వెకేషన్‌లో ఉన్నారా ?.. real-timeలో షేర్ చేసుకోండి
(Share your vacation in real-time)

 

         పనిభారం, ఒత్తిడితో కూడిన రోజూవారీ జీవితం నుంచి బయటపడి పునరుత్తేజం కోసం కొన్నాళ్ళపాటు విహారయాత్రలకు వెళ్ళాలని ప్రణాళిక వేసుకున్నారు కదూ..! ఒకప్పుడంటే నాలుగురోజులు ఆఫీసుకు సెలవు పెట్టి సరదాగా అలా మన ఊరికెళ్ళి బంధువులు, పాత స్నేహితులతో సరదాగా కాలం గడిపి వచ్చేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. బయటి రాష్ట్రాలకు, ఇంకా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళి ఉల్లాసంగా గడపాలన్నది నేటి తరం ఆలోచన. వీరు ఆలోచనతో సరిపెట్టుకోవడంలేదు. నిజంగానే అంతంత దూరాలు వెళ్ళి అద్భుతాల్ని ఆస్వాదించి సరికొత్త ఉత్సాహంతో తిరిగొస్తున్నారు.

 

గతంలో అయితే మనం ఎక్కడికెళితే అక్కడి నుంచి ఫోన్ చేసి ఆయా విశేషాల్ని బిల్లు తడిసిమోపెడవుతుందన్న భయంతో గబగబా చెప్పేసేవారం. ఫోటోలు తీసుకుని తిరిగొచ్చాక మనవాళ్లకు చూపించేవారం. మరిప్పుడో.. మన విహారయాత్రా విశేషాల్ని మన వారితో పంచుకోవడం కోసం ఇంటికి తిరిగి రావాల్సిన పనిలేదు. ఎంతో అభివృద్ధి చెందిన సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎప్పటికప్పుడు మనమెక్కడున్నా onlineలో మనవారికి అందుబాటులోకి వస్తున్నాం. అప్పటికప్పుడే ఫోటోలు, వీడియోల్ని వారితో పంచుకుని ఆశ్చర్యపరుస్తున్నాం. ఇదంతా ఎలా జరుగుతోందో తెలియనివారు ఇంకా ఎందరో ఉన్నారు. వారందరితోనూ ఈ సాంకేతిక అద్భుతాన్ని పంచుకుందాం.

 

ఈ క్రమంలో Twitter, Facebook, Delicious, YouTube, Where are You Now? (WAYN) లాంటి పలు ఉచిత బ్లాగ్, ఫోటో షేరింగ్, సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్ సైట్లు ఎంతగానో తోడ్పాటునిస్తున్నాయి. ఇక మీరు చెయ్యాల్సిన పనల్లా పైవాటిల్లోంచి మీ అభిరుచికి తగిన సైట్లను ఎంచుకుని వాటిలో అకౌంట్లు ఏర్పాటు చేసుకుని రంగంలోకి దిగడమే. ఒక సోషల్ నెట్‌వర్కింగ్ లేదా ఫోటో షేరింగ్ సైట్‌ను ఇందుకోసం మీరు ఆశ్రయించవచ్చు. ఇలాంటి వాటిల్లో అయితే ఆన్‌లైన్ ఫోటో మేనేజిమెంట్ మరియు షేరింగ్ అప్లికేషన్‌గా Flickr మీకు సహాయపడుతుంది. అదే విధంగా Picasa కూడా మీ ఫోటోల నిర్వహణ, ఎడిటింగ్ మరియు షేరింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ రెండు చోట్లా మీరు అనుమతులను మంజూరు చెయ్యడం, నియంత్రించడం చెయ్యవచ్చు. ఇక Traveljournals.net విషయానికొస్తే ఇందులో మీ చిత్రాల్ని పొందుపరచుకోవచ్చు, సంబంధిత విశేషాల్ని కథనాల రూపంలో పంచుకోవచ్చు. Facebook కూడా ఫోటోల్ని upload చేసుకుని మీ స్నేహితులతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. Windows Live Essentialsలో భాగమై ఉచితంగా అందుబాటులో ఉన్న Windows Live Photo Galleryని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఫోటోల్ని మెరుగుపరచుకోవచ్చు.

 

పై వాటి నుంచి మీకు నచ్చిన సైట్‌లను ఎంచుకున్న తర్వాత ఒకటి రెండు రోజులపాటు వాటిలోని సదుపాయాలను పరిశీలించి ఎలా ఉపయోగించాలన్నది బాగా తెలుసుకోండి. అవసరమనుకుంటే వీటి గురించి బాగా తెలిసినవారి సహాయం తీసుకోండి. ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీ సైట్లే కనుక మీకు అద్భుతమైన కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం లేదు.

 

ఇక వెకేషన్‌కు బయలుదేరేటప్పుడు.. పైన తెలిపిన ప్రకారం onlineలో మీ విశేషాల్ని పంచుకోవడానికి గాను మీ వెంట ఉండాల్సినవి ఏమిటో తెలుసుకోండి...

 

* ఒక డిజిటల్ కెమెరా లేదా కెమెరా ఫోన్

 

* ఇంటర్నెట్ సదుపాయం గల కంప్యూటర్ (మీ స్వంత laptop లేదా కనీసం మీరున్న చోట కంప్యూటర్ సదుపాయం ఉండటం). Wi-Fi phone ఉంటే నెట్ యాక్సెస్ మరింత సులభతరమవుతుంది.

 

* ఒక మీడియా కార్డ్ రీడర్ (మీ laptopకి ఇలాంటిది లేకుంటే..)

 

* విదేశాల్లో అయితే అక్కడి సాంకేతిక పరిస్థితులకు అనుగుణమైన పవర్ అడాప్టర్, చార్జర్ వగైరాలు

 

మీరెక్కడికి వెళుతున్నారో అక్కడ సాంకేతికంగా ఎదురయ్యే అవరోధాలు, సౌకర్యాల గురించి ముందుగానే తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. తద్వారా ఆ పరిస్థితులకు
అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోగలుగుతారు...

 

ఇక హుషారుగా ముందడుగేసి మీ యాత్రా విశేషాల్ని ఎప్పటికప్పుడు పంచుకుంటారు కదూ..

Read More on...