జీవనచిత్రాన్ని పదిలపరిచే Windows Live Movie Maker
విశాలమైన మన జీవితం విభిన్నమైన కోణాల ప్రతిబింబం. బాల్యం మొదలుకొని వృద్ధాప్యం వరకూ అడుగడుగునా జీవితాంతం మననం చేసుకునే సంఘటనలు ఎన్నెన్నో ఉంటాయి. వాటన్నిటినీ నెమరువేసుకుని మురిసిపోతుంటాం. ఒకప్పుడు black & white ఫోటోలు, తర్వాత కలర్ ఫోటోలు మన తీయటి జ్ఞాపకాల గుర్తులై నిలిచాయి. తర్వాత రంగప్రవేశం చేసిన వీడియోలు టైమ్ మెషీన్ల తరహాలో మనల్ని నేరుగా నాటి కాలంలోకి తీసుకెళ్ళి మరోమారు ఆ గడచిన రోజుల్లో కూర్చోబెడతాయి. వీటి ప్రాధాన్యత ఏమిటో మనందరికీ తెలుసు కనుకే ఇప్పుడు అందరి చేతుల్లోనూ డిజిటల్ కెమెరాలు, వీడియో కెమెరాలు, కెమెరా సౌకర్యం ఉన్న మొబైల్ ఫోన్లు ప్రత్యక్షమయ్యాయి.
మనం తీసుకునే ఫోటోలు, వీడియోలను storage media ద్వారా, onlineలోను మనవారితో పంచుకుంటున్నాం. అయితే ఎడిటింగ్ ద్వారా ఈ ఫోటోలు, వీడియోల నాణ్యత పెంచి, అవసరమనుకున్న చోట పేర్లు, చక్కని నేపథ్యం, సంగీతం జోడించి మొత్తం మీద ఊహలకు అనుగుణంగా తీర్చిదిద్ది ఆన్‌లైన్‌లో మూవీ రూపంలో వాటిని అందరికీ అందుబాటులో ఉంచుకోవడానికి తోడ్పాటునిస్తుంది Windows Live Movie Maker. ఇందులోని పలు సౌకర్యాల గురించి తెలుసుకుందాం.
Import చెయ్యండి.. AutoMovie Themes చేర్చండి..
ముందుగా చెయ్యాల్సిందల్లా మీ ఫోటోలు, వీడియోల్ని డిజిటల్ కెమెరా, flash memory card, DVD లేదా మీ మొబైల్ ఫోన్ నుంచి Movie Makerలోకి import చేసుకోవాలి. తర్వాత వాటి నుంచి మీకు కావలసిన ఫోటోలు, వీడియో క్లిప్‌లను storyboardలోకి డ్రాగ్ చేయండి. ఇక కేవలం కొన్ని క్లిక్‌లతోనే AutoMovie Theme జోడింపు.. అట్నుంచి transitions, effects, titles, credits చేరికలతో మీ పని సగం పూర్తయినట్లే
నేపథ్య సంగీతం..
ఈ మొత్తం మూవీకి నేపథ్యంగా మీరు ఏదైనా సంగీతాన్ని నేపథ్యంగా ఉపయోగించుకోవచ్చు. దీనికి ముందు మీ అసలు వీడియోకున్న ఆడియోను మీరు వద్దనుకున్న పక్షంలో దానిని mute చేసుకోవచ్చు. అ తర్వాత మీకు కావలసిన పాట లేదా సంగీతం ఉన్న ఆడియో ఫైల్‌ను దిగుమతి చేసుకుని మీ పనిని సులభతరం చేసుకోవచ్చు.
కావలసినట్లుగా మార్పులు..
మూవీ కోసం మీరు ఎంచుకునే ఫోటోలు, ఆడియో, వీడియో క్లిప్‌లలో మీకు ఎంత భాగం కావాలనుకుంటే అంత భాగాన్ని మాత్రమే ఉపయోగించుకోవచ్చు. Set start point, Set end pointల ద్వారా మొదలు, తుది స్థానాల్ని నిర్ణయించి trim చేసుకోవడం ద్వారా ఈ పని పూర్తి చేసుకోవచ్చు. ఒక వీడియో క్లిప్‌ను మరిన్ని భాగాలుగా split చేసుకుని కావలసిన స్థానాల్లో ఉపయోగించుకోవచ్చు.
వీడియో వేగం పెంపు.. తగ్గింపు..
మూవీ కోసం మీరు ఎంపిక చేసుకున్న ఏదైనా వీడియో క్లిప్పింగ్ భాగం సందర్భాన్ని బట్టి మరింత వేగంగా లేదా మరింత నెమ్మదిగా ప్లే అయ్యేలా ఆయా సెట్టింగ్‌లను అమర్చుకోవచ్చు. ఇందుకోసం Edit టాబ్‌లో ఉన్న Video Toolsలోని Adjust గ్రూపులో Speedను ఎంచుకోవచ్చు.
ఆడియో చేర్పు.. మార్పు..
మూవీ మేకర్ ద్వారా మనం తయారు చేసుకునే మూవీలోని ఫోటోలు లేదా వీడియోలకు తగిన సంగీతం ఉన్న ఆడియో ఫైళ్ళను కూడా వాటికి జోడించుకోవచ్చని తెలుసుకున్నాం కదా. ఈ సంగీతం మెల్లమెల్లగా ప్రారంభమై.. ఆహ్లాదంగా సాగి, చివరికొచ్చే సరికి మెల్లగా ముగిసేలా Fade in మరియు Fade out ఎంపికలను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆడియో ఎక్కడి నుంచీ మొదలై ఎక్కడ ముగియాలో నిర్ణయించుకోవడానికి Options టాబ్‌లో Music Toolsలో ఉన్న Editing గ్రూపు నుంచి Set start point మరియు Set end point ఎంపికలను ఉపయోగించుకోవచ్చు. ఆడియో sound పెంచుకోవడం, తగ్గించుకోవడం కూడా సాధ్యమే.
పై కార్యకలాపాలన్నిటినీ సంతృప్తికరంగా ముగించిన తర్వాత మీ మూవీని సేవ్ చేసుకుని ప్రముఖ వెబ్ సైట్‌లో త్వరితగతిన publish చేసుకుని onlineలో మీ ఆత్మీయులతో పంచుకోవచ్చు. ఇందుకోసం Home టాబ్‌లో Sharing గ్రూపులోకి వెళ్ళి సదరు వెబ్ సైట్‌లో మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఇచ్చి తదుపరి దశలను అనుసరిస్తే చాలు. అనంతరం Watch online ఎంపికతో వెబ్ సైట్ నుంచే ఈ మూవీని వీక్షించవచ్చు.