తెలుగు బాటలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల అడుగులు...
ఇంటర్నెట్‌లో తెలుగు భాష వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏర్పడిన e-తెలుగు సంస్థ ఆధ్వర్యంలో ఆగస్ట్ 28వ తేదీ ఆదివారం ఉదయం జరిగిన "తెలుగు బాట" కార్యక్రమం తెలుగు వెలుగుల్ని విరబూయించింది. ఆగస్టు 29వ తేదీన వ్యవహారిక భాషా (వాడుక భాష) వాది శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందుగానే ఆయన స్ఫూర్తిని అంది పుచ్చుకున్నారు e-తెలుగు సభ్యులు.
"తెలుగు బాట" కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా e-తెలుగు అధ్యక్షుడు వీవెన్, కార్యదర్శి కశ్యప్ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ సంస్థ సభ్యులతో పాటు పలువురు తెలుగు భాషాభిమానులు, ఇంటర్నెట్‌లో బ్లాగులు, గుంపుల రూపంలో తెలుగు భాష వ్యాప్తికి తమ వంతు చేయూతనిస్తున్న యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, పెద్దలు పాల్గొని తెలుగు కోసం నినదిస్తూ గళమెత్తారు. తెలుగు సంస్కృతి పరిరక్షణే లక్ష్యంగా అమెరికాలో "సిలికానాంధ్ర" సంస్థను నెలకొల్పి విదేశంలోనూ, స్వదేశంలోనూ వివిధ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న ఈ సంస్థ అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ "తెలుగు బాట" కార్యక్రమాన్ని ప్రారంభించారు.
హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న పబ్లిక్ గార్డెన్స్‌లోని తెలుగు లలితకళాతోరణం నుంచి ప్రారంభమైన "తెలుగు బాట" ఊరేగింపు ఎల్బీ స్టేడియం, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్, వంతెన, నిజాం కళాశాల మీదుగా తిరిగి లలితకళా తోరణాన్ని ఆనుకుని ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వద్ద ముగిసింది. తెలుగు కోసం జరిగిన ఈ నడకలో భాగంగా తెలుగు భాషా ప్రేమికులు చేసిన నినాదాలు అక్కడివారిని విశేషంగా ఆకట్టుకున్నాయి...
తల్లి భాషను కాదంటే తల్లిని కాదన్నట్టే - జననిని కాదంటే జగతిన ఉన్నా లేనట్టే..
కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష మరువకండి.. మరువకండి.. ఇదే మన బాస
ప్రాచీనతను సాధించాం - ఆధునికతనూ సాధిద్దాం
పొరుగు భాషను గౌరవించు - మన భాషను ప్రేమించు
జీతం కోసం పరభాష - జీవితం కోసం మన భాష
నా మాట తెలుగు మాట - నా బాట తెలుగు బాట
మమ్మీ డాడీ వద్దయ్యా - అమ్మా నాన్న ముద్దయ్యా
తెంగ్లీష్ వద్దు - తెలుగే ముద్దు.. అంటూ ఎలుగెత్తి చేసిన నినాదాలు మన మాతృభాష గొప్పదనాన్ని చాటి చెప్పాయి.
"తెలుగు బాట" ఊరేగింపు పూర్తయిన తర్వాత శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సభ e-తెలుగు కార్యదర్శి పలివెల కశ్యప్ "మా తెలుగు తల్లి" గీతంతో ప్రారంభమైంది. ప్రముఖ తెలుగు భాషావాది తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం సమన్వయకర్తగా ప్రారంభమైన సభను ఉద్దేశించి e-తెలుగు అధ్యక్షుడు వీవెన్, సిలికానాంధ్ర అధ్యక్షుడు కూచిబొట్ల ఆనంద్, ఎపి నాలెడ్జ్ నెట్‌వర్క్‌స్‌లో ముఖ్య కార్యనిర్వహణాధికారిగా సేవలందిస్తున్న అమర్‌నాథ్ రెడ్డి, e-తెలుగు సభ్యుడు శ్రీనివాసకుమార్, తెలుగు భాషా చైతన్య సమితి కార్యదర్శి గురజాల విజయకుమార్ తదితరులు ప్రసంగించి తెలుగు భాష పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అనంతరం తాడేపల్లి లలితా బాల సుబ్రహ్మణ్యం అక్కడివారిచే తెలుగు పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు.
తెలుగు నా మాతృభాష, నా మాతృభాషను ప్రేమిస్తున్నాను, తెలుగు కవులు, కళాకారులు, రచయితల్ని గౌరవిస్తాం, తెలుగులోని అన్ని మాండలికాలు, శైలులు నాకు సమానమే, అన్ని రంగాల్లోనూ తెలుగే వ్యవహారంలో ఉండడానికి నేను అంగీకరిస్తున్నాను, నేను నా సహోదర తెలుగువారితో ఎల్లప్పుడూ తెలుగులోనే మాట్లాడతాను, వారికి తెలుగులోనే లేఖలు రాస్తాను, తెలుగు రానివారు తెలుగు నేర్చుకోవడానికి సహకరిస్తాను, తెలుగుభాషకు, వారసత్వానికీ ఎక్కడా, ఏ సందర్భంలోనూ, ఎవరివల్లా అవమానం జరుగకుండా అన్నివిధాలుగానూ జాగరూకత వహిస్తాను, తెలుగుభాషకు సంబంధించిన సరైన పరిజ్ఞానాన్ని సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాల్ని కలుగజేస్తాను. నా తెలుగుభాషా వారసత్వాన్ని భావి తరాలకు యథాతథంగా అందించేందుకు ఉద్దేశించిన ప్రతి కార్యకలాపానికీ నా సమర్థన ప్రకటిస్తాను, 2000 సంవత్సరాల చరిత్ర సంస్కృతి, సాహిత్య సంప్రదాయం కలిగిన తెలుగుభాషా వారసత్వం నాకు చాలా గర్వకారణం. ఈ వారసత్వాన్ని సగర్వంగాను, బహిరంగంగాను ప్రకటించుకోవడం నా కర్తవ్యం, దీనిని శాయశక్తులా నిలబెట్టడానికి కృషి చేయడం నా ధర్మం. జై తెలుగు, జై తెలుగు తల్లి అంటూ ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ప్రతినబూనారు.
అనంతరం తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలల వేసి తెలుగు భాషను కాపాడమ్మా అంటూ మనసులోనే చేసుకున్న ప్రార్థనలతో "తెలుగుబాట" కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.