానికి వీలుంటుంది. ఈ కార్యకలాపాల్ని మరింత సమర్థవంతంగా నిర్వహించుకోవడం కోసం Speech Dictionary కూడా ఉంది. వెబ్ బ్రౌజర్‌లో online ఫారాల్ని కూడా ఉచ్ఛారణతో నింపవచ్చు.